Thursday, September 2, 2010

అమెరికా - ఇజ్రాయిల్‌ - భారత్‌ : ప్రమాదకర మైత్రి

Buzz up! మార్క్సిస్టు సౌజన్యంతో

హిందూ ఉగ్రవాద సంస్థలకూ, ఇజ్రాయిల్‌ యూదు దురహంకార సంస్థలకూ మధ్య సంబంధాలు ఈమధ్య కాలంలో చాలా బలపడ్డాయి. అన్నిటికన్నా ఆందోళన కలిగించే అంశం ఇది. గోద్రా (గుజరాత్‌-2002) ఉదంతం మొదలు 2009 వరకూ మనదేశంలో వరస బాంబు పేలుళ్ళు చోటు చేసుకున్నాయి. అదికూడా ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో.

అటు అటల్‌బిహారీ వాజ్‌పారు సారథ్యం లోని హిందూత్వ బిజెపి సంకీర్ణపాలలోనూ (1998-2004), ఇటు మన్మోహన్‌సింగ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ సంకీర్ణ పాలనలోనూ (2004-2009) మనకు ఒక్క విషయంలో మాత్రం సారూప్యత కొట్టొచ్చినట్లు కనబడు తుంది. అదే-మన విదేశాంగ విధానంలో అమెరికా-ఇజ్రాయిల్‌ దేశాల పట్ల మొగ్గు. సంస్కరణల అనంతర కాల చరిత్రలో ఈ రెండు దేశాలతో మన సంబంధాలు ఎలాంటి దాప రికం లేకుండా బహిరంగంగానే కొనసాగు తున్నాయి. అమెరికన్‌ కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాల పట్ల మరింత ఆపేక్ష కనబరచడం, రాబోయే కాలంలో కూడా ఇది స్థిరంగా, దృఢంగా కొనసాగాలని పాలకవర్గాలు కోరుకోవడం ఇప్పుడు బహిరంగ రహస్యమే.

రెండు పాలక సంకీర్ణాలు కలిగి ఉన్న ఈ సారూప్యతను గురించి వివరించడానికి నేను ఇప్పుడు మొత్తం చరిత్రను తవ్విపోద్దాం అనుకో వడం లేదు. ఒకప్పుడు అంతర్గతంగా సూక్ష్మ స్థాయిలో ఉన్న ఈ ఏకోద్దేశం ఇవాళ పూర్తి స్థాయిలో విరాజిల్లుతున్నది.

భోపాల్‌ గ్యాస్‌లీక్‌ వల్ల వేలాదిమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఉదం తాన్నే తీసుకోండి. ఈ ఘోరకలికి కారణమైన యూనియన్‌ కార్బైడ్‌తో మిలాఖతు కావడంలో రెండు పాలకపక్షాలూ ఒకదానికొకటి తీసిపో లేదు. భోపాల్‌ ఘోరకలిని గురించి కొత్తగా వివరించాల్సిన పనిలేదు. యూనియన్‌ కార్బ యిడ్‌ ఫ్యాక్టరీలోని ట్యాంక్‌ నెం.610లోకి నీరు చేరడంతో మిథైల్‌ ఐనోసైనేట్‌ వాయువులు 1984 డిసెంబర్‌ 3 అర్థరాత్రిపూట వెలు వడ్డాయి.

కొన్ని గంటల్లోనే 2500 మంది భోపాల్‌ పౌరులు, అందునా ముఖ్యంగా పేద ముస్లింలు మరణించారు. విషవాయువుల ప్రభావంతో సుమారు 20000 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా వేలాదిమంది శాశ్వత అంగవైకల్యం బారినపడ్డారు. ఈ విషవాయువుకు విరుగుడుగా పనిచేసేది సోడియం థయెసల్ఫైట్‌. దేశవాళీగా దొరికే ఈ విరుగుడు మందు ఏ కారణంచేత నయినాగానీ సకాలంలో ప్రజలకు అందుబాటు లోకి రాలేదు. ఇక ఫోరెన్సిక్‌ నిపుణులు రకరకాల పరిశోధనలు చేసి ఏళ్ళూ పూళ్ళూ గడిచాక తప్పుడు తడకల నివేదికలు వండి వార్చారు.

ఎట్టకేలకు 1987లో యూనియన్‌ కార్బ యిడ్‌ అధికారులమీద సిబిఐ ఒక ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. భారత శిక్షాస్ముతి సెక్షన్‌ 304 (2) క్రింద కూడా అభియోగం నమోదుచేసింది. 'హత్యకాదుగానీ శిక్షార్హమైన సామూహిక హననం' అనే ఈ అభియోగం రుజువయితే పదేళ్ళ జైలుశిక్ష విధించవచ్చు. ప్లాంటు భద్రతా నిర్వహణలో లోపాల గురించి యాజమాన్యానికి ముందే తెలిసీ, ఈ లోపాలను సరిదిద్దుకోమని చేసిన హెచ్చరికలను, డిమాండును నిర్లక్ష్యం చేసిన నేరానికిగాను కంపెనీ యాజమాన్యానికి ఈ సెక్షన్‌ కింద శిక్ష విధించవచ్చు. కేవలం ప్లాంటు నిర్వహణా ఖర్చుల వ్యవయాన్ని తగ్గించు కోవడం కోసమే యాజమాన్యం ఈ భద్రతా లోపాలను సరిదిద్దలేదు.

ఈ వివరాలకన్నా మరో రెండు అంశాలు అప్పట్నుంచీ ఇప్పటిదాకా ప్రజల కళ్ళు గప్పలేకపోయాయి. ఒకటీ-యూనియన్‌ కార్బ యిడ్‌ అధినేత వారన్‌ ఆండర్సన్‌ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు, రెండు-ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ దుర్ఘటనపై స్పందించిన తీరు.

ఆండర్సన్‌ మనదేశంనుంచి తప్పించుకు పారిపోయాడు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అతగాడు అలా తప్పించు కుపోవడానికి ఎవరు తోడ్పడ్డారు అనే విషయం మాత్రం ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది.

అది కూడా ఆ పెద్ద మనిషిని స్వయంగా తోడ్కొని భోపాల్‌ విమానాశ్రయానికి, అక్కడనుండి ఢిల్లీకి తరలించిన అప్పటి భోపాల్‌ కలెక్టర్‌ మోతీసింగ్‌, విమానం పైలెట్‌ బయటపెడితే తప్ప నిజం బయటికి రాలేదు.

మాటలు తడువుకోకుండా గ్యాస్‌ దుర్ఘటన జరిగిన మరుసటిరోజునే అంటే 1984 డిసెంబర్‌ 4న ఏం జరిగిందో శ్రీ సింగ్‌ వివ రంగా చెప్పాడు. ఆ రోజున వాస్తవానికి వారన్‌ ఆండర్సన్‌ స్థానిక పోలీసు కస్టడీలో ఉన్నాడు. ఇంతలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి సింగ్‌కు, అప్పటి పోలీస్‌ సూపరింటెండెంట్‌కు పిలుపు వచ్చింది. ఆ మీటింగ్‌లో కలెక్టర్‌, ఎస్పీ, ఇద్దరికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారెన్‌ ఆండర్సన్‌ను విమానాశ్రయానికి తీసుకెళ్ళి అక్కడ సిద్ధంగా ఉన్న విమానంలో ఢిల్లీకి పంపించాలని ఆదేశించాడు.

స్వయానా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అర్జున్‌సింగ్‌ ప్రభుత్వ విమానాన్ని అందుబాటులో ఉంచడానికి ఆదేశాలు ఇచ్చాడని మొదటి వార్తలు వెలువడ్డాయి. అర్జున్‌సింగ్‌ భారత రాజకీయాల్లో సెక్యులర్‌ విలువలకోసం గట్టిగా నిలబడినవాడు. హిందూత్వ రాజకీయాలపట్ల కరడుగట్టిన వ్యతిరేకతను ప్రదర్శించేవాడు. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనలో మరణించిన వారిలో ఎక్కువమంది ముస్లింలు.

అయితే అర్జున్‌సింగ్‌ బదులుగా ముఖ్య మంత్రి పీఠం ఎక్కిన దిగ్విజరుసింగ్‌ మాత్రం ఈ వార్తను తీవ్రంగా ఖండించాడు. ఆండర్సన్‌ తప్పించుకుపోవడంలో అర్జున్‌సింగ్‌ బాధ్యత ఏమీలేదు అంటూనే ఈ పాపానికి బాధ్యత ఆనాటి కేంద్ర ప్రభుత్వం, అమెరికా ఒత్తిడి అని వేలెత్తి చూపాడు. సత్రవ్రత్‌ చౌదరి, ఇతర కాంగ్రెస్‌ నాయకులు కూడా ఈ విషయంపై అర్జున్‌సింగ్‌ మౌనం వీడాలని, దోషులెవరో జాతికి తెలియచెయ్యాలని డిమాండ్‌ చేశారు.

గత పాతికేళ్ళలో అటు కాంగ్రెస్‌, ఇటు బిజెపి పక్షాల నుండి ఒకే అంశంమీద ఇలా ఏకరీతిగా స్పందించడం అదీ అమెరికా కార్పొ రేట్‌ ప్రయోజనాలతో ప్రభుత్వం కుమ్ముక్కయిన తీరు గురించి ప్రశ్నించడం, బాధ్యులు ఎవరని నిలదీయడం ఇదే ఓం ప్రథమం. ఇక్కడ నేను వామపక్షాల సంగతి చెప్పట్లేదు. పాలకవర్గాల గురించే ప్రస్తావిస్తున్నా.

ఈ నేపథ్యంలోనే ఒక కార్పొరేట్‌ మీడియా సంస్థ సిఐఎ సమాచారం ఆధారంగా ఆండర్సన్‌ తప్పించుకుపోవడానికి ప్రధానంగా ఆనాటి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని, అమెరికా ప్రత్యక్ష పెట్టుబడులకోసం వెంపర్లాడుతున్న ఆనాటి పరిస్థితులలో అమెరికన్‌ కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలు దెబ్బతినకూడదనే ఉద్దేశ్యంతోనే నాటి కేంద్ర సర్కార్‌ ఈ పనికి పూనుకుందని బయటపెట్టింది.

యూనియన్‌ కార్బయిడ్‌ అధినేత ఏ పూచీ లేకుండా భోపాల్‌ దుర్ఘటన నుండి తప్పించుకుని ఈ దేశం విడిచి పారిపోవడానికి మన సర్కారు సకల ఏర్పాట్లూ చేసినట్లే, 2001 సెప్టెంబర్‌ 9న అమెరికాలోని 'ట్విన్‌ టవర్స్‌' ఘోర ఉదంతం తరువాత బిన్‌ లాడెన్‌ సంతతి నుండి జార్జిబుష్‌ కుటుంబం అందుబాటులో ఉంచిన విమానంలో అమెరికాలోనిటెక్సాస్‌ నగరం నుండి తప్పించుకుపోయింది. ఈ రెండు ఘటన లకూ ఏదో సారూప్యత ఉన్నట్లు అనిపించదూ! 9/11 ఘటన తరువాత అమెరికా గగనతలాన్ని వీడివెళ్ళిన ఒకే ఒక విమానం అది.

మన పాలకులు అమెరికన్‌ కార్పొరేట్‌ కంపెనీల అడుగులకు మడుగులొత్తితే, అమెరికన్‌ పాలకవర్గాలు సౌదీ అరేబియాలోని సంపద్వం తమైన చమురు కంపెనీల ప్రయోజనాల అడుగులకు మడుగులొత్తాయి. బుష్‌ కుటుంబా నికి, సౌదీ చమురు కంపెనీలకు మధ్య ఉన్న గాఢమైన వ్యాపార అనుబంధం ప్రపంచానికి తెలిసిందే. చూశారా గ్లోబల్‌ పెట్టుబడిదారీ విధానం ఎంత సుందర ముదనష్టంగా పని చేస్తుందో?

ఆండర్సన్‌ ఆ రోజున అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌ను కలిసినట్లు సమాచారం. ఆ తరువాత అతను క్షేమంగా తన సొంతగడ్డ అయిన అమెరికా చేరుకోవడం, న్యూయార్క్‌ మహానగరంలో సౌకర్యవంతమైన, విలాసవంత మైన జీవితం గడుపుతూ ఉండడం అలవోకగా జరిపోయాయి. ఇక్కడ మన రికార్డుల్లో మాత్రం 'తప్పించుకుపోయిన' ముద్దాయిగా భద్రంగా నమోదయి ఉన్నాడు. అమెరికా-భారత్‌ల మధ్య 'నేరగాళ్ళ అప్పగింత' ఒప్పందం అమలులో ఉన్నా ఈ ముఫై ఏళ్ళలో మన ప్రభుత్వాలు 'అపరాధి'ని అప్పగించమని అడగడం గానీ, అమెరికా అప్పగించే ఆలోచన చెయ్యడంగానీ జరగలేదు. దీని వల్ల ప్రపంచం ఏమీ తల్లక్రింద లయిపోలేదు. ఇంకా చెప్పాలంటే ఈ మధ్యనే అమెరికా ప్రతినిధి ఈ విషయమై మాట్లాడుతూ 'అసలు అలాంటి ఆలోచదన మా ఊహకు అందని విషయం' అని ఒక్కమాటలో కొట్టి పారేశాడు. ఇంకో అడుగు ముందుకేసి - అమెరికాలోని యూనియన్‌ కార్బయిడ్‌ కంపెనీ కిగానీ, మనదేశంలోని యూనియన్‌ కార్బయిడ్‌ను 'టేకోవర్‌'చేసిన డౌ 'కెమికల్స్‌'కుగానీ గ్యాస్‌ దుర్ఘటన విషయంలో పూచీనే లేదనే కొత్త పల్లవి ఎత్తుకున్నారు. అలా ఈ కేసు ఇంకొన్ని ఏళ్ళు పూళ్ళూ న్యాయస్థానాల్లో సాగదియ్యడానికి రంగం సిద్ధంచేశారు.

ఈ వాదన వినిపించడానికి మన సర్కారు లోని ఇద్దరు కేంద్రమంత్రులు కూడా సిద్ధంగా ఉన్నారు. అమెరికాతోనూ, మార్కెట్‌ పిడివాదంతోనూ అత్యంత సన్నిహిత సంబం ధాలు నెరపాలని సదా తాపత్రయపడే పలుకుబడి కలిగిన మంత్రులు-చిదంబరం, కమలనాథ్‌లే ఆ ఇద్దరూ. మనదేశంలో అమెరికా పెట్టుబడుల 'సెంటిమెంటు' దెబ్బతినకుండా ఉండాలంటే డౌ కెమికల్స్‌ను ఈ వివాదంలోకి 'అనవసరంగా' లాగకూడదని వీరిరువురూ బలంగా వాది స్తున్నారు.

డౌ కెమికల్స్‌ వ్యాపారాలు అటు కాంగ్రెస్‌ పాలిత మహారాష్ట్రలోనూ, ఇటు బిజెపి పాలిత గుజరాత్‌లోనూ నిరాటంకంగా కొనసాగుతు న్నాయి. ఈ కార్పొరేట్‌ కంపెనీ వ్యాపారాలను నిషేధించాలనే ఆలోచన అటు కాంగ్రెస్‌లోగానీ, ఇటు బిజెపిలోగానీ కొంచెం కూడా లేదు.

కొసరు సమాచారం:

కార్పొరేట్‌ కంపెనీ ప్రయోజనాలకు కొమ్ము కాయాలనే ఈ చేదు కుట్రకు అంతిమ సహ కారం సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌తో అందింది. ఈకేసులో 'తన ఏజెంటు చేసిన తప్పుకు యజమానికీ బాధ్యత ఉంటుంది (వెకేరి యస్‌ రెస్పాన్స్‌బులిటీ) అనే సూత్రం వర్తించదని రూలింగ్‌ ఇస్తూ సిబిఐ దాఖలు చేసి చార్జిషీ టులో సెక్షన్‌ 304ఎ క్రింద చేసిన 'నేరపూరిత నిర్లక్ష్యం' అనే అభియోగాన్ని నీరుకార్చేసింది. అదీ 1996లో.

ఈ రూలింగ్‌ ఇచ్చిన ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణానంతరం యూనియన్‌ కార్బయిడ్‌ నిధులతో నడిచే భోపాల్‌ మెమోరియల్‌ హాస్పటల్‌ ట్రస్టుకు జీవితకాలపు అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ట్రస్టు కూడా సుప్రీంకోర్టు ఆదేశాల ద్వారా ఏర్పాటు చేసింది. ఈ పదవి తీసుకోడానికి ఆయన ఏమాత్రం సంకోచించలేదు.

భోపాల్‌ దుర్ఘటన జరిగిన పాతికేళ్ళ తరు వాత న్యాయస్థానం తీర్పు వెలువరిస్తూ కంపెనీ యాజమాన్యంలో ఏడెనిమిది మందిని దోషులుగా నిర్థారించింది. 'నిర్లక్ష్యం'గా వ్యవహ రించారనే అభియోగం వరకు రుజువయి నందున రెండేళ్ళ గరిష్ట కారాగార శిక్ష విధించింది.

పోనీ అని సరిపెట్టుకుందాం, సర్ది చెప్పు కుందాం అనుకున్నా వీల్లేని రీతిలో ముద్దాయిలు బెయిలుమీద విడుదల అయ్యారు.

ఇంకొక్క విషయం:

ఈ దుర్ఘటనకు సంబంధించి వైద్యశోధనా సమాచారాన్ని ఏ కారణంగానో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి తొక్కిపెట్టి ఉంచింది.

ఆనాటి దుర్ఘటన పాలయిన వేలాదిమంది ప్రజానీకానికి ఇప్పటికీ సరైన వైద్య సేవలు అందడం లేదు. కేంద్ర పర్యావరణ మంత్రి జైరాం రమేష్‌ ప్రకటనను బట్టి ఇప్పటికీ ఆ ప్రాంతంలో 325 టన్నుల విష వ్యర్థాలు నిలవ ఉన్నట్లూ, తాగునీరు విషతుల్యంగా మారుతున్న ట్లూ తెలియవస్తోంది.

ఇప్పుడు హడావుడిగా ప్రభుత్వం యూనియన్‌ కార్బయిడ్‌నుండి 47 కోట్ల డాలర్ల నష్టపరిహారం రాబట్టి వాజ్యాన్ని కోర్టుకు వెలుపల పరిష్కరాం చేసుకోవాలని నిర్ణయిం చింది. అథమపక్షంగా బాధితులకు అందేది 300 డాలర్లు. ప్రభుత్వం ప్రకటించిన బాధితుల చిట్టాలో చాలామందికి ఇప్పటికీ సాయం అందలేదు.

బోఫాల్‌ దుర్ఘటన జరిగిన ఐదేళ్ళకు, 1989లో అమెరికాకు చెందిన అలాస్కా సముద్రతీరంలో ఎక్సాస్‌ వాల్డెక్స్‌ కంపెనీ రిగ్గులనుండి చమురు వెలువడి కలుషితం అయినందున పక్షులు చనిపోయినందుకు 100 కోట్ల డాలర్లు నష్టపరిహారం రాబట్టింది అమెరికా ప్రభుత్వం. అంటే బోఫాల్‌ గ్యాస్‌ దుర్ఘటనలో మరణించిన 20,000 మానవ ప్రాణాలకన్నా పక్షి ప్రాణం విలువైనది అన్నమాట.

అలాగే ఈ మధ్య అమెరికాలోని మెక్సికో జలసంధిలో బ్రిటీష్‌ పెట్రోలియం కంపెనీ చమురు రిగ్గులు పేలిపోయి సముద్రంలో చమురు తెట్టు పేరుకున్నందున నష్టపరిహారం రాబట్టడానికి అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా చట్టాన్ని సవరించాలని చూస్తున్నాడు. అలస్కా ఘటన తరువాత చమురు కంపెనీల లాబీ అమెరికా ప్రభుత్వంమీద ఒత్తిడి చేసి నష్టపరిహారాన్ని 7.5 కోట్ల డాలర్లకు పరిమితం చేసుకున్నాయి. ఆ మేరకు చట్టం కూడా చేయించుకున్నాయి. కానీ ఒబామా ఇప్పుడు పరిమితిని రద్దుచేయడంతోపాటుగా క్రిమినల్‌ శిక్షలు చేపట్టేలా చట్టాన్ని సవరించడానికి చూస్తున్నాడు. కానీ మన ప్రభుత్వం మాత్రం అణుబిల్లు పేరిట పౌర ప్రమాద నష్టపరిహారాన్ని 500 కోట్ల రూపాయలకు సరిపెట్టాలని చూస్తుంది. (ఈ వ్యాసం వెలువడేనాటికి కాంగ్రెస్‌-బిజెపిలు దీన్ని 1500 కోట్లకు పెంచి బిల్లును నెగ్గించుకోవాలనే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సిపిఎం తదితర వామపక్షాలు ఈ పరిమితి 10,000 కోట్ల రూపాయలుగా ఉండాలని డిమాండ్‌ చేస్తు న్నాయి...అను.)

ఇంకా సూటిగా చెప్పుకోవాలంటే ఒక 'చెర్నోబిల్‌'లాంటి అణు ప్రమాదం జరిగితే భారతదేశంలో అమెరికా కార్పొరేట్‌ కంపెనీల మీద సివిల్‌ చర్యలు తీసుకోవడమే తప్ప క్రిమినల్‌ నేరంగా పరిగణించడానికి వీలులేదు. అది కూడా భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనలో వాజ్యాన్ని కోర్టు బయట పరిష్కరించుకున్న మొత్తంలో సగం సొమ్ము పరిహారంగా చెల్లించి చేతులు దులిపేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని కూడా దేశంలోని ప్లాంటు నిర్వాహకులే (ఆపరేటర్‌) భరించాలి తప్ప ప్లాంటు నిర్మాణ సామాగ్రినీ, ముడి సరుకునూ సరఫరా చేసిన కంపెనీల (విదేశీ అని చదువుకోగలరు) పూచీ ఉండదు. కాబట్టి మనకు భయంలేదు, మిక్‌ గ్యాస్‌ ఆండర్సన్‌ల మాదిరి అణు ప్రమాద ఆండర్సన్‌లు ఉండరు ఇకముందు.

ఇజ్రాయిల్‌-ఇండియా-హిందూత్వ లింకు:

2001వ సంవత్సరంలో భారత్‌-ఇజ్రాయి ల్‌ దేశాల మధ్య కేవలం 20 కోట్ల డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇవాళ అది 410 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇదిగాక ఇజ్రాయిల్‌ నుండి ఆయుధాల కొనుగోలు రూపేణా మరో 900 కోట్ల డాలర్లు ఖర్చుచేసింది. ఇజ్రాయిల్‌ నుండి ఆయుధాలు కొనుగోలు చెయ్యడంలో ప్రపంచం లో మనమే నెంబర్‌వన్‌గా నిలిచాం. ఒకప్పటి నెహ్రూ విదేశాంగ విధానాన్ని తుంగలో తొక్కి ఇవాళ యుపిఎ-2 సర్కారు ఇజ్రాయిల్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవాలనే ఊపులో ఉంది. ఈపాటికే మన గూఢచారి ఏజెన్సీలకు ఇజ్రాయిల్‌ రహస్య గూఢచారి ఏజెన్సీ 'మొస్సాద్‌'ల మధ్యన బంధం ఏర్పడిపోయింది. మనదేశానికి మొస్సాద్‌ గూఢచారుల రాకపోకలు జోరందుకున్నాయి.

ఈ బంధం ఎక్కడిదాకా వెళ్ళిందంటే, ఇటీవల పాలస్తీనా సహాయక నావలపై ఇజ్రా యిల్‌ పైశాచిక దాడిని మన విదేశాంగమంత్రిత్వ కార్యాలయం నోటిమాటగా ఖండించిందిగానీ ఈ దురాగతానికి తెగబడిన ఇజ్రాయిల్‌ దేశం పేరు ఉచ్ఛరించడానికి కూడా సాహసం చెయ్య లేదు. అబ్బాయిలూ తగాదాలు మంచివికాదు అని పాలస్తీనాకు ఇజ్రాయిల్‌కు వర్తించేలా మట్లాడిందేకానీ-ఇజ్రాయిల్‌ తప్పును నేరుగా ఖండించలేదు.

ఇవి పైకి కనిపించే విషయాలు. కానీ ఇంతకన్నా దారుణమైన సంబంధాలు రెండు దేశాల మధ్య చాప కింద నీరులా చేరిపోతు న్నాయి. హిందూ ఉగ్రవాద సంస్థలకూ, ఇజ్రా యిల్‌ యూదు దురహంకార సంస్థలకూ మధ్య సంబంధాలు ఈమధ్యకాలంలో చాలా బలప డ్డాయి. అన్నిటికన్నా ఆందోళన కలిగించే అంశం ఇది.

గోద్రా (గుజరాత్‌-2002) ఉదంతం మొదలు 2009 వరకూ మనదేశంలో వరస బాంబు పేలుళ్ళు చోటు చేసుకున్నాయి. అది కూడా ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో.

- 2002లో తబ్లిఘి సదస్సుకు హాజరు కానున్న వేలాదిమంది ముస్లింలను లక్ష్యం చేసు కొని భోపాల్‌ రైల్వేస్టేషన్‌లో బాంబు ప్రేలుళ్ళు జరిపినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు నిర్థారించాయి.

- 2003లో పర్భాణిలోని ముస్లిం మసీదు దగ్గర బాంబులు పేలాయి. అలాగే తబ్లిషు ముగింపు దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో హాజరవబోయే ముస్లింలను లక్ష్యంగా చేసుకొని మరోసారి భోపాల్‌ రైల్వేస్టేషన్‌లో బాంబు పేలుళ్ళకు కుట్ర జరిగింది.

-2004లో మహారాష్ట్రలోని పూర్ణా, జాల్నా పట్టణాల్లోని మసీదులదగ్గర బాంబులు పేలాయి.

- 2006లో మహారాష్ట్రలోని నాంధేడ్‌లో ఇద్దరు భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు బాంబులు తయారుచేస్తూ మరణించారు.

- షబ్బేరాత్‌ సందర్భంగా మాలెగావ్‌ (మహారాష్ట్ర) పట్టణంలో ఒక మసీదును, స్మశానవాటికను లక్ష్యం చేసుకొని మూడుచోట్ల జరిగిన బాంబు పేలుళ్ళలో 38 మంది మరణిం చారు.

- 2007 ఫిబ్రవరి 18న భారత్‌-పాకి స్తాన్‌ దేశాల మధ్య స్నేహపూర్వకంగా నడుపు తున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో రెండు సూట్‌కేసు బాంబులు పేలి 68 మంది మరణించారు. ఇందులో 42 మంది పాకిస్తాన్‌ దేశస్తులు ఉన్నారు.

- మే 16వ తేదీన హైదరాబాద్‌ నగరం లో మక్కా మసీదు పేలుళ్ళు జరిగాయి. ఇదే నెలలో కాన్పూర్‌ నగరంలో ఇద్దరు భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు బాంబులు తయారుచేస్తూ, అవి ప్రమాదవశాత్తూ పేలడంతో మరణించారు.

- అక్టోబర్‌ 11న రాజస్థాన్‌ రాష్ట్రంలోని అజ్మీర్‌ నగరంలోని 800 ఏళ్ళనాటి అతి ప్రాచీన 'ఛిస్తీ దర్గా' దగ్గర పేలుడు జరిగింది.

- 2008లో మహారాష్ట్రలోని మాలెగావ్‌, గుజరాత్‌లోని మొదస్సాలలో పేలుళ్ళు జరి గాయి.

- 2009లో మార్‌గోవా, గోవా నగరాల్లో దీపావళి పండుగ సందర్భంగా బాంబులు తీసుకువెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మరణించారు.

పైన పేర్కొదన్న అన్ని కేసులలో నేర పరిశోధనా సంస్థలు బాంబు పేలుళ్ళు జరిగిన వెంటనే - ఆ పేలుళ్ళకు బాధ్యులంటూ ఏదో ఒక ముస్లిం మతసంస్థ పేరును తెరమీదకు తెచ్చాయి. వందలాదిమంది ముస్లిం యువ కులను అనుమానితులపేరిట అదుపులోకి తీసుకు న్నాయి. పోలీసు పద్ధతులలో చిత్రహింసలకు గురిచేస్తూ కొంతమందితో ఒప్పుకోలు ప్రకటనలు కూడా చేయించాయి.

అయితే మాలెగావ్‌ బాంబు పేలుళ్ళ కేసును దర్యాప్తు చేసిన హేమంత్‌ కర్కరే నిష్పక్షపాతంగా వ్యవహరించి ఈ పేలుళ్ళ వెనుక హిందూమత సంస్థల ప్రమేయం ఉన్నట్లు నిగ్గుతేల్చాడు. అందు లో భాగంగానే హిందూ ఉగ్రవాద సంస్థలలో నాయకులుగా ఉన్న దయానంద్‌పాండే, సాద్వి ప్రగ్యాసింగ్‌ ఠాగూర్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ శ్రీకాంత్‌ పురోహిత్‌లు అరెస్టయ్యారు.

హేమంత్‌ కర్కరే బృందం చేసిన నేరపరి శోధనలో మాలెగావ్‌లో హిందూ ఉగ్రవాద సంస్థ జరిపిన పేలుళ్ళకు ఉపయోగించిన సరుకు సరంజామా, టెక్నిక్‌, సిమ్‌ కార్డులు తదితరాలు అన్నీ దేశంలోని ఇతర ప్రాంతాలలో 2002 నుండి 2008 వరకు జరిగిన పేలుళ్ళలో వాడిన వాటితో సామ్యం ఉన్నట్లు తేల్చారు. ఈ దిగ్భ్రాంతికర వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చిన హేమంత్‌కర్కరే నిజంగా అభినందనీయుడు. (ముంబరు దాడుల సందర్భంగా హేమంత్‌ కర్కరే చనిపోయాడు. ఆయను లక్ష్యంగా చేసుకొని హిందూ ఉగ్రవాద సంస్థలే దాడిచేసి చంపేసి ఉంటారనే వార్తలు కూడా వెలువడ్డాయి. అందుకు కారణం అతను తీగలాగి డొంకనంతా కదపడమే).

2006 మాలెగావ్‌ పేలుళ్ళు, తదనంతరం పూర్ణా-పర్బణీలలో జరిగిన పేలుళ్ళు తిరిగి 2008లో మాలెగావ్‌ ప్రలుళ్ళకు రాకేష్‌ థావ్రే అనే అక్రమ ఆయుధ వ్యాపారికి సంబంధాలు ఉన్నట్లు బయటపడింది.

కర్కరే బృందం పరిశోధనలో హిందూ జాగరణ్‌మంచ్‌, అభినవ భారత్‌, సనాతన సంస్థల ముఖ్యులకు ఈ బాంబు పేలుళ్ళతో సంబంధాలు ఉన్నట్లు సాక్ష్యాధారాలతో వెలుగు లోకి తెచ్చింది. ఈ క్రమంలోనే 2010 మే నెలలో అజ్మీర్‌లో జరిగిన ప్రేలుళ్ళకు దేవేంద్ర గుస్తా, చంద్రశేఖర్‌లు అనబడే ఇద్దరు ఆర్‌ఎస్‌ ఎస్‌ కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు నిర్థారణ అయ్యింది.

అప్పటినుండి హేమంత్‌ కర్కరేను చంపే స్తామనే బెదిరింపులకు తెరలేచింది. 2009 నవంబర్‌ 26న ఆ బెదిరింపు నిజం అయ్యింది.

నవంబర్‌ 26:

మెరికల్లాంటి ముగ్గురు ముంబై పోలీసు ఆఫీసర్లకు నవంబర్‌ 26న ఉగ్రవాద దాడులను నిలువరించడానికి కామా ఆసుపత్రివైపుకు వెళ్ళమని ఆదేశాలు అందాయి. ముగ్గురూ ఒకే జీపులో ప్రయాణం అయ్యారు. చట్టపరంగా కల్పించాల్సిన పూర్తి రక్షణ లేకుండా నాసిరకం బులెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌లతో బయల్దేరాల్సివచ్చింది. అయితే, ఉగ్రవాదులు దాడిచేసే ప్రాంతం పైనుంచి వచ్చిన సమాచారం మేరకు కామా హాస్పిటల్‌ ఏరియా కాకుండా వేరే ప్రాంతం అయి కూర్చుంది. జీపులో వెళ్తున్న మెరికల్లాంటి ఆ ముగ్గురు ఆఫీసర్లను అజ్మల్‌ కసబ్‌, ఇస్మాఇల్‌ అనే పాక్‌ ఉగ్రవాదులు కాల్చిచంపినట్లు వార్తలు ఫ్లాష్‌ అయ్యాయి. తూటాలకు నేలకొరిగిన ఆ ముగ్గురు ఆఫీసర్ల పేర్లు హేమంత్‌ కర్కరే, అశోక్‌ కామ్టే, విజరు సలాస్కర్‌.

ఈ మొత్తం వ్యవహారంలో ఏదో తిరకాసుందని కర్కరే, కామ్టేల శ్రీమతులు కవితా కర్కరే, వినీతా కామ్టేలు అసలు నిజాలు వెలుగులోకి తేవడానికి స్వయంగా రంగంలోకి దిగారు. ఆ వివరాలతో వినితా కామ్టే 'ది లాస్ట్‌ బుల్లెట్‌' (చివరి బుల్లెట్‌) అనే చిరుపొత్తం వెలు వరించింది. సమాచారహక్కుచట్టాన్ని ఉపయో గించుకొని పదే పదే ప్రయత్నించినమీదట చివరకు 'ఆ రోజున ముగ్గురు ఆఫీసర్లను కామా హాస్పటల్‌ ప్రాంతంవైపుకు వెళ్ళమని ఆదేశాలు ఇచ్చింది ఆరోజు కంట్రోల్‌రూం ఇంఛార్జిగా ఉన్న రాకేష్‌ మారియా అని సమాచారం లభిం చింది వినితా కామ్టేకు.

కవితా కర్కరే, వినితా కామ్టేలు ఇరువురూ హత్యకావించబడిన తమ భర్తలకు మెడభాగం లోనూ, భుజాల దగ్గర బుల్లెట్‌ గాయాలు ఉండడం గమనించారు. అంటే కాల్పులు జరిపిన వాళ్ళకు ఆ భాగంలో ఆఫీసర్లకు ఎలాంటి రక్షణా ఉండదని ముందే తెలిసినట్లుగా కాల్పులు జరిగినట్లు తెలియవస్తుంది.

ఇంకా చిత్రం ఏమిటంటే-ప్రాణాలు కోల్పోయిన ఆ ముగ్గురు పోలీసు ఆఫీసర్లు ధరించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ఆచూకీ లేకుం డా పోయాయి. అయితే మన మహిళామణుల ఒత్తిడికి సతమతం అయిపోయి చివరకు వీటిని ఓ చెత్తకుండీలోంచి వెలికితీసుకొచ్చారు. పరిశీలనలో ఆ మూడు జాకెట్లు నాసిరకానివని తేలింది. అజ్మల్‌ కసబ్‌ కేసు విచారణ సంద ర్భంగా కర్కరే శరీరంలోంచి దూసుకుపోయిన రెండు బుల్లెట్లు ఏవని న్యాయమూర్తి తహిల్యాని పోలీసు అధికారులను సూటిగా నిగ్గదీసి అడిగారు.

ఏ బుల్లెట్ల మూలంగా మెరికల్లాంటి ముగ్గురు ఆఫీసర్ల ప్రాణాలు కోల్పోయారో, ఆ బుల్లెట్లే కోర్టు పరిశీలనకు సమర్పించకుండా ఉంటే ఏ తుపాకి వారి ప్రాణాలు తీసిందో ఎలా నిర్థారించగలం అని న్యాయమూర్తి పోలీసు వర్గాలను నిలదీశారు.

ఈ పరిణామాలన్నీ ఒకదానివెంట ఒకటి వెలుగులోకి రావడంతో అసలు ఏం జరిగి ఉంటుంది అనే విషయమై ఊహాగానాలు చురుగ్గా మొదలయ్యాయి.

పాఠకులు ఈపాటికే ఆరోజు ఏం జరిగి ఉంటుందో ఊహించుకోగలరు. అయినా వారి సౌకర్యార్థం ఇంకొంత అదనపు సమాచారం ఇవ్వక తప్పడం లేదు.

మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం (ఎ.టి.ఎస్‌) మాలెగావ్‌ పేలుళ్లకు సంబంధించి సమర్పించిన ఛార్జిషీట్‌లో అభినవ్‌ భారత్‌ సంస్థకు ఇజ్రాయిల్‌లోని మితవాద ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని, ఆ సంస్థల నుండి హిందూత్వ సంఘం తన ఉగ్రవాద కార్యకలాపాలకు సహాయ సహకారాలు అందుకుంటుందని అభియోగం మోపింది.

ఇక 'హార్డ్‌ న్యూస్‌' (కటిక సమాచారం) అనే పత్రిక జూన్‌ 2010 సంచిక ముఖచిత్ర కథనం (కవర్‌ స్టోరీ)లో ఇలా పేర్కొంది.

ఇజ్రాయిల్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లలో పేలుళ్ళకు పాల్పడు తున్నాయని అమెరికాయే ఆరోపించింది.

ఇజ్రాయిల్‌లోని ప్రధాన వార్తాపత్రిక 'హా-రెట్జ్‌' కూడా దాదాపు ఇదే కథనాన్ని ప్రచురించింది- 'ఈ పేలుళ్ళ వెనుక ఉన్న ఉద్దేశం జాతులమధ్య విద్వేషాన్ని ఎగదొయ్య డం, అరాచక పరిస్థితులు సృష్టించడం, ప్రతీకార ధోరణలు రెచ్చగొట్టడం, ప్రతిదాడులకు పురిగొల్పడం తద్వారా సమాజంలో మరింత చీలిక సృష్టించడమే. హిందూత్వ ఉగ్రవాద సంస్థలు కూడా 2002 నుండి ఇదే మార్గాన్ని అవలంభిస్తున్నాయి' అని ఆ పత్రిక పేర్కొంది.

మనదేశంలోని హిందూత్వ ఉగ్రవాద సంస్థలకు, ఇజ్రాయిల్‌లోని యూదు మత దురహంకార ఉగ్రవాద నిషేధిత సంస్థలతో ఉన్న లింకుల గురించి బయట ప్రపంచానికి తెలిసినంతగా కూడా మనదేశంలోని ప్రచార, ప్రసార మాధ్యమాలు వెలుగులోకి తేలేదు. అలాగే మనదేశంలో పేలుళ్ళు సంభవించి నప్పుడల్లా దర్యాప్తు సంస్థలు అలవాటుగా ఏ 'సిమి'యో, 'షర్కతులే' వంటి ముస్లిం సంస్థలను బాధ్యుతలుగా చూపెట్టి చేతులు దులుపు కోకుండా, ఈ పేలుళ్ళ వెనుక హిందూత్వ ఉగ్రవాద సంస్థల ప్రమేయాన్ని వెలుగులోకి తెచ్చిన కర్కరే కృషినిగానీ, రాకేష్‌ మారియా పనిగట్టుకుని కర్కరేను కామా హాస్పటల్‌ ఏరియావైపుకు పపంపించిన విషయాన్నిగానీ ప్రసార సాధనాలు అవసరమైనమేరకయినా వెలుగులోకి తీసుకురాలేదు. ఇవాళ మనదేశం లో చలామణి అవుతున్న కుహనా జాతీయ వాదులకు, ఆ మత్తులో జోగుతూ, ఆయా శక్తుల సేవలో తరిస్తున్న వారికీ, మీడియాకూ ఇవన్నీ మింగుడుపడని వాస్తవాలు. అంతేకాదు భారత్‌- ఇజ్రాయిల్‌ దేశాలమధ్య బంధం మతదుర హంకారం, ఉగ్రవాద నైజం సహా ఎంతలా బలపడతున్నాయనేదానికి ఈ ఘటనలు కొన్ని ఉదహరణలు.

కొన్ని రోజులక్రితమే ముంబైదాడుల కేసులో దోషిగా తేలిన కసబ్‌కు న్యాయమూర్తి కఠిన దండన విధించారు. అయితే మహారాష్ట్ర పోలీసు మాజీ జనరల్‌ ఎస్‌ఎం ముష్రిప్‌ రాసిన 'హు కిల్‌ కర్కరే' (కర్కరేను హత్య చేసింది ఎవరు?) అన్న పుస్తకంలోనూ, వినీతా కామ్టే రాసిన 'ది లాస్ట్‌ బుల్లెట్‌' పుస్తకంలోనూ లేవనెత్తిన ప్రశ్నలకు గానీ, న్యాయవిచారణలో న్యాయమూర్తి లేవనెత్తిన ప్రశ్నలకుగానీ, ముంబై దాడులకు వైఫల్యాన్ని ఆనాటి పోలీసు బాసు రాకేష్‌ మారియాకు బదులు హసన్‌ గఫూర్‌ను ఎందుకు బాధ్యులు చేయవలసి వచ్చిందన్న ప్రశ్నలకుగానీ ఇప్పటికీ జవాబులు లేవు. హిందూత్వ సంస్థలకూ, యూదు మితవాద సంస్థలకూ మధ్య ఉన్న ఉగ్రవాద లింకుల గురించి ఇజ్రాయిల్‌ పత్రిక వెలుగులోకి తెచ్చినా మన మీడియా ఇంకా దాన్ని కప్పి పెట్టాలని చూస్తోంది.

ఏతావాతా ఈ గొలుసుకట్టు ఘటనల నుండి మనకు ఒక్క విషయం స్పష్టం అవు తుంది.

అమెరికా-ఇజ్రాయిల్‌-భారత్‌ల మధ్య చిగురు తొడుగుతున్న కొత్త మిత్రత్వానికి ఒక ఉమ్మడి ప్రాతిపదిక ఉంది. అదేమంటే, ఆధిపత్యశక్తుల ప్రయోజనాలు కాపాడడం. ఈ ఆధిపత్యంకోసం సైనికమార్గాన్ని కూడా విరివిగా వినియోగించుకోవడం. జాతి దురహంకారాన్ని కప్పి పెట్టుకోవడానికి జాతీయవాదాన్ని ముసుగుగా వాడుకోవడం. మూడు దేశాలూ 'ఇస్లాం'ను ఉమ్మడి శత్రువుగా చిత్రీకరించే ప్రయత్నం చెయ్యడం. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల పేరుతో ఒకరికొకరు సహక రించుకోవడం. ఆండర్సన్‌ వ్యవహారం మాదిరే అణుపరిహారబిల్లు వంటి వాటి ద్వారా వ్యూహాత్మకంగా ఒకరి పాలకవర్గ ప్రయోజ నాలను ఇంకొకరు పరిరక్షించుకోవడం.... ఇదే ఈ కొత్త పొత్తుకు ఉమ్మడి ప్రాతిపదిక.

కార్పొరేట్‌ శక్తుల, మార్కెట్‌ పిడివాద సిద్థాంతశక్తుల ప్రయోజనాలకోసం ప్రపంచానికి ముస్లింలనూ, ఇస్లాంనూ ఒక బూచిగా చూపించే బృహత్తర ప్రాజెక్టును కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌-ఆఫ్ఘనిస్తాన్‌-పాకిస్తాన్‌లతో కలిసి గ్యాస్‌ పైప్‌లైన్‌ ద్వారా ఇంధన అవసరాలు తీర్చుకోవాలనే ప్రణాళికను పక్కనబెట్టి అణు ఒప్పందాన్ని యుపిఎ-2 సర్కారు తలకెత్తు కుంది. ఈ ప్రాజెక్టుద్వారా భారత వినియోగ దారులకు చౌకధరకు పెట్రోలియం ఉత్పత్తులు అందించడానికి ముందుకువచ్చిన ఇరాన్‌ను కాదనుకుంది. మనదేశానికీ, ఇరాన్‌కూ మధ్య స్నేహసంబంధాలే ఉన్నాయి. అయినా ఈ మధ్య ఇరాన్‌ అణు ప్రమాదం గురించి భద్రతా మండలిలో అమెరికాకు అనుకూలంగా చివరి నిమిషంలో మనదేశం ఓటు చేసింది. అలాగే సోషలిస్టు చైనా పట్ల సందేహాస్పద వైఖరి ప్రదర్శిస్తోంది.

అంతేకాదు ఇప్పటికే అనేకమార్లు అమె రికా-ఇజ్రాయిల్‌ దేశాలతో కలిసి మన దేశం సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించింది. తద్వారా మేం ముగ్గురం కలిస్తే సముద్రాలను చుట్టేయగలం, భూమార్గాన భూకంపం పుట్టిం చగలం అని ప్రపంచ దేశాలకు సంకేతాత్మక హెచ్చరికలు చేస్తున్నారు. వీటన్నింటికీ తలమా నికంగా అంతర్గత సైనిక సహకార ముసాయిదా బిల్లులు రూపొందించి భవిష్యత్తులో ఒకరి అవ సరాలకోసం మిగిలిన ఇరు దేశాలు కూడా సైనికంగా కలిసి 'పోరాడడానికి, ఉమ్మడి యుద్ధాలు చెయ్యడానికి' రంగం సిద్ధమయింది. అమెరికన్‌ మారణాయుధాల తయారీదార్లు ఈ భూమి మీద సాగించబోయే భవిష్య మానవ మారణకాండలన్నింటా ఒకే రకం సైనికదుస్తులు, ఒకేరకం ఆయుధాలతో పోరాడడానికి పచ్చ జెండా సిద్ధంచేసింది.

అందుకే ఈ కొత్త మిత్రత్వం ప్రజాస్వామిక ప్రియులకు, శాంతికాముకులకు, సామ్రాజ్యవాద వ్యతిరేకులకు ఒక చేదు వార్త.

అయితే పాలకవర్గాలు షరీకయినంత తొందరగా ఆ ప్రయోజనాలు చుట్టూ ప్రజానీకం చేరరు. రాబోయే కాలంలో ఈ మూడు దేశా ల్లోని ప్రజాతంత్రవాదులు ప్రజాభిప్రాయాన్ని ఏరకంగా తీర్చిదిద్దబోతున్నారు అనేది అసలైన సవాలు. పాలకవర్గాల పాచికలు పారతాయా, ప్రజా చైతన్యం రానున్న ప్రమాదాన్ని నిలువరి స్తుందా, ప్రజా ప్రయోజనాలే విజయాన్ని సాధి స్తాయా అనేది చరిత్ర నమోదు చేస్తుంది.

No comments:

Post a Comment