Friday, December 17, 2010

నష్టాల్లో 'పేట' రైతు

నారాయణపేట డివిజన్‌ రైతుల కష్టాలు తీరడం లేదు. పొలం చదును చేసింది మొదలు.. పంట చేతికొచ్చే వరకు అష్టకష్టాలు పడి.. అప్పులు చేసిన వారికి చివరికి మిగులుతున్నది దు:ఖమే. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తడిసిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందంటూ వ్యాపారులు ధరను తమకు అనుకూలంగా నిర్ణయిస్తున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడికి.. వచ్చే రాబడికి వ్యత్యాసం ఎక్కువగా ఉండి రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. చివరికి వరిపై ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌ కూడా వారికి దక్కడం లేదు.


డివిజన్‌ పరిధిలో వరి 33,936 హెక్టార్లలో సాగు చేయగా ఇటీవల కురిసిన వర్షాలకు 25 శాతం నష్టం వాటిల్లింది. జొన్న 16,555 హెక్టార్లకు గాను 8 శాతం, కందులు 67,970 హెక్టార్లకు గాను 30 శాతం, పత్తి 14,240 హెక్టార్లకు గాను 10 శాతం, వేరుశనగ 3,385 హెక్టార్లకు గాను 5 శాతం, సన్‌ ఫ్లవర్‌ 3355 హెక్టార్లకు గాను 3 శాతం, నల్ల కందులు 2951 హెక్టార్లకు గాను 20 శాతం, పెసర 25,307 హెక్టార్లకు గాను 12 శాతం పంట నష్టం వాటిల్లింది. ఒక్క రాగి మాత్రం 193 హెక్టార్లకు గాను ఎటువంటి పంట నష్టం జరగలేదు.
తేమసాకు చూపి...
కురిసిన వర్షం కారణంగా తడిసిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువ ఉందంటూ వ్యాపారులు సాకు చూపి తక్కువ ధరకు రైతుల నుండి కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్‌పై 100 రూపాయల నుండి 120 రూపాయల వరకు తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలీని దిక్కుతోచని స్థితిలో రైతులూ విక్రయిస్తున్నారు. నష్టపోతున్నారు.
సమన్వయం లేక...
వరి కొనుగోలు కేంద్రాలు మండల కేంద్రంలో ప్రారంభమైనా... అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో మద్దతు ధర అమలు సరిగ్గా లేదని తెలుస్తోంది. ఆహార, పౌర సరఫరాలు, ఎఫ్‌సిఐ, వ్యవసాయ మార్కెట్‌ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడిందనే ఆరోపణలు వస్తున్నాయి.
రైతుకు మిగిలేది అప్పులే
వరి ఎకరాకు 15 నుండి 20 వేలు పెట్టుబడి పెట్టిన రైతన్నకు పంట చేతికొచ్చాక అప్పులే మిగులుతున్నాయి. ఎకరాకు 30 బస్తాల ధాన్యం రావాల్సి ఉండగా.. 18 - 20 బస్తాలకు దిగుబడి మించడం లేదు. పైగా ఇటీవల కురిసిన వర్షాలకు తేమ శాతం ఎక్కువగా ఉందంటూ ధరను తగ్గించి మరీ కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. దీంతో పెట్టిన పెట్టుబడి, శ్రమ చేతికి రాకపోగా నష్టాల్లో కూరుకుపోతున్నాడు రైతన్న.
అమలుకాని మద్దతు ధర
కేంద్ర ప్రభుత్వం 2010-2011 సంవత్సరానికి ఖరీఫ్‌ పంటలకుగాను ప్రకటించిన కనీస మద్దతు ధర ఎక్కడా అమలు కావడం లేదు. వరి మొదటి రకంకు రూ.1030 గాను, సాధారణ రకంకు వెయ్యి రూపాయలు గాను ప్రభుత్వం ప్రకటించింది. కానీ తేమ సాకు చూపుతున్న వ్యాపారులు 800 నుండి 900 రూపాయల మధ్య మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. పైగా ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌ 50 రూపాయలు కూడా రైతులకు అందడం లేదు. కందులు క్వింటాల్‌కు రూ. 3000, మినుములు రూ. 2900, పెసలు క్వింటాల్‌కు రూ. 3170, పొద్దుతిరుగుడు రూ. 2350, శనగ రూ. 2300, రాగులు రూ. 965, మొక్కజొన్న, సజ్జలు రూ 880, జొన్న హైబ్రిడ్‌ రకం రూ. 880, పత్తి రూ. 3000 రూపాయలుగా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది.
వ్యాపారుల ఇష్టారాజ్యం
కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తెచ్చిన రైతులకు చుక్కెదురవుతోంది. వ్యాపారులది ఇష్టారాజ్యం కావడంతో నష్టపోతున్నారు. ఎవరైనా మద్దతు ధరపై అడిగితే... ఇష్టం ఉంటే అమ్మండి.. లేకుంటే తీసుకెళ్లండి అంటూ వ్యాపారులు నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారు. తెచ్చిన ధాన్యం ఇంటికి తీసుకెళ్లలేక, అప్పులు ఎలా తీర్చాలో తెలీక ఎంతో కొంతకు విక్రయిస్తున్నాడు. బిల్లులు కూడా ఇవ్వడం లేదని, తెల్లకాగితాలపై రాసిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.
ఇబ్బందులు కలగనివ్వం
మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ సుధాకర్‌ మాట్లాడుతూ... ధాన్యం అమ్మకాలు కొనసాగుతున్నాయన్నారు. రైతులకు మద్దతు ధర విషయంలో ఇబ్బందులు రానివ్వమని చెప్పారు.

No comments:

Post a Comment