Monday, March 14, 2011

కేసీఆర్ వర్సెస్ కోదండరామ్!

తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతుందా.? అవుననే అంటున్నారు ఇరు వర్గాలకు చెందిన నేతలు. తెరాస నీడ నుంచి తెలంగాణ జేఏసీ బయటపడాలని భావిస్తుండగా, పొలిటికల్ జేఏసీపై తమ పట్టుసడలిపోరాదన్న వ్యూహంతో కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. దీంతో కేసీఆర్ వర్సెస్ కోదండరామ్‌ల మధ్య కోల్డ్‌‍వార్ జరుగుతున్నట్ట భొగొట్టా. వాస్తవానికి తెంలగాణ రాజకీయ జేఏసీలో తెరాస పెద్దన్న పాత్రను పోషిస్తోంది. కేసీఆర్ కదిలించినట్టుగానే కోదండరామ్ కూడా తోకాడిస్తూ వచ్చారు. దీంతో విసిగిపోయిన తెదేపా సహా తెలంగాణ కోసం పోరాడుతున్న పార్టీలు దూరమయ్యాయి. అయితే, మిలియన్ మార్చ్ విషయంలో మాత్రం అన్ని పార్టీలు ఏకమయ్యాయి. తెరాస మాత్రం విధిలేని పరిస్థితుల్లో మార్చ్‌లో పాల్గొనాల్సి వచ్చింది.

ఫలితంగా ఇకపై అన్ని వర్గాలకు మళ్లీ ప్రాధాన్యం ఇవ్వాలని కోదండరామ్ నిర్ణయించారు. ప్రధానంగా, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్‌ మిలియన్ మార్చ్‌లో కీలక పాత్ర పోషించేలా ఆయన చర్యలు తీసుకున్నారు. అలాగే, ఇకపై తెలంగాణ జేఏసీలో ప్రధాన భూమిక పోషించేలా అడుగులు వేయిస్తున్నారు. ట్యాంక్‌బండ్‌పై జరిగిన విధ్వంసం అనంతర పరిణామాలు ఇలాంటి అనుమానాలనే తెరపైకి తెస్తున్నాయి.

రాజకీయ జేఏసీలో కేసీఆర్‌ అండ్ కో పెత్తనానికి తెరదించకపోతే తెలంగాణ ఉద్యమానికి ఉనికి ఉండదని పలు తెలంగాణ ఉద్యమ సంస్థలు కోదండరామ్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. దానికి... ఉద్యోగుల సహాయ నిరాకరణ, మిలియన్‌ మార్చ్‌ కార్యక్రమాల్లో తెరాస నిర్లిప్తత వంటి ఆరోపణలు కూడా తోడవడంతో తెరాసను కట్టడి చేయాలని టీజాక్‌ నిర్ణయించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

పైపెచ్చు.. ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని మిలియన్‌ మార్చ్‌ను సైతం విఫలం చేసేందుకే తెరాస అగ్రనేతలు విఫలయత్నం చేసినట్టు విమర్శలు తెలంగాణ ఉద్యమ సంఘాల నుంచి వస్తున్నాయి. తన మద్దతు లేకపోతే ఎలాంటి కార్య క్రమమైనా విజయవంతం కాదని నిరూపించాలని తెరాస నాయకత్వం ప్రయత్నించిందని వారు ఆరోపిస్తున్నారు. దీన్ని పటాపంచలు చేసేలా మిలియన్ మార్చ్‌‍ను ఇతర ఉద్యమ, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు ముందుకు నిర్వహించాయి.

ఈ తాజా పరిణామాలు కేసీఆర్ ‌- కోదండరామ్‌కి మధ్య అంతరాన్ని పెంచినట్టు సమాచారం. తమ మాట వినని జాక్‌ను అప్రతిష్టపాలు చేయాలని తెరాస నాయకత్వం ఎత్తుగడ వేస్తోంది. అలాగే, జాక్‌, విద్యార్థి జాక్‌ల పెత్తనాన్ని తగ్గించి ఉద్యమాన్ని తన చెప్పుచేతుల్లోకి తీసుకోవాలన్న తెరాస ఎత్తుగడను మిగిలిన జాక్ భాగస్వామ్య పక్షాలు తిప్పికొడుతున్నాయి. వీటికి కోదండరామ్ విధిలేని పరిస్థితుల్లో అండగా నిలవాల్సి వస్తోంది. ఫలితంగా తెరాస - పొలిటికల్ జేఏసీ మధ్య అంతరం పెరుగుతోందంటున్నారు. వీరిమధ్య నెలకొన్న విభేదాలు తెలంగాణ ఉద్యమాన్ని ఎటుగా తీసుకెళతాయో వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment