Tuesday, May 3, 2011

ముఖ్యమంత్రి పదవి చిరంజీవి అబ్బసొత్తా: "మెంటల్" కృష్ణ

ముఖ్యమంత్రి పదవి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అబ్బసొత్తా అంటూ సినీ దర్శకనిర్మాత, హీరో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణ మురళి (మెంటల్ కృష్ణ) ప్రశ్నించారు. ఆయన మంగళవారం ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ చిరంజీవిపైనా కాంగ్రెస్‌పై నిప్పుల వర్షం కురిపించారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యమంత్రి పదవికి ఎవరు అర్హులో నిర్ణయించేది కాంగ్రెస్ లేదా సోనియా గాంధీ లేదా మరెవరో కాదన్నారు. అసలు ముఖ్యమంత్రి పదవి వీరి అబ్బసొత్తా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది వైఎస్.రాజశేఖర్ రెడ్డి పుణ్యమేనన్నారు. వైఎస్ఆర్ రెండో సారి ముఖ్యమంత్రి అవుతారన్న నమ్మకంతో ప్రజలు ఆయనకు ఓట్లు వేసి గెలిపించారని గుర్తు చేశారు. ఆయన పోయిన తర్వాత రాష్ట్రం కాంగ్రెస్ బొమ్మలాట రాజకీయాలు ఆరంభమయ్యాయని చెప్పారు.

మొదటి కృష్ణుడుగా రోశయ్య రాగా, రెండో కృష్ణుడిగా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారన్నారు. మరికొద్ది రోజుల్లో మూడో కృష్ణుడు వస్తాడనే ఊహాగానాలు వినొస్తున్నాయన్నారు. దీన్ని నిజం చేసేలా అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు, నేతలు కూడా చిరంజీవి భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారన్నారు.

అంటే.. సీఎం పదవి అంటే వీరి అబ్బసొత్తా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నిర్ణయించాల్సింది నేతలు కాదని ప్రజలని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని నేతలు గుర్తుంచుకుని మసలుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇకపోతే.. తాను ప్రరాపా పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరలేదన్నారు. తాను ఊరికి వెళ్లి వచ్చేసరికి ప్రరాపా దుకాణం కట్టేసి జెండా పీకేశారన్నారు. అందువల్లే తాను మరో పార్టీ కోసం వెతుక్కోవాల్సి వచ్చిందన్నారు. ఈ గాలింపులో కాంగ్రెస్ - తెదేపా - వైఎస్ఆర్ కాంగ్రెస్‌లను బేరీజు వేయగా తనకు జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరాలని అనిపించి ఇక్కడ చేరినట్టు చెప్పారు.

No comments:

Post a Comment