
ఇంజనీరింగ్‌లో చేరినా, ఉద్యోగం చూసుకున్నా అంతా ఉన్న ఊళ్లోనే. ఇక తల్లి ఎడబాటుకు లోనైందే లేదు. ఇక కార్తీక్‌కు పెళ్లి చేయొచ్చు అనుకున్నాక వాణి హడావిడి అంతా యింతా కాదు. అమ్మాయి అందం, ఆస్థి, చదువు అన్నీ ఆరాతీసింది. ఎన్నో సంబంధాలు జల్లెడపట్టింది. అందులో తన కొడుక్కు తగ్గ అమ్మాయి అనుకున్న సురేఖను ఏరికోరి ఎంపికచేసింది. ఇంకేముంది, ఆకాశమంత పందిరి, భూదేవంత వేదికపై దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ అట్టహాసంగా కొడుకు పెళ్లిచేసింది. సురేఖ అన్నివిధాలా కార్తీక్‌కు సరితూగే ఇల్లాలు. కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన కొత్త కోడలు. కార్తీక్‌తో జీవితం, కొత్తకాపురంపైన ఎన్నో ఊహలు. కన్నవారికి దూరమవుతున్నందుకు బాధగా వున్నా... కార్తీక్ గురించిన ఆలోచనలు ఆ బాధను మరిపించేవి. అనుక్షణం భర్తతోనే గడపాలనీ, ఎన్నో ఊసులు చెప్పుకోవాలనీ, సరదాగా షికార్లకు వెళ్లాలని ఆమె కలలు కనేది. కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా రోజులు గడుస్తున్నాయి. కార్తీక్ ఆఫీసునుండి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఆత్రంగా ఎదురుచూసేది సురేఖ. తీరా అతనొచ్చాక తల్లితో కబుర్లుచెబుతూ కూర్చునేవాడు. ఎక్కడికన్నా తీసుకెళ్తాడని ఎదురుచూసేది సురేఖ. అందరూ కలిసైతేనే అంటాడు కార్తీక్. పెళ్లికి పూర్వంలాగే ఇప్పుడూ ప్రవర్తిస్తోంది తప్ప కొత్త దంపతుల ముచ్చట్లను వాణి విస్మరించింది. పెళ్లయిన తొలిరోజులంటే ఎంతో మధురమైన రోజులనీ, వాటిని వ్యర్థం చేసుకోరాదన్నది సురేఖ భావన.
ఆ కారణంగా కలిగే నిరాశ సురేఖది. ఇక్కడ ఎంతో సమన్వయంతో ఇద్దరినీ సంభాళించుకు రావాల్సిన బాధ్యత కార్తీక్‌దే. కానీ అతనక్కడ విఫలమయ్యాడు. ఫలితం భార్యాభర్తల మధ్య గొడవలు. ఒకసారి మనస్పర్థలంటూ వచ్చాక పెరగడం ఎంతసేపు? ఏ ఒక్కరి తప్పు లేకపోయినా ఆ దంపతుల మధ్య అంతులేని అగాధం ఏర్పడింది. పరిచయస్థుల ద్వారా 'ఐద్వా లీగల్‌సెల్ ' గురించి తెలుసుకున్న ఆ కుటుంబం అక్కడికొచ్చారు. సభ్యులు విడివిడిగా, కలిపి వారితో మాట్లాడారు. ముగ్గురికీ వాస్తవాలు వివరించి చెప్పడంలో సభ్యులు సఫలమయ్యారు. తరువాత తల్లి నొచ్చుకోకుండా, భార్య అసంతృప్తి చెందకుండా కార్తీక్ నూటిశాతం ప్రయత్నించాడు. అలాగే వాణి, సురేఖ ఆలోచనల్లోనూ పరిపక్వత వచ్చింది. ఇక ఆ కాపురం నల్లేరుపై బండిలా సాగిందని ప్రత్యేకంగా చెప్పాలా?!
No comments:
Post a Comment