Monday, September 23, 2013

జగన్ కు బెయిల్ మంజూరు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. అక్రమాస్తుల కేసులో 2012 మే 27న జగన్ ను సిబిఐ అరెస్టు చేసింది. 484 రోజుల పాటు ఆయన చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఈ కేసులో విచారణ జరిపిన సిబిఐ పది
ఛార్జిషీట్లను దాఖలు చేసింది. విచారణ అనంతరం క్రిడ్ ప్రోకో కేసులో 8 కంపెనీలకు సంబంధించిన ఆధారాలు లభించలేదని సిబిఐ..కోర్టుకు తెలిపింది. దీంతో జగన్ కు ఈరోజు సిబిఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది. రూ.2 లక్షల చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని న్యాయస్థానం షరతు విధించింది.  కోర్టు అనుమతి లేనిదే హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని కూడా కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కేసుతో సంబంధమున్న ఎవరిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేయకూడదని ఆదేశించింది. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయమని కోరుతూ న్యాయస్థానాన్ని సిబిఐ ఆశ్రయించవచ్చని పేర్కొంది. జగన్ కు బెయిల్ రావడంతో ఆయన అభిమానులు, వైకాపా నేతలు ఆనందోత్సవాల్లో మునిగారు.
జగన్..జైలు నుండి బెయిల్ దాకా...
జగన్ అక్రమాస్తుల కేసులో కొన్ని కంపెనీలకు సంబంధించి క్విడ్ ప్రొకో జరిగినట్లు ఆధారాలు లేవని సీబీఐ పేర్కొంది. దీనితో జగన్ కు బెయిల్ వస్తుందా ? రాదా ? అనే ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో ఇంతకాలం దర్యాప్తులో సిబిఐ తేల్చిందేమిటన్నది ఆసక్తికరంగా మారింది. మిగతా కంపెనీల విషయంలోనూ సిబిఐ ఇలానే రిపోర్టు సమర్పిస్తే పరిణామాలు ఎలా ఉంటాయని ఊహాగానాలు మొదలయ్యాయి. జగన్ ను 2012 మే 27వ తేదీన సీబీఐ విచారణకు పిలిపించి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బినామీ కంపెనీలు సృష్టించి అధికారులను పరుగులను పెట్టించి అక్రమార్జన చేశారని సీబీఐ వాదించింది. దీనితో ఆయనపై అనేక చార్జిషీటులను నమోదు చేసింది. విదేశీ నిధుల ప్రవాహంలో ఆయన పాత్రపై దర్యాప్తు వర్గాలు నిగ్గు తేల్చాయి. చార్జిషీట్ 1..2..3..4....ఇలా పలు చార్జీషీట్లను దాఖలు చేసింది. అక్రమాస్తుల చిట్టాలతో సంబంధం ఉన్న సెక్షన్లు ఆయనపై మోపింది. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన అవినీతి కథ.జగన్ ఎపిసోడ్ లో చోటు చేసుకున్న కీలక పరిణామాలు..
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్ అక్రమాస్తుల కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ ఎపిసోడ్ ను వెలుగులోకి తెచ్చింది మాజీ మంత్రి పి.శంకర్ రావు. ఆయన లేఖ తరువాత ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. తండ్రి వైఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూముల కేటాయింపు, రాయితీలు, లీజుల మంజూరు తదితరాల ద్వారా జగన్ అక్రమార్జన చేపట్టారంటూ ఎమ్మెల్యే శంకర్ రావు 2010 జనవరిలో హై కోర్టుకు ఓ లేఖ రాశారు. కోర్టు దీనిని సుమోటోగా స్వీకరించింది. ఈ లేఖను పరిశీలించిన తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశరావు దీనిని రిట్ పిటిషన్ గా మలచాలని రిజిస్ట్రార్ ను ఆదేశించారు. మొదట ఈ వ్యాజ్యాన్ని వంగాల ఈశ్వరయ్య నేతృత్వంలో ధర్మాసనం విచారించింది. తరువాత టిడిపి నేతలు ఎర్రన్నాయుడు, అశోక్ గజపతి రాజు సంయుక్తంగా ఒక పిటిషన్ దాఖలు చేయగా, రాయలసీమ నేత బైరెడ్డి మరో పిటిషన్ వేశారు. ఈ రెండు వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ క క్రూ నేతృత్వంలో ధర్మాసనం విచారించింది. జులై 12, 2011న సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించింది. ఆగస్టు 1వ తేదీన సీబీఐ అధికారులు తమ ప్రాథమిక విచారణ నివేదికను సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ నేతృత్వంలో ధర్మాసనం ఆగస్టు 10, 2011న జగన్ ఆస్తులపై పూర్తిస్థాయి సీబీఐ విచారణకు ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఆగస్టు 17న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో విజయసాయిరెడ్డి రెండవ నిందితుడిగా పేర్కొంది. అప్పటినుండి అరెస్టు వరకూ సాయిరెడ్డితో పాటు పలువురిని వందల గంటల పాటు విచారించారు. ఎఫ్ఐఆర్ లో జగన్ తో పాటు 73 మందిని నిందితులుగా పేర్కొన్న సీబీఐ తొలి చార్జిషీటులో 13 మందిని నిందితులుగా చేర్చింది. ఏప్రిల్ 23,2012లో రెండో చార్జిషీట్ ను ప్రవేశ పెట్టింది. ఇందులో మరికొన్ని లావాదేవీలపై ఆధారాలను చేర్చింది. 2012 మే 7వ తేదీన మూడో చార్జీషీట్ కోర్టుకు సమర్పించింది. ఇందులో కొన్ని లోపాలను కోర్టు గుర్తించింది. మే 15, 2012వ తేదీన ఇదే కేసులో పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలు అరెస్టు అయ్యారు. జగన్ కు మేలు చేశారన్న అభియోగంతో రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణను మే 24, 2012వ తేదీన అరెస్టు చేశారు. గుంటూరు జిల్లాలో ఉన్న జగన్ ను ఆఘమేఘాల మీద సీబీఐ విచారణ కోసం మే 25, 2012న రప్పించింది. అప్పటి నుండి మూడు రోజలు పాటు విచారించింది. అనంతరం మే 27, 2012న అరెస్టు చేశారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నేతృత్వంలో జగతి పబ్లి కేషన్ తో పాటు అనేక సంస్థల్లో సోదాలు చేశారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ మద్దతు ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఈ దశలో జగన్ ఆస్తుల కేసు ఉచ్చు మరింతగా బిగిసింది. దీనితో భయపడ్డ జగన్ వర్గం ఎమ్మెల్యేలు కొందరు వెనక్కుతగ్గి ఇతర పార్టీలకు వలస వెళ్లారు.
ఛార్జీషీట్లు ఇలా...
మొత్తం 74మందిని నిందితులుగా సిబిఐ గుర్తించింది. కేసును నాలుగు కేటగిరీలుగా విభజించింది. మొదటి కేటగిరీలో జగన్ తో పాటు ఆయనకు చెందిన సంస్థలను,రెండో కేటగిరీలో జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలను,మూడో కేటగిరీలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులను, నాలుగో కేటగిరీలో గుర్తు తెలియని వ్యక్తులను చేర్చింది. సెక్షన్ 120బి, 420ఎ, 1988 పీసీ యాక్ట్, 409, 477ఏ కింద కేసులు నమోదు చేసింది. జగన్ నివాసం,భారతి సిమెంట్,సండూర్ పవర్,జగతి పబ్లికేషన్ తోపాటు మరికొన్ని సంస్థలపై దాడులు నిర్వహించింది. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది.
మొదటి ఛార్జిషీట్..
జగన్ సంస్థలకు కీలకంగా వ్యవహరించే అడిటర్ విజయసాయిరెడ్డిని జనవరి 2న సిబిఐ అదుపులోకి తీసుకుంది. మార్చి 31వ తేదీన మొదటి ఛార్జిషీట్ (68 పేజీలు)నమోదు చేసింది. ఇందులో 13మంది నిందితులుగా, 63మందిని సాక్షులుగా పేర్కొంటూ 263డాక్యుమెంట్లతో ఛార్జిషీట్ పొందుపరిచింది.దీనిఆధారంగా పలువురిని విచారించింది.
మొదటి ఛార్జ్ షీట్ లోనిందితులు వీరే...
ఎ1జగన్, ఎ2విజయసాయిరెడ్డి, ఎ3అరబిందో ఫార్మా, ఎ4హెటిరో,ఎ5ట్రేడెంట్,ఎ6 హెటిరో ఎండి శ్రీనివాస్ రెడ్డి, ఎ7అరబిందో ఫార్మా ఎండి నిత్యానందరెడ్డి, ఎ8ట్రెడెంట్ ఎండి శరత్ చంద్ర, ఎ9బిపి ఆచార్య,ఎ10ఎపిఐఐసి జోనల్ మేనేజర్ యదలపూడి విజయలక్ష్మిప్రసాద్,ఎ11అరబిందో సిఎస్ చంద్రమౌళి,ఎ12జగతి పబ్లికేషన్,ఎ13జనని ఇన్ ఫ్రాస్ట్రక్చర్.
రెండో ఛార్జిషీట్
ఏప్రిల్ 23వ తేదీన రెండో చార్జిషీట్ నమోదు చేసింది. మొత్తం 47పేజీల చార్జిషీట్ నమోదు చేసి 30మంది సాక్షులు, 28కీలక డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించింది. 22బోగస్ కంపెనీల ద్వారా జగన్ అండ్ కో కు రూ.195కోట్లు పెట్టుబడులుగా వచ్చాయని,మిగతా రూ.107కోట్లు హైదరాబాద్ కు చెందిన16 కంపెనీల నుండి వచ్చాయని ఛార్జిషీట్లో పేర్కొంది.
మూడో ఛార్జిషీట్
మే7వ తేదీన మూడో ఛార్జిషీట్ నమోదు చేశారు. ఇందులో ఆరుగురిని నిందితులుగా చేర్చారు. (ఎ1జగన్, ఎ2విజయసాయి,ఎ3జగతి పబ్లికేషన్,ఎ4ఐఎఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి, ఎ5అయోధ్య రామిరెడ్డి, ఎ6 రాంకీ. క్విడ్ ప్రో కో ప్రాతిపదికన రాంకీకి సెజ్ లు రావడం జరిగిందని, ప్రతిఫలంగా జగతిలోకి పెట్టుబడులు వచ్చాయని సిబిఐ పేర్కొంది. '20 వేల కోట్ల రూపాయలు'జగన్ కంపెనీలకు ఎలా వచ్చాయో పలు ఆధారాలను కోర్టుకు సమర్పించింది. విశాఖపట్నం పరవాడలోని 17 ఎకరాలు, మహబూబ్ నగర్ జడ్చర్ల సమీపంలోని పొలేపల్లి లో రాంకీ ఫార్మాకి 77ఎకరాలు కట్టబెట్టారని సిబిఐ తెలిపింది.మే15వ తేదీన నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిలను సిబిఐ అరెస్టు చేసింది. అనంతరం మే 24వ తేదీన మంత్రి 'మోపిదేవి'ని అరెస్టు చేయడం తీవ్ర సంచలనం రేకెత్తించింది.
నాలుగో ఛార్జిషీట్
ఆగస్టు 13వ తేదీన నాలుగో చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో 14 మందిని నిందితులుగా చేర్చింది. 70మందిని సాక్షులుగా చేర్చింది. ఇందులో ప్రభుత్వం రూపొందించిన కొన్ని జిఒలతో అక్రమంగా 12వేల ఎకరాల దాక భూ కేటాయింపులు జరిపినట్లు సిబిఐ పేర్కొంది. దీనికి నిమ్మగడ్డ జగన్ సంస్థల్లోకి '805కోట్ల'రూపాయలు పెట్టుబడులు పెట్టారని సిబిఐ పేర్కొంది. నెల అనంతరం సెప్టెంబర్ 13వ తేదీన విచారణకు స్వీకరించింది. 25వ తేదీన మంత్రి ధర్మాన, పలువురు నిందితులు కోర్టుకు హాజరయ్యారు.
ఇందులో నిందితులు..
ఎ1జగన్, ఎ2 విజయ్ సాయిరెడ్డి, ఎ3నిమ్మగడ్డ ప్రసాద్, ఎ4మోపిదేవి వెంకటరమణ, ఎ5ధర్మాన ప్రసాదరావు(మంత్రి),ఎ6 బ్రహ్మానందరెడ్డి, ఎ7ఐఎఎస్ అధికారి మన్మోహన్,ఎ8శ్యామూల్, ఎ9 నిమ్మగడ్డ ప్రకాష్, ఎ10వాన్ పిక్ ప్రాజెక్టు,ఎ11జగతి పబ్లికేషన్స్, ఎ12రఘురామ్, భారతి సిమెంట్స్, ఎ13కార్మెల్ ఏషియా,ఎ14సిలికాన్ బిల్డర్స్.
ఐదో ఛార్జిషీట్
జగన్ అక్రమాస్తుల కేసులో గత నాలుగు చార్జిషీట్ దాఖలు చేసిన సిబిఐ ఐదో ఛార్జిషీట్ కీలకంగా మారింది. ఏప్రిల్ 8వ తేదీన ఐదో ఛార్జిషీట్ దాఖలు చేసింది. మొత్తం 13మంది నిందితులుగా చేర్చారు. ఇందులో నాలుగో నిందితురాలిగా హోం మంత్రి సబిత పేరును నమోదు చేశారు. సీబీఐ చర్య రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఆతరువాత వెంటవెంటనే కొన్ని ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. దీనితో మొత్తం ఛార్జ్ షీట్ల సంఖ్య 12కు చేరింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఛార్జిషీట్ ల ప్రసహనానికి సిబిఐ ముగింపు పలికింది. ఇప్పటి వరకూ కోర్టుకు సమర్పించిన 13 ఛార్జిషీట్ లను కలిపి ఫైనల్ షీట్ ను సిద్ధం చేసింది. ఒక్క ఎఫ్ఐఆర్ లో పలు ఛార్జిషీట్ లు దాఖలు చేయడం పట్ల సుప్రీం కోర్టు సిబిఐని ప్రశ్నించింది.
విచారణ మొదలు ఇలా...
జగన్ ఆస్తుల కేసు విచారణ సండూర్ పవర్ ప్రాజెక్టు ద్వారా ప్రారంభమైంది . వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ వ్యాపారానికి బాటలు పరిచింది ఈ ప్రాజెక్టు. ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో లబ్ధి పొందిన వారు ఇందులో పెట్టుబడులు పెట్టి తమ 'రుణం' తీర్చుకున్నారని సిబిఐ పేర్కొంది. ఇలా పెట్టుబడి పెట్టిన వాటిలో దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, భారతి సిమెంట్స్, రఘురాం సిమెంట్స్ వంటివాటితోపాటు, పలు సూట్ కేసు కంపెనీలూ ఉన్నాయి. వీటిల్లో భారత, రఘురాం సిమెంటు కంపెనీలకు కర్నూలు, తదితర ప్రాంతాల్లో సున్నపురాయి గనులను గంపగుత్తగా అతితక్కువ మొత్తానికి లీజులు ఇచ్చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం జరిగిన సమయంలో భారీ పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్న గీతారెడ్డికి పేరు కూడా చేర్చింది. పెన్నా సిమెంట్స్ అధినేత పెన్నా ప్రతాపరెడ్డి మొత్తంగా 98 కోట్ల రూపాయలు జగన్ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టారు. అదేవిధంగా దాల్మియా కంపెనీకి కృష్ణా నది నుంచి 8 టిఎంసిల నీటిని వాడుకునేందుకు వైఎస్ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయని అప్పటి భారీ నీటిపారుదల శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై సిబిఐ దష్టిసారించింది. ఇందులో భాగంగా ఓ దఫా ఆయనను విచారించింది. అదేవిధంగా ఇండియా సిమెంట్స్ అధినేత, బిసిసిఐ సభ్యుడు శ్రీనివాసన్ సైతం సిబిఐ విచారణనను ఎదుర్కొన్నారు. వీరితోపాటు గనుల లీజు, జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు సూట్ కేసు కంపెనీలు వెలిశాయి. అంటే పేపరు మీద వివరాలు మాత్రమే ఉండి, సూచించిన అడ్రస్ లో కనీసం ఆఫీసు కూడా లేని వాటిని సూట్ కేసు కంపెనీలు అంటారు. అలాంటి కంపెనీలు ముంబై, కోల్ కతా, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టు సిబిఐ విచారణలో వెలుగు చూసింది. ఈ సూట్ కేసు కంపెనీలకు, గాలి జనార్దన్ రెడ్డికి ఏమైనా సందేహాలు ఉన్నాయా..? అనే కోణంలోనూ సిబిఐ విచారిస్తోంది. ఈ క్రమంలో మరో మంత్రి కన్నాపైనా సిబిఐ కన్నేసింది.
ఇప్పటి వరకూ సిబిఐ విచారించిన వారిలో ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది ఐఎస్ లు ఉన్నారు. వీరి హయాంలో విడుదలైన వివాదాస్పద జీ.ఓ. 26ను నిగ్గు తేల్చేందుకు సిబిఐ కృషి చేస్తోంది. ఇప్పటికే మంత్రి ధర్మాన, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి పేర్లను ఛార్జిషీట్ లో నిందితులుగా సిబిఐ చేర్చింది.
బెయిల్ కోసం తిప్పలు...
జగన్ ఇప్పటివరకూ ఐదు సార్లు బెయిల్ పిటిషన్ ను వివిధ కోర్టుల్లో దాఖలు చేశారు. మొదట్లో తన అరెస్టు అక్రమమని పేర్కొంటూ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఇది కాస్తా జూన్1, 2012న తిరస్కరించబడింది. ద్వితీయ ప్రయత్నంగా 2012, సెప్టెంబర్ లో 'సుప్రీం'కు తన గోడు విన్నవించుకున్నారు జగన్. ఈ పిటిషన్ విచారణ సందర్బంగా సుప్రీం జగన్ కు గట్టి సమాధానమే ఇచ్చింది. సీబీఐ దర్యాప్తు పూర్తైతే కానీ బెయిల్ పిటిషన్ మూవ్ చేయవద్దని ఆయన తరఫు న్యాయవాదులకు ఆదేశించింది. ముచ్చటగా మూడో సారి సీబీఐ స్పెషల్ కోర్టు లో పిటిషన్ వేశారు. అయితే దీనిని తిరస్కరిస్తూ నవంబర్ 2, 2012న కోర్టు తీర్పు వెలువరించింది. నాలుగో సారి అంటే డిసెంబర్ లో తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించి..భంగపడ్డారు. ఐదోసారి సుప్రీం ను ఆశ్రయించి డీలాపడ్డారు జగన్. దాల్మియా సిమెంట్స్ పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటుగానే తుది అభియోగపత్రంగా భావించాలని జగన్ చేసిన విజ్ఞాపననూ కోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఆయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారన్న సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఇలా ఐదు సార్లు వివిధ కోర్టులు జగన్ కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాయి. చివరకు 23.09.13 న సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ పై అనుమానాలు...
 జగన్ కు బెయిల్ రావడంపై ఒక వైపు వైసిపి పార్టీలో ఆనందోత్సాహాల్లో వెల్లువిరిసాయి. అయితే మరో వైపు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తో జగన్ ఒప్పందం కుర్చుకున్నారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అందు వల్లే బెయిల్ వచ్చిందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సండూర్ పవర్, కార్మెల్ ఏషియా, పివిపి బిజినెస్ వెంచర్స్,జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాలిటీ-బ్రాహ్మణీ ఇన్ ప్రా టెక్, ఆర్.ఆర్.గ్లోబర్, సరస్వతి పవర్,మంత్రి డెవలపర్స్ లో క్విడ్ ప్రోకో ఆధారాలు లేవని కోర్టుకు సిబిఐ చెప్పడం కీలక మలుపుగా భావించవచ్చు. ఆధారాల్లేవ్ అంటూ సిబిఐ కోర్టుకు చెప్పిన తీరు చూస్తే ఏదో మతలబు ఉందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లు జగన్ బెయిల్ పిటిషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన సిబిఐ ఏవరూ ఊహించని రీతిలో ఆధారాలు లేవంటూ కోర్టుకు చెప్పింది. బెయిల్ ఇప్పించడానికే కాంగ్రెస్ అధిష్టానం పావులు కదిపి సిబిఐ తో ఇలా చేయించిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment