Friday, December 17, 2010

ఆ చెరువు గుర్రపు డెక్కల నిలయం

డివిజన్లోని రామకృష్ణాపురం చెరువులో గుర్రపుడెక్కలు ఇప్పుడిప్పుడే చెరువు మొత్తం వ్యాపిస్తున్నాయి. ఈ గుర్రపుడెక్కలు చెరువు మొత్తం పెరగముందే తొలగిస్తే అక్కడ నివసిస్తున్న పరిసరప్రాంతాల ప్రజలు సుఖాంతంగా నివసించగలుగుతారు. కానీ సర్కిల్‌ అధికారులు దాన్ని తొలగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల రోజు రోజుకూ ఈ చెరువులో ఆకు విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆకు తక్కువగా ఉన్నప్పుడు తొలగిస్తే బాగుంటుందని, పెరిగాక కిందామీదా పడినా ఫలితం ఉండదని అంటున్నారు. గోటితో పోయె దానికి గొడ్డలి వరకు తెచ్చుకోవాల్సిన అవసరమేంటని స్థానికులు అధికారులను, ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. 

చెరువు ప్రాంతం కబ్జాలకు గురవుతోందన్న సాకుతో దాని చుట్టూ పెన్సింగ్‌ వేశారని, దీంతో చెరువు దరిదాపులకు ఎవ్వరూ వెళ్ళలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఈ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసిననప్పటి నుంచీ కొంతమంది స్థానికులు చెత్తా చెదారాన్ని ఈ చెరువు గట్టుపై వేయడం ప్రారంభించారు. దీంతో చెత్త పెరిగి దుర్గంధభరితంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుర్రపుడెక్కలకుతోడు, చెత్త కూడా పెరగడంతో దోమలకు నిలయంగా మారి, తమకు నానా అవస్థలు కలుగుచేస్తున్నాయని వాపోతున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న దోమల వల్ల సాయంత్రం సమయంలో ఒకచోట నిలబడలేని, కూర్చోలేని పరిస్థితి దాపురించిందని అంటున్నారు. ఈ దోమవల్ల ఎంతో మంది తీవ్ర అనారోగ్యాలకు గురౌతూ నిత్యం ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని అంటున్నారు. ఇక ఇళ్ళల్లోని చిన్నారుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని వాపోతున్నారు. దీనికి తోడు డిఫెన్స్‌ కాలనీ, రామకృష్ణపురం చెరువులోని నీరు ఇంకిపోతుండమే కాక రామకృష్ణాపురం కాలనీ, బ్యాంకు కాలనీ, తదితర ప్రాంతాల నుండి వచ్చే డ్రెయినేజీ నీరు, వ్యర్థ పదార్థాలు, నేరుగా ఈ చెరువులోకే చేరుతున్నాయి. దీనివల్ల చుట్టూ ప్రక్కల ఉన్న బోర్లలోని నీరు కలుషితంగా మారుతోందని, తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. దీంతో పాటు చెరువు కట్టపక్క పిచ్చిమొక్కలు మొలవడంతో అందులో ఏ విషపురుగులు దాగి ఉన్నాయో తెలియని పరిస్థితిలో ఉన్నామని స్థానికులు అంటున్నారు. నెలరోజలు క్రితం బిజెపి నాయకులు చెరువును సందర్శించి చెరువు కట్టవద్ద మొలిచిన మొక్కలను తక్షణమే తొలగించాలని అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అయినా నేటి వరకూ సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరువ తీసుకొని చెరువులో మొలచిన గుర్రపుడెక్కఆకును తొలగించి దోమల బారీ నుండి కాపాడాలని, డ్రెయినేజీ నీరు చెరువులోకి రాకుండా చూడాలని, వ్యర్థ పదార్థాలు చెరువుకట్టపై వేయకుండా తగజాగ్రత్తలు తీసుకోవాలని, చుట్టూ మొలిచిన పిచ్చిమొక్కలను తక్షణమే తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని, దీన్ని మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.

No comments:

Post a Comment