Monday, January 26, 2015

కూరల్లో ఉప్పు ఎక్కువైందా?గాభరాపడకండి..

సాధారణంగా ఇంటికి ఎవరైనా అతిథులు వస్తున్నారంటే వారి కోసం రకరకాల వంటకాలతో విందు రెడీ చేయడం సహజం. అయితే కంగారుతోనో లేదా మతిమరిపుతోనో లేదా ఒక వంటను ఒకరిద్దరు చేయడం వల్ల ఒకరికి తెలియకుండా మరొక్కరు కూరల్లో ఉప్పు ఎక్కువగా వేసేస్తుంటారు. అయితే, కేవలం అతిథులు వచ్చినప్పుడే
కాదు...సాధారణ రోజుల్లో కూడా మనకు తెలియకుండానే కూరల్లో ఉప్పు ఎక్కువుతుంటుంది. ఇలాంటి పొరపాటు ఏదో ఒక సమయంలో ప్రతి ఇంట్లోనూ జరిగే తంతే. కూరలో ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు, కానీ ఎక్కువైన ఉప్పుని తగ్గించడం ఎలాగో మీకు తెలుసా? అదెలాగో తెలుసుకోవాలంటే ఈ క్రింది ఇచ్చిన పాయింట్స్ చదవాల్సిందే... వంటచేసేటప్పుడు అప్పుడప్పుడూ అనుకోకుండా కూరల్లో ఉప్పు ఎక్కువగా వేసేస్తుంటాము. అయితే అలా ఎక్కువైన ఉప్పుని వెనక్కి తీయలేకపోయినా దాని వల్ల కూర రుచి చెడిపోకుండా మాత్రం జాగ్రత్త పడవచ్చు. అదెలాగంటే.....
1. కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు దానికి కొద్దిగా కొబ్బరిపాలు జత చేయాలి. ఇలా చేడయం వల్ల కూరల్లో ఉప్పదనం తగ్గి రుచికరంగా ఉంటుంది. 
2. ఒక బంగాళదుంప తీసుకొని ఓవెన్ లో 5నిముషాలు బేక్ చేసుకొని, తర్వాత తొక్క తీసేసి, నాలుగు ముక్కలుగా కోసి కూరలో వేయాలి. 5నిముషాల పాటు అందులోనే బంగాళదుంప ముక్కలను ఉంచడం వల్ల ఎక్కువైన ఉప్పుని ఇవి గ్రహించేస్తాయి. 
3. ఒక వేళ ఒవెన్ లేకపోతే పచ్చిబంగాళదుంపనే తొక్క చెక్కేసి, నాలుగు ముక్కలుగా కోసి కూరలో వేయాలి. వీటిని దాదాపు 10 నిముషాల పాటు అందులో ఉడకనిస్తే సరి. అయితే వడ్డించే ముందు మాత్రం వీటిని కూరలోంచి బయటకు తీసేయడం మరిచిపోవద్దు సుమా! 
4.మరో అద్భుత చిట్కా, రెండు లేదా మూడు కప్పుల పెరుగును కూరలో కలపడం వల్ల ఉప్పు తగ్గడమే కాదు...రుచి కూడా పెరుగుతుంది.
5. పెరుగు వేయడం ఇష్టం లేని వారు దానికి బదులుగా కొద్దిగా మీగడని కూడా ఉపయోగించవచ్చు. 
6. మీరు వండుతున్న కూరలో ఇదివరికే ఉల్లిపాయ, టమోటో పేస్ట్ వేసినట్లైతే, మరికొంత ఉల్లి టమోటో పేస్ట్ ను జతచేయవచ్చు. ఇలా చేయడం వల్ల కూరలో ఉన్న ఉప్పు తగ్గడమే కాదు, రుచికరంగా ఉంటుంది. అలాగే గ్రేవీ కూడా ఎక్కువగా ఉంటుంది. 
7. ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, నూనెలో వేయించి కూరలో కలపడం వల్ల రుచికి రుచి మరియు ఉప్పదనం కూడా తగ్గుతుంది. 
8. గోధుమ పిండికి కొద్దిగా నీటిని జతచేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, వీటిని కూరలో వేసి 3 నుండి 4నిముషాలు ఉడకనివ్వాలి. ఇవి కూరలో ఎక్కువగా ఉప్పుని గ్రహించేస్తాయి. తర్వాత వీటిని బయటకు తీసేయవచ్చు. 
9. మీరు చేసే వంటకాన్ని బట్టి టమోటో ముక్కలు లేదా టమోటో పేస్ట్ ని కూడా జత చేయవచ్చు. 
10. ఒక వేళ కూరలో తక్కువ నీళ్ళు ఉంటే కనుక మరికొద్దిగా నీరు వేసి కూరని బాగా ఉడికించాలి. కూరలో ఉప్పు తగ్గడంతో పాటు రుచికరంగా కూడా మారాలనుకుంటే మాత్రం అందులో పాలు పోస్తే సరి.... ఇవి కొన్ని చిట్కాలు మాత్రమే..ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ మీరు గుర్తుంచుకుని, సందర్భం ఎదురైనప్పుడు ఉపయోగించడానికి ప్రయత్నించండి. ‘కుకింగ్ క్వీన్' అనిపించుకోండి.

No comments:

Post a Comment