Thursday, September 2, 2010

పోరాట స్ఫూర్తినిచ్చిన పార్టీ విస్తృత సమావేశాలు

Buzz up! మార్క్సిస్టు సౌజన్యంతో

ప్రజల చేతుల్లో పోరాట సాధనాలుగా ఉన్న కేరళ, బెంగాల్‌ వామపక్ష ప్రభుత్వాలను పరిరక్షించుకోవాల్సిందిగా సిపిఐ(యం) అఖిల భారత స్థాయి విస్తృత సమావేశాలు పిలుపు నిచ్చాయి. 2010 ఆగస్టు 7 నుండి 10 వరకు విజయవాడలో జరిగిన ఈ సమావేశాలు కమ్యూ నిస్టు వ్యతిరేక విమర్శకులకు తిరుగులేని సమా ధానమిచ్చాయి. మాటల్లో కాకుండా తన చేతల ద్వారా పార్టీ విమర్శలను తిప్పికొట్లాయి. గత నాలుగైదేళ్లుగా దేశంలో ఒక పథకం ప్రకారం కమ్యూనిస్టు వ్యతిరేక దుమారం రేగుతోంది. సామ్రాజ్యవాదులు, దేశంలోని దాని బంట్లు కమ్యూనిస్టులపై ప్రత్యేకించి సిపిఎంపై విషాన్ని వెదజిమ్ముతున్నారు. నూతన తరంలో కమ్యూ నిస్టులపై విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఆర్థిక సంస్కరణలు, అమెరికాతో దోస్తీతోనే అభివృద్ధి సాధించగలుగుతామని ఇప్పటిదాకా నమ్మబలి కారు. ఆ భ్రమలు ఆవిరవుతున్నకొద్దీ వారి విశ్వ రూపాన్ని చూపించడం మొదలెట్టారు. ప్రజలపై బలవంతంగా భారాలు రుద్దుతున్నారు. దీన్నే ''ఆర్థిక నియంతృత్వం''గా సిపిఎం పేర్కొన్నది. ఇది క్రమంగా ప్రజల ప్రజాతంత్ర హక్కుల్ని కూడా హరిస్తోంది. ఇప్పటికే పలురూపాల్లో ఈ దాడి సాగుతోంది. దీన్ని ఎదుర్కోవాలంటే వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమం బలపడాలి. దీనికి కేంద్రస్థానంలో ఉన్న సిపిఎం తన బలహీ నతలను అధిగమించి ప్రజలకు చేరువకావాలి. ప్రజలకు విశ్వాసం కల్పించాలంటే వామపక్ష ఐక్యత మరింత బలపడటంతో పాటు సిపిఎం తన స్వతంత్ర పాత్రను పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సమావేశాలు నొక్కిచెప్పాయి.

సమావేశాల అజెండా-పరిమితి

ఈ రూపంలో కేంద్రకమిటీ విసృత సమా వేశాలు నిర్వహించడం పార్టీ ఏర్పడిన తర్వాత ఇదే తొలిసారి. ఈ అసాధారణ సమావేశాల నిర్వహణకు ప్రత్యేక కారణముంది. మామూ లుగా 2011 మార్చిలో అఖిలభారత 20వ మహాసభలు జరగాల్సి ఉంది. అయితే అదే సమయంలో రెండు ముఖ్య వామపక్ష కేంద్రా లుగా ఉన్న కేరళ, బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు న్నందువల్ల ఈ మహాసభలను ఒక సంవత్స రంపాటు వాయిదా వేయాలని కేంద్రకమిటీ నిర్ణ యించింది. రాజకీయ ఎత్తుగడలు మూడేళ్ల కోమారు జరిగే మహాసభల్లో రూపుదిద్దుకుం టుంటాయి. 2009 పార్లమెంటు ఎన్నికలనం తరం మారిన రాజకీయ పరిస్థితులు, బలా బలాల మధ్య రాజకీయ ఎత్తుగడలను సమీక్షించు కొని మారిన నూతన పరిస్థితుల కనుగుణంగా ఎత్తుగడలను రూపొందించు కోవాల్సి ఉంటుం ది. అప్పుడే ఫలితాలు కూడా సరిగ్గా ఉంటాయి. గతితార్కిక పద్దతులకనుగుణంగా అంచనాలు వేసుకోవడం, ఆ అంచనాకనుగుణంగా ఎత్తు గడలు నిర్ణయించుకోవడం మార్క్సిస్టుపార్టీకి ఆన వాయితీ. ఇందులో ఎక్కడ పొరపాటు జరిగినా తప్పులు జరుగుతాయి. కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిరంతరం వెంటాడుతున్న సమస్య ఇదే. ఆ రీత్యా మహాసభల వరకు ఆగకుండా మధ్యలో ఈ సమావేశాలు నిర్వహించాలని కేంద్రకమిటీ నిర్ణయించింది. ఈ సమావేశాలు తీసుకున్న నిర్ణ యాలు వచ్చే మహాసభల వరకు అమలవుతాయి. అందువల్లనే ఈ సమావేశాలు రాజకీయ ఎత్తు గడలు నిర్ణయించడానికే పరిమితమయ్యాయి. నిర్మాణ అంశాల జోలికిపోలేదు. రాబోయే మహాసభల్లో అన్ని అంశాలూ సమగ్రంగా చర్చిం చబడతాయి. ఈ సమావేశాలకున్న పరిమితి ఇదే.

రాజకీయ శత్రువులకు ప్రజలు, పార్టీ ఇచ్చిన సమాధానం

పార్టీపై గత కొంతకాలంగా సాగుతున్న విషప్రచారాలకు ఈ సమావేశాలు ఐక్యగొంతు కతో సమాధానమిచ్చాయి. పార్టీలో ముఠాలు న్నాయని, బెంగాల్‌, అఖిలభారత కేంద్రం మధ్య భేదాభిప్రాయాలున్నాయని వాగుతూ వచ్చారు. ఈ సమావేశాలు రాజకీయ తీర్మానాన్ని దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించడం ద్వారా అలాంటి వారికి చేతలతోనే సమాధానమిచ్చింది. రెండు రోజుల పాటు జరిగిన చర్చల్లో 45 మంది పాల్గొన్నారు. ప్రధానకార్యదర్శి నివేదిక, తీర్మా నం ప్రవేశపెట్టాక దానిపై రాష్ట్రాల వారీ గ్రూపు చర్చలు జరిగాయి. ప్రతినిధులు కూలంకుషంగా అధ్యయనం చేసి చర్చించుకున్నారు. ఆపైన వారి తరపున చర్చల్లో పాల్గొన్నవారు తమ అభిప్రా యాలను నిర్మొహమాటంగా చెప్పారు. రాత పూర్వకంగా అనేక సవరణలు వచ్చాయి. వాటిపై పొలిట్‌బ్యూరో, కేంద్రకమిటీలు సమీక్ష చేసి కొన్నింటిని ఆమోదించాయి. మరికొన్నింటికి వివరణలు ఇచ్చాయి. ఈ రకంగా బూర్జువా పార్టీల సంప్రదాయాలకు భిన్నంగా అత్యంత ప్రజాస్వామికంగా నిర్ణయాలు జరిగాయి. కొన్ని బూర్జువాపత్రికలు పేర్కొన్నట్లుగా ఏ ఒక్క ప్రధాన కార్యదర్శో లేక కొద్దిమంది పొలిట్‌బ్యూరో సభ్యులో కూర్చొని చేసిన నిర్ణయాలు కావవి. దేశంలోని ముఖ్యనాయకత్వమంతా కూర్చొని చేసిన ఉమ్మడి నిర్ణయాలు. అలాగే ఆఖరిరోజు జరిగిన ప్రజా ప్రద ర్శన, బహిరంగసభ కమ్యూనిస్టు ద్వేషులకు దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చాయి. అంచ నాలకు మించి జనం వచ్చారు. రావడమే కాదు ఆద్యంతం నాయకుల ఉపన్యాసాలను సావధా నంగా విన్నారు. పార్టీయే కాదు పార్టీని అనుసరి స్తున్న జనం కూడా ఎంత క్రమశిక్షణతో, పట్టు దలతో ఉన్నారో ఈ ఉదంతం వెల్లడించింది. నాయకుల ఉపన్యాసాలతో ప్రజలు ఉత్సాహ పడితే, ప్రజల పట్టుదలను చూసి నాయకులు ఉత్తేజితులయ్యారు. మావో అన్నట్లుగా ప్రజల నుండి ప్రజల వద్దకు అంటే ఇదే. రాష్ట్రంలో గత ఎన్నికల తర్వాత సిపిఎం పని అయిపో యిందని ప్రచారం చేసిన వారు ఈ సభను చూసి అవాక్కయ్యారు. వారి నోటి వెంట మాట రాలేదు. కుక్కకాటుకి చెప్పుదెబ్బ అన్నట్లుగా ఇలాంటి కుహనా విమర్శకులకు జనం ఇలా మాధానం చెప్పారు. అలా ఈ రెండు విషయా ల్లో మహాసభలు ప్రత్యేకతను నిరూపించాయి. ఈ మహాసభల సందర్భంగా రాష్ట్రంలో పార్టీ చురుగ్గా కదిలింది. ఎన్నికలనంతరం ఆవహిం చిన స్తబ్దత తొలగిపోయింది. ప్రజలే కార్యకర్తల వెన్ను తట్టి కదిలించారు.

ఏమిటా నూతన పరిస్థితులు

1. 2009 ఎన్నికల్లో కాంగ్రెసు మరింతగా బలపడి తిరిగి మిత్రుల మద్దతుతో అధికారాన్ని చేపట్టింది. ఈ సారి వామపక్షాల మద్దతు లేకుం డానే అధికారానికి రాగలిగింది. అందువల్ల ప్రజా వ్యతిరేక సంస్కరణలను మరింత వేగం గా, బలంగా అమలు జరపడానికి పూనుకున్నది.

2. ఈసారి పార్లమెంటులో వామపక్షాల బలం గణనీయంగా పడిపోయింది. స్వాతంత్య్రా నంతరం ఎన్నడూ లేనంత తక్కువస్థానాలొచ్చా యి. వర్గ శత్రువుల కేంద్రీకరణ గతంలో ఎన్న టికన్నా ఈ సారి ఎక్కువైంది.

3. దేశ వ్యవహారాల్లో అమెరికా ప్రత్యక్ష పాత్ర పెరిగింది. అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా వ్యూహానికి భారతదేశం భాగస్వామిగా మారింది.

4. మతోన్మాదం వికృతరూపం దాల్చి టెర్రరిజంగా మారుతోంది. కొత్తగా హిందూ మతోన్మాదం నుండి టెర్రరిస్టులు పుట్టుకొస్తు న్నారు. మాలెగావ్‌, మక్కామసీదు, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో వీరి హస్తం బట్టబయ లైంది.

5. ప్రాంతీయపార్టీలపై ప్రజల్లో విశ్వస నీయత తగ్గుముఖం పట్టింది. ఆ శక్తులు అనేక రాష్ట్రాల్లో క్రమంగా బలహీనపడుతున్నాయి.

6. కమ్యూనిస్టు వ్యతిరేక విషప్రచారం పెరుగుతోంది. కార్పొరేట్‌ మీడియా పనిగట్టుకొని కమ్యూనిస్టులపై ప్రజల్లో విశ్వసనీయతను తగ్గించ డానికి, ఇతర పార్టీలకూ, కమ్యూనస్టులకూ మధ్యతేడా ఏమీ లేదన్నట్లుగా చూపించడానికి తెగ తాపత్రయపడుతోంది.

7. బెంగాల్‌ వామపక్ష కూటమిని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించడానికి మమతా మొదలుకొని మావోయిస్టుల వరకు అనేక రకాల శక్తులు ఒక్కటయ్యాయి. సిపియం కార్యకర్తలను దారుణంగా హత్యలు చేస్తున్నారు. వారు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఊళ్ల నుండి తరిమేస్తున్నారు. ఈ ఏడాదిన్నరలో 250 మందికిపైగా హత్యగావించబడ్డారంటే పరిస్థితి ఎంత విషమం గా ఉందో అర్ధమవుతోంది.

8. అంతర్జాతీయంగా పెట్టుబడిదారీ సంక్షోభం ఇప్పుడిప్పుడే సమిసిపోయేటట్లుగా కనిపించడం లేదు. కోలుకోడానికి ఊహించిన దాని కన్నా ఆలస్యమయ్యేటట్టు కనిపిస్తున్నది. చైనాపై కూడా ఈ సంక్షోభప్రభావం ఉన్నప్పటికీ అభివృద్దిలో దాని వేగం తగ్గిందే తప్ప వెనకబడి లేదు. ఈ విషయంలో మన దేశం కన్నా చైనా మెరుగ్గా ఉంది. బహుళధృవ ప్రపంచం దిశగా పరిణామాలు వేగంగా సాగుతున్నాయి. లాటిన్‌ అమెరికాలో వామపక్ష హవా కొనసాగుతోంది. ఇది ఒకరకంగా సానుకూల పరిణామం.

9. ప్రపంచ సంక్షోభానంతరం గత రెండే ళ్లలో ప్రజల నుండి ప్రతిఘటన కూడా పెరుగు తోంది. యూరోపును సమ్మెల వెల్లువ ఆవహిం చింది. గ్రీస్‌లో ఏడాదిన్నరలో 13 సాధారణ సమ్మెలు జరగాయంటేనే ప్రజల్లో పెరుగుతున్న అసహనాన్ని అంచనా వేసుకోవచ్చు. ప్రత్యామ్నా య విధానాలపై ప్రపంచవ్యాపితంగా జోరుగా చర్చలు సాగుతున్నాయి. పెట్టుబడిదారీ సంస్క రణల బండారాన్ని ఇది బట్టబయలు చేస్తోంది.

ఈ మార్పులన్నిటినీ అంచనా వేసి తదను గుణంగా ఎత్తుగడల్లో మార్పు చేసుకోడానికి సిపిఎం నడుం కట్టింది. అయితే ఎత్తుగడలు నిర్ణ్ణయించుకోబోయే ముందు గత మహాసభ తర్వాత జరిగిన పరిణామాలపై సమీక్ష కూడా అవసరమని కేంద్రకమిటీ భావించింది. అందు వల్ల ఈ సమావేశాల్లో రాజకీయ సమీక్ష, తీర్మా నం అనే రెండు భాగాలపై ఒకేసారి చర్చ జరిగింది.

రాజకీయ సమీక్ష

గత మహాసభ తర్వాత జరిగిన ముఖ్య పరిణామాలను నివేదిక మూడు అంశాలుగా విడగొట్టింది. ఒకటి: యుపీఏ ప్రభుత్వానికి వామపక్షాల మద్దతు ఉపసంహరణ, తదనంతర పరిణామాలు. రెండు: ఎన్నికలు-ఎత్తుగడలు. మూడు: ఎన్నికలనంతర పరిణామాలు, సిపిఎం వైఖరి.

మద్దతు ఉపసంహరణపై సిపిఎంలో తీవ్ర విబేధాలున్నట్లుగా మీడియా చిత్రీకరించింది. దీని వల్లనే బెంగాల్‌లో తృణమూల్‌తో కాంగ్రెసు చేతులు కలిపిందని, అందువల్లనే వామపక్షం ఓడిపోయిందని ఈ వాదన సారాంశం. కాని వాస్తవం దీనికి భిన్నం. మద్దతు ఉపసంహరణకు ముందే జరిగిన బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో సైతం వామపక్షం దెబ్బతిన్నది. పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది శాతం ఓటింగు తగ్గింది. ఇందులో ఎక్కువభాగం వామపక్షం నుండి వేరుపడిన గ్రామీణ, పట్టణ పేదవాళ్లు వ్యతి రేకంగా ఓటు చేసినందువల్లనే దెబ్బతిన్నామని ఆ రాష్ట్రకమిటీ విశ్లేషించింది. కాంగ్రెసు, తృణమూల్‌ కలవడం వల్ల పెరిగిన ఓటింగు కన్నా మన నుండి దూరం అయిన జనం వల్ల తగ్గిన ఓట్లే ఎక్కువ. ఇద్దరూ విడివిడిగా పోటీ చేసినా బయటపడటం అంత సులభమేమీ కాదు. ఇది లెక్కలు చెపుతున్న వాస్తవం. తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో రెండుపార్టీలు వేర్వేరుగా పోటీ చేసినా కూడా ఫలితాలు భిన్నంగా రాలేదు. అందువల్లనే ప్రజలకు తిరిగి సన్నిహితం కావడానికి అక్కడ సిపియంతో సహా వామపక్షాలు ప్రధాన కర్తవ్యంగా తీసుకున్నాయి. జరిగిన తప్పుల్ని ఆత్మవిమర్శనాపూర్వకంగా పరిశీలించుకున్నాయి. పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ సమావేశాల్లో బెంగాల్‌ ప్రతినిధివర్గం తీర్మానానికి అనుకూలంగా సంపూర్ణంగా ఓటు చేసింది. అదే ఈ దుష్ప్ర చారానికి జవాబు.

మద్దతు ఉపసంహరణ సరైందే

అయితే అదే సమయంలో మద్దతు ఉపసంహరించుకున్న అంశంపై సమీక్ష కొన్ని తప్పుల్ని గుర్తించింది. అమెరికా అణుఒప్పం దానికి వ్యతిరేకంగా ఈ మద్దతు ఉపసంహరణ జరిగింది. దానిపై ప్రజలకు పూర్తి అవగాహన లేదు. పాలకుల ప్రచారానికి ప్రజలు గుర య్యారు. ఈ అంశం ప్రజల దైనందిక సమస్య కానందున వారికి పట్టలేదు. ఈ అంశానికి ప్రజల దైనిందిక సమస్యలను జోడించడంలో పార్టీ విఫలమయిందని సమావేశం గుర్తిం చింది. ఇక రెండో అంశం: అణు ఒప్పందంపై పార్టీ వైఖరి సరిగ్గానే ఉంది. ప్రభుత్వం ఐఏఈఏ తో చర్చలకు వామపక్షాలు తొలి నుండీ వ్యతిరే కిస్తూ వచ్చాయి. ఒక దశలో ఉపసంహరణకు కూడా సిద్దపడ్డాయి. కాని యుపీఏ, కాంగ్రెసు నాయకత్వాలు ఈ సమస్య నుండి బయట పడటానికే చర్చలని, ఒప్పందం చేసుకోబోమని హామీ ఇవ్వడంతో దాన్ని నమ్మి చర్చలకు అంగీక రించడం జరిగింది. ఇది కూడా పొరపాటని కేంద్రకమిటీ చేసుకొన్న ఆత్మవిమర్శను ఈ సమావేశం ఆమోదించింది. ఈ విషయంలో కోయంబత్తూరు మహాసభ అంచనా కూడా తప్పింది. వామపక్షాలను కాంగ్రెసు నాయకత్వం మోసగించింది. వారి వర్గస్వభావంపై అవగా హన ఉన్నా వామపక్ష నాయకత్వం ఎందుకు భ్రమలకు గురయింది. దానికి కారణం అంచ నాలో ఉన్న పొరపాటు. కాంగ్రెసు బలహీనతను ఎక్కువ అంచనా వేసుకున్నాం. దాని శక్తిసామ ర్ద్యాలను తక్కువ అంచనా వేశాం. మన బలాన్ని, ప్రభావితం చేయగలశక్తిని ఎక్కువ అంచనా వేసుకున్నాం. దానికి జాతీయ, అంతర్జా తీయ బడాపెట్టుబడిదారీ వర్గాల మద్దతుతో వచ్చిన నూతన జవసత్వాలను సరిగ్గా అంచనా వేయలేకపోయాం. ఐఈఏఈ దగ్గరకు వెళ్లిడానికి ముందే దాన్ని అడ్డుకొని ఉండాల్సిందని కేంద్ర కమిటీ అభిప్రాయపడింది. కాంగ్రెసు ఒప్పం దానికి కట్టుబడి ఉంటుందనుకొని కీలక సమయంలో వదిలేయడం తప్పని సమావేశం అభిప్రాయపడింది.

ఎన్నికల్లో బెంగాల్‌, కేరళల్లో పార్టీ ప్రతి కూల పరిస్థితిని ఎదుర్కొంటున్న అంశంపై తొలినుండీ కేంద్రకమిటీకి అవగాహన ఉంది. అయితే ఇంతగా దెబ్బతింటామని ఊహించ లేదు. దీనికి రాజకీయ ఎత్తుగడలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న నిర్మాణ, పరిపాలనా సంబంధ మైన బలహీనతలు కారణమని సమావేశం అభిప్రాయపడింది. విశ్వసనీయత లేని ప్రాంతీయపార్టీలపై ఎక్కువ ఆధారపడటం, కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన వారితో కలసి జాతీయస్థాయిలో ఎన్నికల ప్రత్యామ్నాయం నిర్మించాలనుకోవడం, ఆ భ్రమతో ఏకంగా ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు పిలుపున్విడం తప్పని గత ఎన్నికల సమీక్షలో పేర్కొన్న అంశాన్ని ఈ సమావేశాలు ధృవీక రించాయి. ఇక్కడ కూడా అతి అంచనాయే కారణం. ఇది కార్యకర్తల్లో ఎక్కువ నిరాశకు కారణమైంది. పార్టీ అంతర్గత నిర్మాణ పరిస్థితి, ఎన్నికల ఎత్తుగడల్లో ఇతరపార్టీలతో వ్యవహరిం చే సందర్భంలో దొర్లిన పొరపాట్లు కేరళలో మనల్ని దెబ్బతీశాయి. అంతకు ముందు వరు సగా మూడు ఎన్నికల్లో విజయం సాధించిన ప్పటికీ ఈసారి నష్టపోక తప్పలేదు. బెంగాల్‌లో 2006లో 51శాతం ఓటింగుతో ఘనవిజయం సాధించినప్పటికీ 2007 తర్వాత నందిగ్రామ్‌, సింగూరు సంఘటనలతో పార్టీ ఒంటరిదైంది. సామ్రాజ్యవాదుల వందిమాగధులు, కార్పొరేట్‌ మీడియా సాగించిన దుఫ్ఫ్రచారరతో దేశవ్యా పితంగా పార్టీ ప్రతిష్ట దెబ్బతిన్నది. సెజ్‌లకోసం ఇతర రాష్ట్రాల్లో పాలకులు దౌర్జన్యంగా భూసేకరణ చేస్తున్న సందర్భాల్లో పార్టీ జోక్యానికి అంతరాయం ఏర్పడింది. పార్టీ తన చొరవను కోల్పోయింది. ఈ రాష్ట్రాల్లో వారు బెంగాల్‌ను చూపి మన ఉద్యమాలను బలహీనపరచే కుట్రలు సాగించారు. ప్రజలు కూడా వీటిని కొంతవరకు నమ్మారు. బెంగాల్‌ పార్టీ, ప్రభు త్వం జరిగిన పొరపాట్లను గుర్తించి సరిదిద్దుకునే ప్రయత్నం సాగిస్తున్నాయి.

ఎన్నికల ఫలితాలతో దేశవ్యాపితంగా పార్టీ, వామపక్ష శ్రేణుల్లో తాత్కాలికంగా నిరాశ ఆవహించినప్పటికీ క్రమంగా వాటి నుండి బయటపడే ప్రయత్నం చైతన్యయుతంగా చేసిం ది. కొత్తగా అధికారంలోకి వచ్చిన యుపీఏ-2 ప్రభుత్వం వెంటవెంటనే సంస్కరణలను వేగవం తం చేసే చర్యలు తీసుకోనారంభించింది. ప్రజలపై ఒక్కొక్కటిగా భారాలు మోపసాగింది. వామపక్షాలు మద్దతు ఉన్నప్పుడు పెట్రోధరల పెంపుపై అడుగడుగునా అడ్డుతగులుతూ వచ్చా యి. ఒకసారి ధరలు తగ్గించకా తప్పలేదు. వేలకోట్ల రూపాయలను గ్రామీణ ఉపాధిహామీ పథకం లాంటి పేదల సంక్షేమపథకాలకు మళ్లించక తప్పలేదు. అదే కాంగ్రెసుపార్టీ ఈసారి సంక్షేమ వ్యతిరేక చర్యలను తీసుకో నారంభించింది. దేశవ్యాపితంగా రెండుసార్లు బంద్‌లు జరిగినా ధరలు తగ్గించేది లేదని మొండికేసింది. మరోవైపు బడాపెట్టుబడిదారీ వర్గాలకు లక్షలకోట్ల రూపాయల్ని రాయితీలుగా సమర్పించింది. ఇలా నగంగా బడాపెట్టుబడి దారుల కొమ్ముకాస్తోంది. ఈ నూతన పరిస్థితినే పార్టీ తీర్మానం ''ఆర్థిక నియంతృత్వం''గా పేర్కొం ది. దీని పర్యవసానాలు రానున్న కాలంలో ప్రజలపై తీవ్రంగా ఉంటాయి. ఆ పరిస్థితిని ఎదుర్కోడానికి పార్టీ తనను తాను సంసిద్ధం చేసుకోవాలి. ఎలాంటి రాజకీయ పరిస్థితినైనా ఎదుర్కోడానికి వీలుగా పార్టీ నిర్మాణాన్ని బలపరచుకోవాలని తీర్మానం పిలుపునిచ్చింది. ఎన్నికలనంతరం పార్టీలోని నిర్మాణ బలహీన తలను సరిదిద్దడానికి దిద్దుబాటు ఉద్యమం చేపట్టింది. అలాగే మధ్యంతర సమీక్ష ద్వారా నిర్మాణాన్ని పటిష్టపరడానికి ప్రయత్నిస్తున్నది. ఇవి ఫలితాలనివ్వడానికి కొంత సమయం పట్టవచ్చు.

రాజకీయ తీర్మానం

తీర్మానం జాతీయ, అంతర్జాతీయ పరిస్థి తుల్ని క్లుప్తంగా సమీక్షించింది. అంతర్జాతీ యంగా వస్తున్న సానుకూల పరిణామాలను పరిగణనలోకి తీసుకుంది. ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా అమెరికా నాయకత్వంలో సాగు తున్న ఏకధృవ పెత్తందారీతనానికి బ్రేకులు పడ్డాయి. వివిధ రకాల ప్రాంతీయ కూటముల పేర్లతో సాగుతున్న ప్రయత్నాలు బహుళధృవ ప్రపంచాన్ని బలపరుస్తున్నాయి. బ్రిక్‌, షాంఘై కూటమి, లాటిన్‌అమెరికాకు చెందిన ఆల్‌బా, ఏసియాన్‌, సార్క్‌ వంటి అనేక ప్రాంతీయ కూట ములు ఈ కాలంలో బలపడ్డాయి. ఇవి అమెరికా పెత్తనానికి అడ్డంగా నిలబడుతున్నాయి. ఈ కూటముల మధ్య ఆర్థిక, రాజకీయ సహకారం పెరుగుతోంది. అమెరికాలో సైతం ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. దాన్నే ఒబామా రాజకీయంగా సొమ్ము చేసుకొని అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. బుష్‌ నుండి తనను తాను విడగొట్టుకోడానికి ప్రయత్నించినప్పటికీ మౌలి కంగా ఇద్దరికీ పెద్దగా తేడా ఏమీ లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో మరో 30వేల అమెరికా సైన్యాన్ని దించడం, ఇరాన్‌లో జోక్యం తదితర అంశాలు ఆయన కూడా ఆ తానులోని ముక్కే అని నిరూ పిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంతో డాలర్‌ విలువ పడిపోయింది. దాన్ని నిలబెట్టుకోడానికి తృతీయ ప్రపంచదేశాలపై అమెరికా ఒత్తిడి పెంచు తోంది. మరోవైపు ప్రత్యామ్నాయ అరతర్జాతీయ మారకపు కరెన్సీ కోసం ప్రయత్నాలు సాగుతు న్నాయి. అనేక దేశాలు డాలర్‌ నిల్వలను బంగారం రూపంలోకి మార్చుకుంటున్నాయి. అయినా ఇప్పటికీ అమెరికానే అత్యంత బలమైన దేశం. రాజకీయంగా, ఆర్థికంగా ప్రపంచంపై పెత్తనం చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ సవాలును ఎదుర్కోవడమే ప్రపంచ దేశాలు, ప్రజల ముందున్న ప్రధాన కర్తవ్యం. అయితే మన ప్రభుత్వ విధానం మనం ఈ పరిస్థితిని మన దేశప్రయోజనాలకనుగుణంగా వినియోగించలేని స్థితిని కల్పిస్తున్నది. పెరుగు తున్న బహుళధృవ ప్రపంచంలో భాగం కాకుం డా మనల్ని మనం వేరు చేసుకుంటున్నాం. జిత్తులమారి నక్క అమెరికా బుట్టలో పడు తున్నాం. ఇదే అత్యంత విషాదకర పరిణామం. విదేశాంగ విధానంలో మనం స్వతంత్రంగా వ్యవహరించడం ద్వారానే ప్రపంచంలో భారత దేశ ప్రతిష్టను కాపాడగలుగుతామని తీర్మానం హెచ్చరించింది.

జాతీయ రాజకీయాల్లో కాంగ్రెసు ప్రబల మైన శక్తిగా ఎదుగుతోంది. 2014 నాటికి ఏకైక రాజకీయ శక్తిగా తిరిగి దేశంపై ఏకఛత్రాధి పత్యాన్ని రుద్దడానికి ప్రణాళికలు రూపొం దించుకుంటున్నది. అవి విఫలమవుతాయా, సఫలమవుతాయా అన్న జోస్యం ఎలా ఉన్నా దేశంలోని బడాబూర్జువాశక్తులన్నీ దీని వెనుక సమీకృతమవుతున్నాయన్నది వాస్తవం. రెండు ఎన్నికల ఓటమితో బిజేపీ కోలుకోలేనివిధంగా దెబ్బతిన్నది. దానికి తోడు అంతర్గత నాయకత్వ సంక్షోభాన్నీ అది ఎదుర్కొంటున్నది. తిరిగి పుంజుకోడానికి మతోన్మాద పంజాను మరోసారి దేశంపై విసరడానికి అది సంసిద్దమవుతోంది. ఆర్‌యస్‌యస్‌ దీనికి కావలసిన ప్రణాళికలు రూపొందే పనిలో నిమగమై ఉంది. దాని అనుచరులు అనేక చోట్ల టెర్రరిస్టు చర్యలకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ముస్లింలే కాదు హిందువులూ బలయ్యారు. ప్రజల నిత్యజీవిత సమస్యలతో సంబంధం లేని సమస్యలను అజెండాగా తీసుకురావాలని, తద్వారా కాంగ్రెసు కు ప్రత్యామ్నాయం కావాలని కలలు కంటున్నది. ఈ రెండు పార్టీల పంథా ఒక్కటే. అది దేశంలో రెండుపార్టీల వ్యవస్తను పాదుకొల్పాలని. దానికి ప్రధాన ఆటంకంగా ఉన్న వామపక్షాలను బలహీనపర్చాలన్నది. వామపక్షాలను బలహీన పరచకుండా వారి ఆర్థిక ఎజెండాను ముందుకు తీసుకుపోలేరు. వామపక్షాల కన్నా వామపక్ష ఉద్యమం బలంగా ఉంది. సెప్టెంబర్‌ 5న జరగ బోయే దేశవ్యాపిత సమ్మె లాంటివి మరెన్నో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో గత్యంతరం లేక ఐఎన్‌టియుసీ, బియంఎస్‌ లాంటి సంఘాలు కూడా పాల్గొనాల్సి వస్తోంది. కార్మికుల నుండి పెరుగుతున్న ఒత్తిడే దీనికి కారణం. రైతులు, గ్రామీణ పేదల్లో అసంతృప్తి పెరుగుతోంది. పట్టణపేదలు తీవ్రనిరాశకు లోనవుతున్నారు. పెరుగుతున్న ధరలు వీరిని కుంగదీస్తున్నాయి. జులై 5 బంద్‌ అంత తీవ్రస్థాయిలో జయప్రదం కావడానికి ఇదే మూల కారణం. ఈ పిలుపుకు ప్రజల నుండి బ్రహ్మాండమైన స్పందన లభించింది. రానున్న కాలంలో ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాలకు, దీనికి మూలకారణమైన సరళీకరణ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా సాగే పోరాటాలే ప్రధానమవుతాయి. ఈ విధానాలను నిరంకు శంగా దేశంపై రుద్దుతున్న కాంగ్రెసుపార్టీకి వ్యతిరేకంగా రాజకీయంగా పోరాడకుండా ప్రజలకు ఊరట లభించదు. ఈ రెండూ ఒకదాని నుండి మరోదాన్ని వేరుచేయలేని జంట లక్ష్యాలు. ఆర్థిక, విదేశాంగ విధానాల విషయం లో కాంగ్రెసుకు బిజేపీకి తేడా ఏమీ లేదు. తాజాగా అణుభధ్రతాబిల్లుకు అనుకూలంగా పార్లమెంటులో కాంగ్రెసు, బిజేపీ కలసే వ్యవహ రించాయి. ఆఖరికి లౌకికవాదం విషయంలో కూడా కాంగ్రెసు రాజీ పడుతోంది.

ప్రాంతీయపార్టీలు-సిపియం వైఖరి

ప్రాంతీయపార్టీలు ఇరవై ఏళ్ల క్రితం ఉన్నట్లుగా ఇప్పుడు లేవు. నాడు, నేడూ అవి ప్రాంతీయ బూర్జువా, భూస్వామ్యవర్గాలకే ప్రాతినిద్యం వహిస్తున్నా, ఆవర్గాల్లో వచ్చిన మార్పే ఈ పార్టీల్లోనే కనిపిస్తున్నది. ప్రజలను అణగదొక్కి తాము ఆర్థికంగా బలపడాలను కుంటున్న ప్రాంతీయ బూర్జువాశక్తులు బడా కార్పొరేట్‌ శక్తులతో చేతులు కలుపుతున్నాయి. విదేశీ ఫైనాన్స్‌ పెట్టుబడులకు స్వాగతం చెపు తున్నాయి. తాము అధికారంలో ఉన్న చోట ప్రపంచబ్యాంకు షరతులకు తలొగ్గి వారి విధా నాలను అమలు చేస్తున్నాయి. ఈ సందర్భంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా ప్రపంచ బ్యాంకు విధానాలకు మన రాష్ట్రాన్ని ప్రయోగ శాలగా మార్చిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకో వచ్చు. అవే పార్టీలు ప్రతిపక్షంలో ఉంటే ప్రజల తరపున ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడు తున్నట్లు ఫోజులిస్తుంటాయి. తిరిగి అధికారం లోకి రావాలనుకుంటే ఇంతకు మించిన గత్యంతరం లేదని కూడా వారెరుగుదురు. ఈ పార్టీలకు రాజకీయ నిలకడతనం కూడా లోపించింది. కాంగ్రెసు, బిజేపీల్లో ఏది ఎప్పుడు ఎలా వాటంగా ఉంటే అటుదూరే విధంగా సందులు చేసుకుంటున్నాయి. ప్రజల నుండి బలమైన ఒత్తిడి లేకుండా వీరు విధాన ప్రాతిపదికపై సాగే మూడో ప్రత్యామ్నాయం వైపు నిలబడరు. అందువల్లనే మూడో ప్రత్యా మ్నాయం తక్షణం సాధ్యం కాదని సమావేశాలు అభిప్రాయపడ్డాయి. దానిపై విశ్వాసం కోల్పో కుండానే ఈలోపు తాత్కాలికంగా తక్షణ ఎన్నికల ఎత్తుగడలు రూపొందించుకోవాలని తీర్మానం పిలుపునిచ్చింది. వీలైనచోట్ల ఇలాంటి పార్టీలతో ఎన్నికల సర్దుబాట్లు కూడా చేసుకోవచ్చని తీర్మానం పేర్కొన్నది. పార్లమెంటు లోపలా, వెలుపలా ప్రజా సమస్యలపై కలసి వచ్చే ప్రాంతీయపార్టీలను కలుపుకొని పోరాడాలని సమావేశాలు పిలుపునిచ్చాయి. వీటి గురించి వాస్తవిక దృక్పథంతో వ్యవహరిస్తూనే వామ పక్షాలను ఒంటరి చేసి దెబ్బతీయాలనుకుంటున్న శక్తుల చేతుల్లోకి ఈ పార్టీలు చేరకుండా నిరోధించాలని కూడా ఈ సమావేశాలు అభి ప్రాయపడ్డాయి. అలాగే రెండుపార్టీల వ్యవస్థను ప్రజాస్వామిక వ్యవస్థపై రుద్దకుండా నిరోధిం చడానికి కూడా ఈ పార్టీల అవసరం ఉంది.

సెజ్‌లు-భూసమస్య

దేశంలో శరవేగంగా పెరుగుతున్న సెజ్‌ (ఎస్‌ఈజెడ్‌)లు కొత్తరకాల సమస్యలను ముందుకు తెచ్చాయి. ఎప్పుడో కాలం తీరిన బ్రిటీషువారి 1894 భూసేకరణ చట్టాన్ని అనుసరించి రైతుల నుండి భూముల్ని కారు చౌకగా, వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా లాక్కోవడం మామూలైంది. దీనికి వ్యతిరేకంగా అనేకచోట్ల స్థానిక ప్రజల నుండి తీవ్రమైన ప్రతిఘటన వస్తోంది. కార్పొరేట్‌ కంపెనీలు సాగించే రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కోసం సారవంతమైన భూముల్ని ఎట్టి పరిస్థి తుల్లోనూ స్వాధీనం చేసుకోకుండా నిరోధిం చాలని, దానికి చట్టంలో మార్పులు చేయాలని సిపిఎం డిమాండు చేస్తోంది. ప్రజావసరాలైన రహదారులు, ఇరిగేషన్‌, ప్రభుత్వనిర్వహణలోని విద్యుత్‌ప్రాజెక్టులు తదితర ప్రాథమిక అభివృద్ది అవసరాలకు మాత్రమే భూసేకరణ జరగాలి. అలాగే రైతులకు తగినంత నష్టపరిహారం, పునరావాస చర్యలకు చట్టబద్దరక్షణ కావాలని కూడా కోరుతోంది. గిరిజన ప్రాంతాల్లో అక్రమ మైనింగును ఆపాలని, అక్కడ గిరిజనుల భూము లకు చట్టబద్దరక్షణ కల్పించాలని ఈ తీర్మానం డిమాండ్‌ చేసింది. రానున్న కాలంలో భూ సమస్యపై కేంద్రీకరించి పోరాటాలు సాగిం చాలని అన్నిశాఖలకు పిలుపునిచ్చింది.

స్వతంత్ర పాత్రను పెంచుకోవడం కీలకం

దేశంలో మారుతున్న పరిణామాల్లో కీల కంగా జోక్యం చేసుకొని ప్రజలకు కొన్ని ప్రయోజనాలైనా చేకూరేటట్లు చూడాలంటే వామపక్షాలు బలపడాలి. ప్రస్తుతం చట్టసభల్లో వామపక్షాలు బలహీనంగా ఉన్నందువల్ల తేలిగ్గా తమ విధానాలను పాలకులు ప్రజలపై రుద్దగలుగుతున్నారు. ఇదే కొనసాగితే రానున్న కాలంలో ప్రజలకు మరింత హానిజరుగుతుంది. ఈ ప్రమాదాన్ని నివారించాలంటే మన ముందు న్న ఒకే ఒక మార్గం సిపియం, వామపక్షాలు మరింతగా బలపడటం. ఇన్ని క్లిష్ట పరిస్థితుల మధ్య కూడా వామపక్ష ఐక్యత చెక్కుచెదరకుండా ఉంది. అక్కడక్కడా కొన్ని రాష్ట్రాల్లో అనైక్యతా సమస్యలున్నప్పటికీ జాతీయస్థాయిలో కలసి మెలసి వ్యవహరిస్తున్నాయి. రానున్న బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో సిపిఐ, సిపిఐ(యం), యంఎల్‌ లిబరేషన్‌ తదితర వామపక్షాలు కలసి పోటీ చేయాలని నిర్ణ్ణయించుకున్నాయి. ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయిన లాలూ పార్టీ (ఆర్జేడీ)తో చేతులు కలపడానికి నిరాకరించాయి. కాని అదే సమయంలో లాలూను శతృవుగా పరిగణించడం లేదు. ఆ పార్టీ ప్రత్యామ్నాయం కాదనేదే వామపక్షాల వాదన. ఈ రాష్ట్రంలో కాంగ్రెసు, బిజేపీ, వారితో కలసి ఉండేపార్టీల తోనే పోరుసాగించాలని నిర్ణయించుకున్నాయి.

వివిధ వర్గాలపై సంస్కరణల ప్రభావంపై అంచనా

ఈ తీర్మానం ఆర్థిక సంస్కరణల మూలం గా వివిధ వర్గాలలో వస్తున్న మార్పుల్ని కూడా అధ్యయనం చేసింది. ధనికవర్గాలు బాగా లాభ పడ్డాయి. ప్రపంచస్థాయిలో మన సంపన్నులు స్థానం సంపాదించారు. గత బడ్జెట్‌లోనే వీరికి 80 వేలకోట్లకు పైగా రాయితీలిచ్చారు. గ్రామీణ ధనికవర్గాలుకూడా ఈ సంస్కరణల వల్ల ఎంతోకొంత లాభపడ్డారు. అదే మరోవైపు సామాన్యజనంపై 60 వేలకోట్ల అదనపు భారం మోపారు. మధ్యతరగతి కొంత వరకు ఈ సంస్కరణలకు సానుకూలంగా మారింది. ఈ నేపథ్యంలో సంస్కరణల భారం మోస్తున్న పేద ప్రజలను సమీకరించేందుకు ప్రయత్నం చేయాలని సిపిఎం నిర్ణయించుకుంది. వ్యవసాయ సంక్షోభ ఫలితంగా రోడ్డునపడ్డ రైతుకూలీలనూ, అసంఘటిత కార్మికులనూ, సర్వీసురంగంలో భధ్రతలేకుండా పనిచేస్తున్న స్వయం ఉపాధికులనూ, పట్టణమురికివాడల్లో నివసిస్తున్న పేదలనూ సమీకరించేందుకు పూనుకోవాలి. సామాజిక న్యాయం కోసం నడుం కట్టాలి. దళిత, గిరిజన, మైనారిటీ, మహళల హక్కుల కోసం పోరాడాలని సమావేశం పిలుపు నిచ్చింది.

పోరాట అనుభవాలు

గత మహాసభ అనంతరం ఆంధ్రప్రదేశ్‌, రాజస్తాన్‌, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అనేక ప్రజా పోరాటాలు సాగాయి. వాటి అనుభ వాలను కూడా సమావేశాలు సమీక్షించాయి. మన రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున భూపోరాటం సాగింది. అయితే ఆ కృషి అంతా రాజకీయంగా సంఘటితం కాలేదు. పైగా కొన్ని ప్రాంతాల్లో ప్రజా పునాది కొంత దెబ్బతిన్నది కూడా. అదే రాజస్థాన్‌లో రైతాంగ పోరాటాలనంతరం వచ్చిన ప్రజా ఉద్యమ ఉధృతి ఎన్నికల్లో సంఘటితం చేసుకోగలిగాం. పోరాటాలు సాగిన చోట కిసాన్‌సభ, పార్టీ ప్రజల పక్షంగా మారింది. అధికారంలో ఉన్న కాంగ్రెసుకు శాసనసభలోనూ, బయటా బిజేపీ కాకుండా సిపిఎంను ప్రజలు ప్రతిపక్షంగా భావించే వాతావరణం వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ కమిటీ సమీక్షలో ప్రజాపునాది పెరక్కపోవడానికి గల కారణాలను విశ్లేషించేందుకు ప్రయత్నిం చింది. పునాదిస్థాయిలో ప్రజాసంఘాలు బలహీ నంగా ఉండటం. ప్రత్యామ్నాయ నాయకత్వం అభివృద్ది కాకపోవడం, ప్రజలపై స్థానిక బూర్జు వా పార్టీల నాయకుల పట్టు బలంగా ఉండటం వగైరా అంశాలను గుర్తించింది. అలాగే ఎన్ని కల్లో ఎక్కడా లేని విధంగా డబ్బు, మద్యం ప్రభావం ఎక్కువడా ఉండటం, ఈ ధాటికి వామపక్షాలు తట్టుకోలేకపోవడం కూడా కారణం. ఆఖరికి మీడియా కూడా డబ్బుకు దాసోహం అంటున్నది. పెయిడ్‌ న్యూస్‌ నూతన జర్నలిస్టు నీతిగా మారింది. ఈ పరిస్థితుల్లో దామాషా ఎన్నికల పద్ధతి (ప్రపోర్షనల్‌ రిప్రజం టేషన్‌) వంటి నినాదాలతో ఎన్నికల సంస్కరణల కోసం కూడా పోరాడకుండా వామపక్షాలు నిలబడలేవు.

అలాగే గత ఎన్నికల్లో పనిగట్టుకొని వైయస్‌ నాయకత్వంలోని కాంగ్రెసుపార్టీ రాష్ట్రంలో సిపిఎంను ఓడించేందుకు సర్వశక్తులూ ఒడ్డింది. ఎన్నికల ఒప్పందం ప్రకారం తెలుగుదేశం తన ఓట్లను సిపిఎంకు అనుకున్న విధంగా బదలా యించలేకపోయింది. రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలకు వామపక్షాలు బలపడటం ఇష్టం లేదు. ఇలా అనేక కారణాలు తోడై సిపియం నష్టపో యింది. కాని అది తాత్కాలికదెబ్బ మాత్రమేనని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఇటీ వల ఇందిరమ్మ ఇళ్ల సమస్య, ఉపాధిహామీ పథకం, హాస్టళ్ల సమస్యలపై ప్రజలు, విద్యార్ధులు బాగా కదులుతున్నారు. సంక్షేమపథకాల ఎత్తి వేతపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. దేశ వ్యాపితంగా ఇలాంటి సమస్యలపై శక్తివంచన లేకుండా జోక్యం చేసుకోవాలని సమావేశం పార్టీ శాఖలన్నింటికీ పిలుపునిచ్చింది. అలాగే వచ్చిన సంబంధాలను సంఘటితం చేసుకోడానికి నిర్మాణ చర్యలు చేపట్టాలని కూడా కోరింది. ఈ రెండు కర్తవ్యాలను జమిలిగా సాగించాలని పిలుపునిచ్చింది.

సెప్టెంబర్‌ 12-20 వామపక్ష ప్రభుత్వాల పరిరక్షణకై రాజకీయ ప్రచారోద్యమం సమీక్ష, రాజకీయ తీర్మానం కాకుండా ఈ సమావేశాల్లో మరో రెండు తీర్మానాలను ఆమో దించడం జరిగింది. ఒకటి: బెంగాల్‌లో మమతా, మావోయిస్టుపార్టీ గూండాల చేతుల్లో మరణించిన 255 మంది అమరవీరులకు శ్రద్దాంజలి ఘటి స్తూ చేసిన తీర్మానం. మరొకటి: కేరళ, బెంగాల్‌ వామపక్ష ప్రభుత్వాలను కాపాడు కోవాలని ప్రజలకు పిలుపునిస్తూ. ఈ రెండు తీర్మానాలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగినవి. వీటిని ప్రజల్లోకి తీసుకుపోవడానికి సెప్టెంబర్‌ 12 నుండి వారం రోజుల పాటు దేశవ్యాపితంగా కాంపెయిన్‌ నిర్వహించాలని కేంద్రకమిటీ విస్తృత సమావేశాలు పిలుపునిచ్చాయి.ఈ సమావేశాలు దేశంలో వామపక్ష ఉద్యమాన్ని పటిష్టపరచడానికి దోహదపడతాయ నడంలో ఏమాత్రం సందేహం లేదు.

No comments:

Post a Comment