
కొత్త చెప్పులు కరవడం అత్యంత సహజం. అలాంటప్పుడు పాదానికి పాదరక్షకు మధ్య ఏర్పడిన రాపిడి ఫలితంగా బొబ్బలు వస్తాయి. అవి ఒక్కొక్కసారి చితికి పుండ్లు పడవచ్చు. మొత్తానికి ఆ పుండ్ల బాధలో నడకే మారిపోతుంది. పైగా కొత్త చెప్పులు ధరించిన ఆనందమూ హరించిపోతుంది. అలాగని కొత్తచెప్పులే కాదు, పాత చెప్పులైనా ఎక్కువ సేపు ధరించినపడు మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఆ ఇబ్బంది కలగకుండా వుండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మరి అవేంటో తెలుసుకుందాం.
* పాదం సైజుకు తగిన చెప్పులు లేదా బూట్లు మాత్రమే ధరించాలి.
* అంతేకాకుండా చెప్పులు కొనుక్కునే సమయంలోనే గట్టిగా, ఒత్తుకునేలా కాకుండా పాదానికి సరిగ్గా సరిపోయేలా, అడుగు సులువుగా పడేలా చెప్పులు ఎంపిక చేసుకోవాలి.
* షాపులోనే వాటిని ధరించి అటూఇటూ నడిచి చెక్ చేసుకుంటే సమస్య అప్పుడే తెలిసిపోతుంది. కలర్ నచ్చిందనో, మోడల్ బాగుందనో కొనడం సరికాదు.
* ఫ్యాషన్‌కన్నా కంఫర్ట్ ముఖ్యం.
* కాస్త గాలి ఆడేటట్లుండే చెప్పులు ధరించాలి. కాకుంటే సాక్సులు ధరించవచ్చు.
* కొత్త బూట్లు కొన్నప్పుడు దాని లోపలి వైపున కొబ్బరినూనె లేదా ఆముదం ఒక పొరలాగా రాసి ఆరబెట్టాలి. అలా మూడు రోజులు రాత్రిపూట రాసి పగలు ఆరబెడితే తోలు మెత్తబడి ఇబ్బంది కల్గించదు. అలా నూనె రాసిన మూడు రోజుల తర్వాతగాని బూట్లు ధరించకూడదు.
* అలాగే చెప్పులు లేదా బూట్లు మెత్తబడటానికి మరో ఉపాయమూ వుంది. బంగాళదుంప చెక్క తీసిన పలుచటి ముక్కలను షూ లోపల, మడత భాగంలో పెట్టాలి. అలా రెండు రోజులు చేస్తే అవి మెత్తబడతాయి.
* ఒక్కొక్కసారి జాగ్రత్తలు తీసుకున్నా పాదానికి బొబ్బలు వస్తాయి. అలాంటప్పుడు ఒక అరకప్పు బియ్యప్పిండిలో నీరు కలిపిన ముద్ద ఆ భాగానికి రాసి ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి.
* పసుపుకు నీరు కలిపి ముద్దచేసి, వేప ఆకులు జత కలిపి బాగా నూరిన ముద్దను బొబ్బ లేదా పుండు వచ్చిన భాగంలో పెట్టాలి.
* నువ్వులనూనె, తేనె ఒక్కొక్కస్పూన్ తీసుకుని కలిపి బొబ్బవచ్చినచోట రాసుకోవాలి.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు, కొత్త చెప్పులు కొనుక్కున్న ఆనందంతో పాటూ, అవి ధరించినపుడు దొరికే సౌఖ్యాన్ని కూడా అనుభవించొచ్చు. ఎందుకంటే, ఇష్టపడి కొనుక్కున్నవి నొప్పించేకంటే... మెప్పిస్తే ఆ సంతోషమే వేరు కదా?!
No comments:
Post a Comment