Thursday, October 10, 2013

సినిమా @ 4 డీ టెక్నాలజీ..

కదిలే బొమ్మల్ని చూడాలనుకున్న మనిషి కోరిక ఫోటోలతో మొదలై, సెల్యులాయిడ్ పైకెక్కి మాటలు నేర్చుకుంది. రంగులు అద్దుకుంది. హంగులు దిద్దుకుంది. ఒకప్పటి నాటకాల్ని,
బొమ్మలాటల్ని, సంగీత కచేరిల వంటి వినోద సాధనాలను మింగేసిందనే బ్యాడ్ నేమ్ కూడా మూట కట్టుకుంది. ఆర్ట్ మూవీస్ కాంటెంపరరీ, బ్లాక్ బస్టర్స్, హిట్లు. ఫట్లు ఇలా ఎన్నో వేరియేషన్స్. మరిప్పుడు ఆడియన్స్ తగ్గిపోయారా? లేక ఇంటర్ నెట్, డీటీహెచ్ ల మధ్య నిలబడలేకపోతోందా? ఫ్యూచర్ సినిమా ఎలా ఉండబోతోంది? లాజిక్ లకు అందని ఏ మ్యాజిక్ చేయబోతోంది? ఇదీ కల కాదు..నిజం సినిమాలో పగిలిన గాజు ముక్కలు మీకు గుచ్చుకుంటాయంటే నమ్మగలరా? స్క్రీన్ మీద వేగంగా పరుగెత్తుతున్న వ్యక్తిపై పేపర్లు ఎగిరిపడుతున్నాయి. ఆ కాగితాలు థియేటర్లో కూర్చున్న వారి మీద కూడా పడతాయి. సినిమాలో తుపాకీ పేలింది. ఆ బుల్లెట్ మీ గుండెలో దిగినట్లు అనిపిస్తుంది. చిందిన రక్తం మరకల ఆనవాళ్లు మీకూ తెలుస్తాయి. దూసుకొస్తున్న జల ప్రళయం మీ కాళ్ల కింద సాగర ప్రవాహం కావొచ్చు. తెర మీద కనిపించే రోజా పూల వనం సినిమా హాలులో సువాసనలు వెదజల్లితే ఇంకెలా ఉంటుంది? సినిమాలో పడే వర్షంలో మీ దేహం తడవొచ్చు. ఆకాశంలో చిత్రంలో ఎగిరే ఐరన్ మ్యాన్ అంచుల దాకా మిమ్మల్ని తీసుకెళ్లొచ్చు. ఆకాశ హార్మ్యాల అద్భుతాలు చేసే స్పైడర్ మ్యాన్ ఆ అనుభూతిని మీకూ కలిగించొచ్చు. ఇదేంటి అనుకుంటున్నారా..నో లాజిక్.. ఇట్స్ ఓన్లీ మూవీ మ్యాజిక్.. ఇంటర్ నెట్ లో యూ ట్యూబ్, ఫేస్ బుక్ వంటి సైట్ల రాకతో సినిమా ప్రదర్శన థియేటర్ కే పరిమితం అవ్వాల్సిన అవసరం కూడా లేకుండా పోతోంది. ఇప్పుడున్న డీటీహెచ్ పరిజ్ఞానంతో నేరుగా సినిమాని ఇంట్లోనే చూపించే రోజు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. అయితే ఇలాంటి మెరుగైన పరిస్థితులను సాధారణ ప్రేక్షకులను థియేటర్ వరకు ఎలా రప్పించాలి? వారిని ఎలా ఎంటర్ టైన్ చేయాలి? ఇన్నోవేటివ్ టచ్ తో ఏదో ఇన్నోవేషన్ కావాలి. ప్రేక్షకున్ని థియేటర్ వరకు రప్పించాలి. వచ్చాక విజ్యువల్స్ తో కట్టి పడేయాలి. ఈ ఒక్క ఐడియా సినిమా భవిష్యత్ నే మార్చివేయబోతోంది? ఇకపై మీరు సినిమా హాలులో కూర్చుని చూడరు.. సినిమాలోనే మీరుంటారు. సినిమాలోని ప్రతీ ఘటన.. మీ కళ్ల ముందే జరుగుతన్న సంఘటనలా ఉంటుంది. ఇక సినిమా అంటే ఒక రియలిస్టిక్ ఎక్స్ పీరియన్స్. ఒక ఇంటరాక్టివ్ ఇన్నోవేషన్. టెక్నాలజీ ప్రభావం.. గడిచిన రెండు దశాబ్దాల్లో సినిమాని ప్రభావితం చేసిన అంశాల్లో టెక్నాలజీ ప్రధాన పాత్ర అని చెప్పుకోవచ్చు. టెక్నాలజీ ప్రేక్షకులకు సినిమాని మరింత దగ్గర చేసింది. సినిమా పట్ల ప్రేక్షకులకు ఆకర్షణ ఆసక్తిని కలిగించింది. అలాంటి టెక్నాలజీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఓ సరికొత్త టెక్నాలజీ సినిమాని ఆడియన్స్ కి కనెక్ట్ చేయబోతోంది. ఇన్నోవేటివ్ టచ్ తో ఇంటరాక్షన్ పెంచబోతోంది. ఇక అప్పుడు మీరు సినిమా హాలు లో కూర్చున్నట్లు ఉండదు. సినిమాలోని ఓ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లు ఉంటుంది. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఇప్పుడున్న 3డీ టెక్నాలజీకే ఎమోషనల్ ఎటాచ్ మెంట్స్ తో 4డీ టెక్నాలజీగా అభివృద్ధి చేస్తున్నారు. 4డీ టెక్నాలజీ అద్భుతమైన అనుభూతిని కలిగించబోతోంది. హాలీవుడ్ టు టాలీవుడ్ హల్ చల్ చేయబోతోంది. ఇదే భవిష్యత్ లో 5డీ గా మారనుంది. ఇంతకీ.. 4డీ టెక్నాలజీ అంటే ఏంటీ? మీరు 3డీ మూవీస్ చూసే ఉంటారు. ఇదే టెక్నాలజీకి కొన్ని ఫిజికల్ ఎక్స్ పీరియన్సెస్ ని యాడ్ చేస్తే అదే 4డీ టెక్నాలజీ. అంటే.. స్ర్కీన్ మీద కనిపించేది.. సినిమాలో సంఘటన కాదు.. ఒక వాస్తవం.. కళ్ల ముందే నిజంగా.. జరుగుతున్న అనుభూతిని ప్రేక్షకులకు కలుగజేస్తారన్నమాట. 4డీ సినిమా అంటే ఒక రియలిస్టిక్ ఎక్స్ పీరియన్స్. థియేటర్ లో ఎట్మాస్పియర్ సినిమాలో సీన్ కి అనుగుణంగా సింక్ అవుతుందన్నమాట. సినిమాలో గాలి వీస్తే అదే గాలి హాలులోనూ వీస్తుంది. విమానం ఎగురుతుంటే.. మీరు గాల్లో ఎగురుతున్న అనుభూతిని కలిగిస్తారు. అంటే.. ఈ కొత్త ఎలిమెంట్స్... సినిమాని ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతాయన్నమాట. మూవింగ్ చెయిర్స్ మిమ్మల్ని ఊపేస్తాయి, వైబ్రేటర్లు మీకు చక్కిలిగిలి పెడతాయి, వాటర్ కెనాన్స్ నీళ్లు చిమ్ముతాయి, స్మెల్ ఓ విజన్ టెక్నాలజీ వాసన వెదజల్లుతుంది. ఇవన్నీ ఆడియన్స్ కు కొత్త ఎక్స్ పీరియన్స్, సరికొత్త ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వబోతున్నాయి. 4డీ అంటే 3డీ టెక్నాలజీ విత్ ఫిజికల్ ఎఫెక్ట్స్ అని చెప్పవచ్చు. అన్ని రకాల సెన్స్ లను ప్రేక్షకుడు ఫీలయ్యేలా 4డీ థియేటర్స్ లో స్పెషల్ ఎక్విప్ మెంట్ ఉంటుంది. సినిమా చూస్తున్న వారి సీట్లు సీన్ కి అనుగుణంగా కదులుతాయి. హీరో హీరోయిన్లు వర్షంలో తడుస్తున్నప్పుడు ఆడియన్స్ మీద కూడా అదే వర్షం కురుస్తుంది. హీరో హీరోయిన్ కి ఫ్లవర్ ఇస్తే దాని వాసన కూడా ప్రేక్షకునికి వస్తుంది. సౌత్ కొరియాకి చెందిన సిజే 4డీ ప్లెక్స్ ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తోంది. ఇలాంటి సినిమాల్ని, థియేటర్లని నిర్మించే పనిలో బిజీగా ఉంది. ఈ కంపెనీకి అక్కడ అంతకముందే 13 థియేటర్లు ఉన్నాయి. చైనా, మెక్సికో వంటి దేశాల్లో కూడా ఇలాంటి థియేటర్లను ఓపెన్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒక అమెరికాలో రెండు వందల 4డీ థియేటర్స్ నిర్మించాలని ప్లాన్ వేస్తోంది. 4 డీ టెక్నాలజీ మాయజాలం.. క్యూ బాక్స్ అనే కంపెనీ కూడా ఇలాంటి టెక్నాలజీని డెవలప్ చేస్తోంది. థియేటర్ లో చెయిర్లకు మోషన్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తూ ఎంఎఫ్ ఎక్స్ క్రియేట్ చేస్తోంది. స్ర్కీన్ మీద జరుగుతున్న సీన్ కి అనుగుణంగా ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా.. చెయిర్ కదులుతుందన్నమాట. మ్యాన్ ఆఫ్ స్టీల్, ది లోన్ రేంజర్ లాంటి సినిమాలకు ఈ టెక్నాలజీని యాడ్ చేసి ప్రదర్శించారు. అంటే సీన్ ని మిమిక్రీ చేస్తూ దానికి జిమ్మిక్కులు యాడ్ చేసి జిమ్మిక్రీ చేస్తారన్నమాట. 4డీ టెక్నాలజీలో ముఖ్యంగా ఐదు ఫిజికల్ ఎక్స్ పీరియన్స్ ని కలగజేయనున్నారు. అవి మోషన్, వాటర్, సెంట్, విండ్ అండ్ లైట్. ఆడియన్స్ కి రియలిస్టిక్ ఎక్స్ పీరియన్స్ కలిగించేందుకే ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. నిజానికి సినిమాల్లో ఈ టెక్నాలజీ కొత్తదే కావొచ్చు. కానీ ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ అనేవి టాకీ మూవీల కాలం నుంచే ఉంది. 1929 లో 'ది బ్రాడ్ వే మెలోడీ'అనే మ్యూజికల్ షోలో ప్రేక్షకుల మీద పెర్ ఫ్యూమ్ స్ప్రే చేశారు. 1959 లో వచ్చిన ‘ద టింగ్లర్ ’ అనే హారర్ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు ఎలక్ట్రిక్ షాక్ ఎఫెక్ట్స్ ఇచ్చారు. సినిమా నిర్మాత విలియమ్ కాసిల్ సినిమాలో సీన్లకు అనుగుణంగా అస్తిపంజరాలను, భయంకరమైన మాస్క్ లను సినిమా హాలులో వేలాడదీశారు. వాటర్ స్ప్రింక్లర్స్, బబుల్ జనరేటర్స్ లాంటి వాటితో 1980-90ల్లోనే ప్రయోగాలు చేశారు. 2011 లో బ్లాక్ పూల్ టవర్ ను రీ ఓపెన్ చేయడానికి మెర్లిన్ ఎంటర్ టైన్ మెంట్ 4డీ సినిమాను ప్రదర్శించింది. ఈ బ్లాక్ పూల్ టవర్ లో స్మోక్, సెంట్, ఫ్లోర్ వైబ్రేషన్స్, వాటర్ కెనాన్స్ లాంటి 4డీ ఎఫెక్ట్ లను వాడారు. ఇంట్లోనే 4 డీ సినిమాలు.. ఫ్యూచర్ లో 4డీ సినిమాలో కేవలం థియేటర్ లోనేకాదు..ఇంట్లో కూడా చూసే రోజులు వస్తాయి. 3డీ టీవీలు ఇప్పుడిప్పుడే మార్కెట్ లోకి వేగంగా వస్తున్నాయి. 4డీ టీవీలు కూడా త్వరలోనే రాబోతున్నాయి. 4డీ స్పెషల్ సౌండ్స్, కస్టమైజ్డ్ సెన్సిబిలిటీ ఫీచర్లతో వీటిని తయారు చేస్తున్నారు. 2025 నాటికి ఇవి అందుబాటులోకి రాబోతున్నాయి. ఎంటర్ టైన్ మెంట్ అనేది బేసికల్ గా ఎక్స్ పెన్సివ్. ఈ 3డీ, 4డీ, 5డీలు ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తాయో లేవో తెలియదు కానీ ఎడిక్ట్ చేసే ప్యార్లల్ సినిమా కూడా డెవలప్ అవుతుంది. ఇకపై చిన్న సినిమా అంటే లోబడ్జెట్ సినిమా అని కాదు. చిన్న సినిమానే చాలా పెద్ద సినిమా కాబోతోంది. పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ మందికి చేరువకాబోతుంది. ఈ సినిమా తియాలంటే పెద్దగా ఖర్చు అక్కర్లేదు. చిన్న కమింట్ మెంట్ చాలు. స్మార్ట్ టెక్నాలజీతో డెవలప్ అవుతున్న ఈ సినిమా లార్జ్ ఎఫెక్ట్స్ తో వైరల్ హిట్స్ కొట్ట బోతోంది. టీవీలు, దాని అనుసంధానంగా వచ్చిన కేబుల్, డైరెక్ట్ టు హోం, ఇంకా ఇంటర్ నెట్ వంటి సదుపాయాలతో ఇంట్లోనే సకుంటుంబ సపరివారంగా సినిమాలు చూసే సౌలభ్యం వచ్చేసింది. పెరిగిపోతున్న న్యూక్లియర్ కుటుంబాలు, స్త్రీపురుషులు ఇద్దరూ పనిచేసే అవకాశాలు సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. దీంతో సినిమానే వాళ్ల దగ్గరికి తీసుకెళ్ళే రోజులు రాబోతున్నాయి. దీనికిప్పుడు డిజిటల్ టెక్నాలజీ ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేస్తోంది. ప్రపంచంలో మొట్టమొదటి హైడెఫినిషన్‌ డీవీడీ ‘వన్‌ సిక్స్ రైట్‌’ 2006లో విడుదలైంది. ప్లాట్‌ లాండ్‌ మొట్టమొదటి పూర్తి కంప్యూటర్‌ ఎనిమేటెడ్‌ చిత్రం 2007లో రూపొందింది. ఈ డిజిటల్ టెక్నాలజీ ఇండిపెండెంట్‌ సినిమా ఎదుగుదలకు దోహదం చేస్తోంది. ఇండిపెండెంట్‌ సినిమాల్లోనే షార్ట్ ఫిలింస్‌, డాక్యుమెంటరీలకు ఇంటర్నెట్‌ గొప్ప అవకాశాన్నిస్తోంది. ఆధునిక సాంకేతికత అందించిన స్మార్ట్ అండ్ డిజిటల్‌ టెక్నాలజీ షార్ట్ ఫిలిం మేకింగ్ ని సులువు చేసింది. పెద్ద పెద్ద కెమెరాల అవసరం లేకుండానే సెల్‌ ఫోన్‌ కెమెరాతో నిర్మించే లఘుచిత్రాలకూ క్రేజ్ పెరుగుతోంది. ఇటీవల ఢిల్లీ లో నిర్వహించిన రెండు నిమిషాల మొబైల్‌ ఫోన్‌ సినిమా పోటీల నిర్వాహకుల అంచనాలకు అతీతంగా 500కు పైగా ఎంట్రీలు వచ్చాయి. సినిమా పరిశ్రమలో నిర్మాణ వ్యయం పెరగటం, ముఖ్యంగా ముడి రీలు, ప్రింట్ల ఖర్చులు అధికమవడం వంటి పరిణామాలు డిజిటల్ సినిమాని ప్రత్యామ్నాయంగా చూపుతున్నాయి. సినిమా తీయటం మొదలు ప్రొజక్షన్ దాకా మొత్తం డిజిటల్ టెక్నాలజీలోనే జరగబోయే రోజులు ముందున్నాయి. ఇంటర్ నెట్ లో యూ ట్యూబ్, ఫేస్ బుక్ వంటి సైట్ల రాకతో సినిమా ప్రదర్శన థియేటర్ కే పరిమితం అవ్వాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. ఇప్పుడున్న డీటీహెచ్ పరిజ్ఞానంతో నేరుగా సినిమాని ఇంట్లోనే చూపించే రోజు అతి దగ్గరలోనే ఉందనడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఔత్సాహికులు డిజిటల్ కెమెరాలతో, తక్కువ బడ్జెట్ తో, చిన్నచిన్న సినిమాలు తీసి ఇంటర్ నెట్ లో పోస్ట్ చేస్తున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ఫిల్మ్ ఫెస్టివల్స్ సైతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇలాంటి వారే ముందు ముందు డిజిటల్ సినిమాలు తీసి మీ టీవీలోనో, మీ కంప్యూటలోనో విడుదల చేసే రోజు ఎంతో దూరంలో లేదు. యూ.ఎఫ్.ఓ, క్యూబ్ వంటి సంస్థలు సినిమా పరిశ్రమని ఈ దశగా నడిపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి టెక్నాలజీ పూర్తిగా ఉపయోగం లోకి వస్తే మల్టీ ప్లెక్స్ నుంచి ఎక్కడో చిన్న గ్రామంలో వున్న థియేటర్ లో నైనా సినిమాని ఒకేసారి విడుదల చెయ్యచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా పైరసీని అరికట్టేందుకు డిజిటల్ సినిమా దొహదపడుతుంది. సినిమా నిశ్చలమైంది కాదు. అది ఓ కదులుతున్న ప్రపంచం. సినిమా ద్వారా ప్రేక్షకులకు కథ చెప్పం, చూపిస్తాం. ఆ చూడడంలోనే ప్రేక్షకులకు ఆ కథ పట్ల ఆసక్తి కలగాలి. వారు కథతో కనెక్ట్ అవ్వాలి. కథతో కనెక్షన్ మాత్రమే కాదు.. ఇంటరాక్షన్ కూడా భవిష్యత్తులో సాధ్యం కాబోతోంది. ఆ కథ ఈజీగా ఇన్నోవేటివ్ గా, స్పీడ్ గా ఆడియన్స్ కి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి సినిమాలెప్పుడూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఆదరణ పొందిన సినిమాల ప్రభావం సమాజం మీద తప్పక ఉంటుంది. 

No comments:

Post a Comment