Wednesday, December 29, 2010

నిత్యనూతనం నృత్యరంగం

నృత్యం.. ఆసక్తి రేకెత్తిస్తుంది. ఆకట్టుకుంటుంది. అలరింపజేస్తుంది. మనో వికాసాన్నిస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది. ఆనందాన్నిస్తుంది. అంతేకాదు... ఉపాధి అవకాశాలూ కల్పిస్తుంది. అందుకే అదంటే అందరికీ ఇష్టం. కూచిపూడి... కథాకళి... కథక్‌ భరతనాట్యం... నృత్య రూపమేదైతేనేం. అందులోని అపూరూప మాధుర్య మొక్కటే... కట్టిపడేసే శైలి ఒక్కటే... కనువిందుచేసే దృశ్యరూపమొక్కటే.

నృత్యం.. అదో నిత్య నూతనం. దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత చూసినా తనివి తీరదు. ఎంత నేర్చుకున్నా తరగదు. చదువూ సంధ్యలే కాదు, సృజనకూ, మానసికోల్లాసానికి తావిచ్చే కళలకు నేడు ప్రాధాన్యత పెరుగుతోంది. అందుకే హైస్కూలు విద్యార్థుల నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకూ భరత నాట్యమో, కూచిపూడో, కథకో, కథాకళో ఏదో ఒకటి నేర్చుకోవాలన్న ఆసక్తి కనబరుస్తున్నారు. ఏ చిన్న అవకాశమొచ్చినా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇతర రంగాల మాదిరే నృత్యం కూడా ఒక రంగంగా విస్తరిస్తోంది. అందుకే దానికి విపరీతమైన ఆదరణ పెరుగుతోంది.
భారతీయ సంప్రదాయంలో నృత్యం కూడా ఒక ప్రముఖ కళ. ఇందులోనూ రెండు రకాలున్నాయి. ఒకటి క్లాసికల్‌... రెండవది ఫోక్‌. ఈ రెండు కూడా ఎంతో ముఖ్యమైనవి. అత్యంత ప్రాముఖ్యత పొందిన భరతనాట్యం (తమిళనాడు) ఒడిసి (ఒరిస్సా), కథాకళి (కేరళ), కూచిపూడి (ఆంధ్రప్రదేశ్‌) కథక్‌ (లక్నో, జైపూర్‌, మణిపూర్‌) వీటితో పాటు డ్రామా, మెటీరియల్‌ ఆర్ట్స్‌... లాంటివి కూడా ఇందులో వుంటాయి.
కొందరు నృత్యరంగాన్నే తమ వృత్తిగా మార్చుకునేవారుంటారు. ఎవరైనా తమ ఆసక్తినిబట్టి ఇందులోకి ప్రవేశించవచ్చు. నృత్యం నేర్చుకోవాలంటే ప్రత్యేకించి అర్హతలేమీ అవసరం లేదు. నేర్చుకోవాలన్న ఆసక్తి, తపనే దీనికి కావాల్సిన ప్రదాన అర్హత. ఆరేళ్ల ప్రాయం నుంచే ఇందులో ప్రవేశించవచ్చు. డాన్సింగ్‌పట్ల పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని ఈ రంగంలో అఫీషియల్‌ ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్లు కూడా పుట్టుకొస్తున్నాయి. కొన్ని సంస్థలు మెట్రిక్యులేషన్‌/10+2 తర్వాత అడ్మిషన్స్‌ కల్పిస్తున్నాయి. ఇందులో పెర్ఫార్మర్‌, టీచర్‌, కొరియో గ్రఫీ కెరీర్స్‌కు మంచి డిమాండ్‌ వుంది.
సినిమాల్లో, సీరియల్స్‌లల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో డాన్స్‌ పాత్ర తక్కువేమీ కాదు. అలా మెప్పించాలంటే ఎంతో నైపుణ్యం ప్రదర్శించాల్సి వుంటుంది. అది నేర్పడంలో కొరియోగ్రాఫర్‌ కళా నైపుణ్యం, సృజనాత్మకత, కృషి చాలా కీలకంగా వుంటుంది. అంటే... డాన్స్‌ అనేది తాను సంతోషంగా వుంటూ ఇతరులను కూడా సంతోష పర్చగలిగే అద్భుతమైన కళ అన్నమాట. అయితే ఈ కెరీర్లోకి ప్రవేశించడంవల్ల పెర్ఫార్మర్‌గా, టీచర్‌గా, కొరియోగ్రాఫర్‌గా నైపుణ్యం సంపాదించవచ్చు. ఆ తర్వాత ఆయా సంస్థల్లో, సినిమాల్లో, స్కూళ్లల్లో, కాలేజీల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు. దీనివల్ల ఆదాయంతోపాటు మానసిక సంతృప్తి కూడా పొందగలుగుతారు. స్వయంగా ట్రైనింగ్‌ సెంటర్లు ప్రారంభించవచ్చు.
నృత్య రంగంలో రాణించాలంటే ఆకర్షణీయమైన ఆహార్యం కలిగి ఉండాలి. భావుకత, సమయస్ఫూర్తి, సృజనాత్మకత, అంకితభావం, మానసిక సంసిద్ధత, హుషారుతనం, స్థిత ప్రజ్ఞత, క్రమశిక్షణ కలిగి వుండాలి. నాటకంపట్ల, సంగీతం పట్ల అసక్తితోపాటు అవగాహన కలిగి వుండాలి. భారతీయ నృత్యంలో రాణించేవారు గొప్ప స్థాయికి ఎదుగుతున్నారంటే వారిలో ఉన్న ట్యాలెంటే కాదు. ఆ నృత్యంపట్ల ఆసక్తి, కృషి, పట్టుదల ఎంతగానో దోహద పడుతున్నాయి.
కొరియోగ్రఫీ
కొరియోగ్రఫీ అనేది సృజనాత్మకతతో కూడుకున్నది. సింగిల్‌గానూ, గ్రూప్‌గానూ డాన్స్‌ నేర్పడంలో వీరు ఎంతో నైపుణ్యం కలిగి వుండాలి. అంతేకాదు ఏ పాత్రకు... ఏ నృత్యానికి ఎలాంటి హావభావాలుండాలి? ఎలాంటి డ్రెస్‌సెన్స్‌ వుండాలి? ఎలాంటి అలంకరణ వుండాలి? ఎలాంటి మేకప్‌ వేేయాలి? తదితర విషయాలపట్ల వీరికి అవగాహన ఉండాలి. సంగీతంపట్ల కూడా కనీస పరిజ్ఞానం ఉండాలి. ఇందులో తమ ప్రతిభ కనబర్చినప్పుడే రాణించగలుగుతారు.
కొరియోగ్రాఫర్‌గా నైపుణ్యం సంపాదించినవారికి సినిమాల్లో, వివిధ సందర్భాల్లో ఆయా సంస్థల్లో ప్రదర్శించే ప్రోగ్రాముల్లో, మ్యూజిక్‌ షోలల్లో, టెలివిజన్‌ షోలల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. స్వయంగా కొరియోగ్రఫీ ట్రైనింగ్‌ సెంటర్‌ను ప్రారంభించి ఉపాధి పొందవచ్చు. మ్యూజికల్‌ అకాడెమి స్థాపించవచ్చు. ఢిల్లీ సంగీత అకాడమీ కథక్‌ నాట్యంలో, దర్శకత్వంలో కొరియోగ్రఫీ శిక్షణను ఇస్తోంది. బెంగుళూరు సంగీత అకాడమీ కొరియోగ్రఫీలో మూడేళ్ల డిగ్రీకోర్సును అందిస్తోంది.
టీచింగ్‌
డాన్సులో నైపుణ్యం సంపాదించినవారు టీచింగ్‌ ఫీల్డులో ఉపాధి పొందవచ్చు. పాఠశాలల్లో, కళాశాలల్లో, యూనివర్సిటీల్లో, సంగీత అకాడెమీల్లో డాన్స్‌ మాస్టర్‌గా చేరవచ్చు. ప్రస్తుతం ప్రయివేటు రంగంలో ఇలాంటి వారికి అవకాశాలు పెరుగుతున్నాయి.
పెర్ఫార్మర్‌ ఆర్టిస్ట్‌:
పెర్ఫార్మర్‌ ఆర్టిస్టుగా రాణించేవారు సంగీతంపట్ల, డాన్స్‌పట్ల చక్కటి అవగాహన కలిగి ఉండాలి. ఆకట్టుకునే నైపుణ్యం, మెప్పించే కళ, ప్రదర్శనలో సమయస్ఫూర్తి చూపగలగాలి. స్వయం ఔన్నత్యం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం కూడా ఇందుకు ఎంతో తోడ్పడతాయి. డాన్స్‌, సంగీతం, కొరియోగ్రఫీతోపాటు వివిధ కళా సంబంధిత అంశాలపట్ల కనీస అవగాహన సంపాదిస్తే పెర్ఫార్మర్‌గా రాణించడం సులువు. వీరు స్వయంగా స్కూల్స్‌ ప్రారంభించవచ్చు. ఆయా సంస్థల్లో, కాలేజీల్లో, సినిమాల్లో అవకాశాలు సంపాదించవచ్చు.
కోర్సులు-శిక్షణ
డాన్సర్‌గానే కెరీర్లో రాణించాలనుకునేవారు పదేళ్ల వయస్సు నుంచే శిక్షణా సంస్థల్లో ప్రవేశించాలి. క్వాలిఫైడ్‌ టీచర్స్‌ ద్వారా శిక్షణ పొందవచ్చు. ఫుల్‌టైమ్‌ అఫీషిియల్‌ ట్రైనింగ్‌ అయితే మెట్రిక్యులేషన్‌ తర్వాత ప్రారంభించవచ్చు. మన దేశంలోనూ రాష్ట్రంలోనూ వివిధ సంస్థలు, యూనివర్సిటీలు డ్యాన్సింగ్‌ కోర్సులు అందిస్తున్నాయి. మన రాష్ట్రంలో యూనివర్సిటీ ఆప్‌ హైదరాబాద్‌ డాన్సింగ్‌లో డిగ్రీ కోర్సును అందిస్తోంది. సరోజినీ నాయుడు స్కూల్‌ ఆఫ్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌-500134 డ్యాన్సింగ్‌ కోర్సులు అందిస్తున్నాయి.
ప్లేస్‌మెంట్స్‌
డాన్సర్లుగా చక్కటి నైపుణ్యం సంపాదించినవారు వివిధ అకాడెమీల్లో, కళాకేంద్రాల్లో, దూరదర్శన్‌, ఆల్‌ ఇండియారేడియోలో, టీచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లల్లో ఉద్యోగులుగా చేరవచ్చు. డ్రామా కంపెనీల్లో, ఎయిర్‌, టెలివిజన్‌ స్టూడియోల్లో, మూవీ స్టూడియ్లో, ఫిల్మ్‌ డివిజన్లల్లో, సాంగ్స్‌ అండ్‌ డ్రామా డివిజన్స్‌లల్లో ఉపాధి అవకాశాలుంటాయి. కార్పొరేట్‌ హౌసెస్‌, ప్రయివేటు సంస్థల్లో స్పాన్సర్‌ చేయవచ్చు. స్వయంగా సంస్థను ప్రారంభించి ఉపాధి పొందవచ్చు. మరి కొందరికీ కల్పించవచ్చు. ప్రస్తుతం డాన్సింగ్‌ అనేది వందశాతం ఉపాధి అవకాశాల రంగమని చెప్పలేం కానీ, యువతలో పెరుగుతున్న ఆసక్తినిబట్టి ఇప్పుడిప్పుడే అది విస్తరిస్తోంది. భవిష్యత్తులో ఇందులో అనేక అవకాశాలు విస్తరిస్తాయని మాత్రం నిపుణుల మాట. నిత్య నూతన మనో వికాసిని అయిన నృత్యం అనునిత్యం అందుబాటులో వుండాలని, సరికొత్త అవకాశాల మార్గమవ్వాలని ఆశిద్దాం.

No comments:

Post a Comment