Thursday, September 19, 2013

దేవదాసుకి తొంబై ఏళ్లు..


టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుల్లో ఒకడైన నటుడు 'నట సమ్రాట్' అక్కినేని నాగేశ్వర రావు. తెలుగు చిత్ర సీమలో నటుడిగా ఆయన చేసిన ప్రయాణం సుధీర్ఘం. ఈ అలుపెరగని బాటసారి హీరోగా తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగారు. ఎన్నో అవార్డులు... మరెన్నో పురస్కారాలు సాధించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన నటనకు అవార్డులు క్యూ కట్టాయి. టాలీవుడ్ యువ హీరోలకు నటనంటే ఏమిటో నేర్పిన వ్యక్తి. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఆయనది ఏడు దశబ్దాల ప్రస్థానం. తెలుగు సినీ పరిశ్రమకు ఒక ట్రెండ్ ను సృష్టించిన ఈ 'దేవదాసు' పుట్టి 90ఏళ్లు అవుతోంది. ఈ సెప్టెంబర్ 20న పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న మన 'దసరా బుల్లోడి'కి '10 టివి' ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన ప్రస్థానం గురించి తెలుసుకుందాం.
సినీ నేపథ్యం..
1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా నందివాడ మండలం, రామాపురంలో జన్నించారు ఎఎన్నార్. చిన్నప్పటి నుంచే నటకాల మీద ఆసక్తి ఉన్న అక్కినేని క్రమంగా సినిమాలపై వైపు మళ్లాడు. అలా 1940లో 'ధర్మపత్ని' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. తొలినాటి నటుల్లో ఆయన ఒక్కరు. అక్కినేని హీరోగా నటించిన తొలి చిత్రం 'శ్రీ సీతా రామజననం'. మొదటి సినిమాతోనే తనలోని అందరి దృష్టి ఆకర్షించిన ఆయన వరుసగా సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో రాణించారు. ఆ తర్వాత 'బాలరాజు, కీలు గుర్రం, లైలా మజ్ను, దేవదాసు, విప్రనారాయణ, దొంగరాముడు, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ, మయా బజార్, మంచి మనసులు, దసరా బుల్లోడు, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, కాలేజీ బుల్లోడు, శ్రీరామదాసు వంటి సూపర్ హిట్ సినిమాలతో పాటు రీసెంట్ 'శ్రీరామ రాజ్యం'లో నటించారు. త్వరలో వారసులతో కలిసి 'మనం' అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అక్కినేని సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో కూడా నటించారు.
అయితే ఆయనను స్టార్ చేసిన సినిమాలు మాత్రం 1948లో విడుదలయిన 'బాలరాజు', 1949లో విడుదలయిన 'కీలుగుర్రం' అని చెప్పవచ్చు. తెలుగు ఇండస్ట్రీలో 70ఏళ్లకు పైగా ఉన్న ఆయన 'నవరస నట' పోషణకి ఒక నిఘంటువు లాంటి వారు. రొమాన్స్ చేయడం నుంచి కామెడీ పండించడం వరకు ఆయనకు ఆయనే సాటి. తెలుగు హీరోలకు డ్యాన్స్ లు నేర్పిన వ్యక్తి. ఇలా తన సుధీర్ఘ ప్రస్థానంలో అక్కినేని ఇప్పటి వరకు 275చిత్రాల్లో నటించారు. అందులో 248సినిమాలు తెలుగులో నటించగా.. 26 తమిళంలో.. హిందీలో ఒక సినిమా చేశారు. ఈఏకైక హిందీ చిత్రం 'సువర్ణ సుందరి'. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన 'మూగ మనసులు' చిత్రం 1964 లోనే రూ.కోటికి పైగా వసూలు చేసి ఇండస్ట్రీలో రికార్డు సృష్టించింది.
అయితే అప్పటివరకు తీస్తున్న పౌరాణిక సినిమాలను తగ్గించి 'జానపద' చిత్రాలను తీసి సరికొత్త ట్రెండ్ ను సెట్ చేశారు అక్కినేని. జానపద చిత్రాలకు తప్ప సాంఘిక చిత్రాలకు అక్కినేని పనికి రాడన్న సినీ విమర్శకుల నోళ్లకు తాళం వేస్తూ.. 'దేవదాసు' సినిమాను తీసి టాలీవుడ్ లో వండర్ క్రియేట్ చేశారు. 1953 జూన్ 26 న విడుదలైన ఈ చిత్రం సాంఘిక చిత్రాలలో సరికొత్త అధ్యాయానికి తెర లేపింది. ఇది తెలుగులో భారీ హిట్ అవడంతో ఇతర భాషల్లోకి కూడా రీమేక్ అయ్యింది. ఈ సినిమా తెలుగు తెరకు.. ఆయన జీవితంలోనూ మరిచిపోలేని చిత్రంగా నిలిచింది.
ఇక రొమాంటిక్ సినిమాలకు అక్కినేని పెట్టింది పేరు. 'ప్రేమ్ నగర్', 'ప్రేమాభిషేకం' చిత్రాల్లో ఆయన చేసిన రొమాన్స్ కు టాలీవుడ్ అంతా ఊగిపోయింది. ఇదే కాకుండా అక్కినేని ఎన్టీఆర్ తో కలిసి పలు 'మల్టీస్టారర్' సినిమాలు తీశారు. 'గుండమ్మ కథ', 'మయా బజార్', 'మిస్సమ్మ' వంటి చిత్రాలు దీనికి నిదర్శనంగా నిలిచాయి.
సాధించిన అవార్డులు, పురస్కారాలు..
అక్కినేని అందుకొని ఆవార్డు లేదంటే అతిశయోక్తి కాదు. 70ఏళ్లకు పైగా టాలీవుడ్ ల్ నటిస్తున్న ఏకైక నటుడిగా రికార్డు సృష్టించిన అక్కినేని.. 'రఘుపతి వెంకయ్య నాయుడు', 'పద్మ భూషణ్', 'దాదా సాహెబ్ పాల్కే', 'పద్మశ్రీ', 'ఎన్టీఆర్ జాతీయ పురస్కారం' వంటి అవార్డులు అందుకున్నారు. దీనితో పాటు మరెన్నో ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులు సాధించారు.
పౌరాణిక చిత్రాలు, తీసినా.. జనపదా సినిమాల్లో నటించినా.. అది ఆయనకు చెందుతుంది. 'బంగారు బాబులా'.. చేతికి గుడ్డలు కట్టి స్టెప్పులేసినా.. 'దసరా బుల్లోడి'లా సరదాలు పంచినా.. మందు మత్తులో 'జగమే మాయా'.. అని చాటి చెప్పినా.. 'ప్రేమనగర్' వీధుల్లో 'ప్రేమాభిషేకాలు' చేస్తూ.. 'సువర్ణ సుందరీ'కి మేఘ సందేశాలు' పంపిణా అక్కినేని స్టైలే వేరు. అందుకే తెలుగు సినిమాకు తరగని నిధి అక్కినేని అని అంటుంటాయి సినీ వర్గాలు. 'తొంభై వసంతాల్లోకి అడుగుపెడుతున్న మన 'నటసామ్రాట్' కు మరో సారి శుభాకాంక్షలు చెబుతూ.. తన అద్భుతమైన నటనతో మనల్ని ఇంకా అలరించాలని ఆశిద్దాం...

No comments:

Post a Comment