Monday, February 28, 2011

సాగితే జల్సా

సాగితే రోగమంత సుఖం లేదన్నారు పెద్దలు. మనం దాన్ని - సాగించుకొనే బాబుల జల్సాలకు జైలే పదిలం అని మార్చుకోవచ్చేమో.ఎంత పెద్ద నేరం చేస్తే అంత గొప్ప రాచమర్యాదలు. నెంబర్‌ వన్‌ నేరస్థులకు, అంతర్జాతీయ దొంగల ముఠా నాయకులకు కారాగారాలు చక్కని అతిథి గృహాలు. పేరుమోసిన ఖైదీలకు అక్కడ సర్వ సౌఖ్యాలు అందుబాటులో వుంటాయి.
కాదంటే కాసింత ఖర్చవుతుందంతే. చికెన్‌-మటన్‌ బిర్యానీలు, పళ్ల రసాలు, ఖరీదైన సిగరెట్లు, టీవీలు, సినిమాలు... కనుసైగతో సమకూరుతాయి. కారాగృహాల్లో ఏవైతే నిషేధితాలో అవన్నీ వీరికి అందుబాటులో వుంటాయి. కావాలంటే దర్జాగా ఇంటి భోజనం తెప్పించుకోవచ్చు. కోరిన తిండి తిని విశ్రాంతి తీసుకోవచ్చు. దందాలకు సెల్‌ఫోన్లెటూ చేతిలోనే వుంటాయి. ఊచల వెనక ఉన్నామన్న బెంగే అక్కర్లేదు.


ఖరీదైన మనుషులు జైల్లో పడితే... వారికి అప్పటికప్పుడే కొత్త రోగాలు పుట్టెడు పుట్టుకొస్తాయి. పోలీసుల పహారాతో ఆసుపత్రికెళతారు. ఐసీయూలో విశ్రాంతి తీసుకుంటారు. తప్పనిసరై జైల్లో వుంటే విడిచిన బట్టలు ఉతికేందుకు, ఒళ్లు పట్టేందుకు తోటి ఖైదీలు సిద్ధంగా వుంటారు. ఆటలపై మనసు పడితే వాటికీ ఢోకా లేదు.
మంత్రులూ, ముఖ్యమంత్రులు, మాజీలు జైళ్లకు వెళ్తే చెప్పనే అక్కర్లేదు. నిన్నటి వరకు 'రాజా'లా వెలిగిపోయిన మాజీ కేంద్ర మంత్రివర్యులిప్పుడు చెరసాలలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. వీరు కూడా గ్యాస్ట్రిక్‌ సమస్య వంక చెప్పేసి భేషుగ్గా ఇంటి భోజనం తెప్పించుకుంటున్నారు. జైలు అధికారులు పైకి మాత్రం రాజావారు కోరినా హోమ్‌ఫుడ్‌ అంగీకరించలేదని పత్రికా ప్రకటనలిచ్చేశారు. చట్టబద్ధంగా తప్పు చేయడంలో, చేయించడంలో రాజావారిది అందెవేసిన 'చెయ్యి' కదా. వాటితో పోల్చుకుంటే ఇదెంత!
దేవతా పులుసుతో ప్రాణాలు నిల్పుకొన్న స్వాతంత్య్ర సమరయోధులు, పోరాటయోధులు, సొంత లాభం ఆసాంతం మానుకొని పదిమంది మంచి కోసం పనిచేసే నిజమైన ప్రజాసేవకుల జైలు జీవితం ఎక్కడీ కాసులు వెదజల్లి కోరినది సాధించుకునే నెంబర్‌ వన్‌ మోసగాళ్ల కారాగార జీవితం ఎక్కడీ

No comments:

Post a Comment