Wednesday, November 17, 2010

ఎగ్జిక్యూటివ్‌ల భోగం - కార్మికుల దైన్యం

అమెరికాలో దిగజారుతున్న కార్మికుల జీవన ప్రమాణాలు
ఒకవైపు లక్షలాది మంది కార్మికులు మహామాంద్యం నాటి నుంచి ఎన్నడూ లేనంత తీవ్ర సామాజిక దైన్యాన్ని ఎదుర్కొంటుండగా, మరోవైపు అమెరికా కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌లకు మళ్ళీ పెద్ద ఎత్తున జీతాలు, వేతనాలు కట్టబెట్టడం ప్రారంభమైంది. అమెరికాలోని దాదాపు 450 పెద్ద కార్పొరేషన్లకు చెందిన ఎగ్జిక్యూటివ్‌ల వార్షిక బోనస్‌ గత ఆర్థిక సంవత్సరంలో 11 శాతానికి పెరిగినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ప్రచురించిన ఒక నూతన సర్వే తెలిపింది. జీతాలు, బోనస్‌లు, స్టాక్‌లు, ఇతర ప్రోత్సాహకాలు సహా వారి మొత్తం సగటు పరిహారం 2009లో మూడు శాతానికి అంటే 73 కోట్ల డాలర్లకు పెరిగింది. అత్యున్నత స్థాయి కంపెనీల లాభాలు విపరీతంగా పెరిగిన ఫలితంగా వారి వేతనాలు, బోనస్‌లు పెరిగాయి. ఆయా కార్పొరేట్‌ కంపెనీల లాభాలు గత ఏడాది కంటే రెట్టింపయ్యాయి. ఫలితంగా వాటాదారులకు లభించే ఆదాయాలు 29 శాతం పెరిగాయి. ఒబామా ప్రభుత్వం, పెద్ద వ్యాపార పార్టీల పూర్తి అండదండలతో అమెరికా కార్పొరేట్‌ రంగం కార్మికవర్గంపై సాగించిన దాడి ప్రత్యక్ష ఫలితమే ఈ లాభాలు. ఈ కంపెనీలు కార్మికుల తొలగింపు, వేతనాలు, ప్రయోజనాల్లో కోత, పూర్తి కాలం కార్మికుల స్థానంలో తాత్కాలిక కార్మికుల నియామకం వంటి చర్యలను గత రెండేళ్లుగా సాగించాయి.


వ్యయాల కోత, క్రమబద్ధం చేయడం అనే సూత్రాలను అనుసరించిన ఫలితంగా సిఇఒల వేతనాలు పెరిగాయి. లిబర్టీ మీడియా కార్పొరేషన్‌కు చెందిన గ్రెగొరీ బి మాప్ఫీ గత సంవత్సరం ప్రతిఫలంగా 8.70 కోట్ల డాలర్లు పొందారు. ఇది ఆయన 2008లో పొందిన దానికి నాలుగు రెట్లు అధికం. ఒరకిల్‌ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్‌ 6.86 కోట్ల డాలర్లు పొందారు. ఒసిడెంటల్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ సిఇఒ రే ఆర్‌ ఇరానీ 5.22 కోట్ల డాలర్లు పొందారు. యాహూ ఎగ్జిక్యూటివ్‌ కరోల్‌ బార్జ్‌కి 4.46 కోట్ల డాలర్ల ప్రతిఫలం లభించింది. సిబిఎస్‌కు చెందిన లెస్లీ మూన్వెస్‌ 3.9 కోట్ల డాలర్లు అందుకున్నారు. ఉన్నతస్థాయి ఎగ్జిక్యూటివ్‌లు 2010లో మరింత పెద్ద ఎత్తున పరిహారం ప్యాకేజీలు పొందుతారని భావిస్తున్నారు. 'పలు కంపెనీల ఆదాయాలు అంచనాలను మించి పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. వాటాల ధరలు బాగా పెరిగాయి. అందువల్ల బోనస్‌లు బాగుంటాయి' అని చికాగోకు చెందిన కాంపెన్‌సేషన్‌ కన్సల్టింగ్‌ కన్సార్టియం ఎల్‌ఎల్‌సి భాగస్వామి మార్క్‌ రీల్లీ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు చెప్పారు. మొత్తం మీద పోల్చుకుంటే మీడియా, ఇంధనం, ఇంటర్నెట్‌ సంస్థల అధిపతుల వేతనాలు కొంత తక్కువగానే ఉన్నట్లు, హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్లు, ప్రయివేటు ఈక్విటీ వ్యాపారులకు విపరీతంగా చెల్లింపులు జరగనున్నట్లు తెలిపింది.
న్యూయార్క్‌ టైమ్స్‌ సర్వేను అనుసరించి మొత్తం మీద ఆర్థిక సేవల్లో లభించిన పరిహారం 2010లో ఐదు శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కొన్ని వ్యాపార సంస్థల ఉద్యోగులకు 15 శాతం పెరుగుదల లభించనుంది. సంవత్సరాంత బోనస్‌ల కోసం గోల్డ్‌మాన్‌ సాచెస్‌, మోర్గాన్‌ స్టాన్లీ, సిటీగ్రూప్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, జెపి మోర్గాన్‌ ఛేజ్‌ 8,954 కోట్ల డాలర్లు పక్కన ఉంచినట్లు తెలుస్తోంది. సిఇఒల జీతాలకు కళ్ళెం వేయాలని, బ్యాంకులను నియంత్రించాలని ప్రారంభంలో ఒబామా ప్రభుత్వం పెద్దపెద్ద మాటలు చెప్పినప్పటికీ సంపన్న వర్గం ఆస్తులను కాపాడేందుకు అన్ని విధాలుగా తోడ్పడింది. వాల్‌స్ట్రీట్‌కు లక్షల కోట్ల డాలర్లు అప్పగించిన అనంతరం ఆర్థిక వ్యవస్థ మొత్తంగా వేతనాలు, ప్రయోజనాల్లో కోతను చేపట్టడం ద్వారా వైట్‌హౌస్‌ బలవంతపు దివాలాలను, జనరల్‌ మోటార్స్‌, క్రిస్లర్‌ పునర్నిర్మాణాన్ని చేయించింది.
తమ జీవన ప్రమాణాలను శాశ్వతంగా తగ్గించుకొనేందుకు అంగీకరించే వరకూ కార్మికులను నియమించేది లేదంటూ అమెరికా కార్పొరేషన్లు ఒత్తిడి చేస్తున్నాయి. ఆధునిక కాలపు కార్పొరేట్‌, ఆర్థిక అరాచకత్వపు పట్టును బద్దలు కొట్టాలంటే న్యాయమైన సామాజిక సమానత్వం సూత్రంపై ఆధారపడిన ఆర్థిక జీవితాన్ని పునర్నిర్మించేందుకు పోరాడటమే మార్గం. కార్మికవర్గం డెమోక్రాట్లు, రిపబ్లికన్ల నుంచి విడగొట్టుకొని తమ సొంత స్వతంత్ర, సోషలిస్టు పార్టీని నిర్మించుకొన్నప్పుడు మాత్రమే అది ప్రారంభమవుతుంది.
ప్రజాశక్తి సౌజన్యంతో

No comments:

Post a Comment