ఆయనపై ఎన్ని ఆరోపణలు వెల్లువెత్తినా.. అవినీతి మరకలు ఒంటినిండా అంటుకున్నా.. అక్రమాల దుర్వాసన ఆయన నుంచి వెదజల్లుతున్నా... బిసిసిఐ సభ్యులకు ఇవేవీ కనిపించలేదు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును అవినీతి మార్గాన అప్రతిహతంగా నడిపించిన రథ సారథి శ్రీనివాసన్ ను.. మరోసారి అధ్యక్ష సింహాసనంలో కూర్చోబెట్టారు. అది కూడా ఏకగ్రీవంగా..!!
లాంఛనంగా...
చెన్నైలో ఆదివారం ఉదయం 11 గంటల తర్వాత బిసిసిఐ వార్షిక సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బోర్డు సభ్యులంతా హాజరయ్యారు. అనంతరం కొత్త బోర్డును ఎన్నుకున్నారు. బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్. శ్రీనివాసన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి శ్రీనివాసన్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక లాంఛనమే అయ్యింది. ఆ తర్వాత బోర్డు సాంప్రదాయం ప్రకారం ఎన్నిక తంతు ముగించారు. బిసిసిఐ కార్యదర్శిగా సంజయ్ పటేల్, కోశాధికారిగా అనిరుధ్ చౌదరి, ఉపాధ్యక్షులుగా రాజీవ్ శుక్లా, ఎస్ కే బన్సల్, రవి సవంత్, శివలాల్ యాదవ్, మిత్ర ఎన్నికయ్యారు. వీరు కూడా ఎలాంటి పోటీ లేకుండానే నెగ్గడం విశేషం.
తీర్పు తర్వాతే...
అయితే.. శ్రీనివాసన్ అధ్యక్షునిగా నియమితులైనప్పటికీ న్యాయస్థానంలో విచారణ పూర్తయిన తర్వాతే బాధ్యతలు చేపట్టాలని సుప్రీం కోర్టు ఇదివరకే వెల్లడించింది. ఆయనకు వ్యతిరేకంగా బీహార్ క్రికెట్ అసోసియేషన్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో.. తీర్పు వచ్చే వరకూ ఆయన బాధ్యతలకు దూరంగానే ఉంటారు. ఐపిఎల్ ఫిక్సింగ్ వ్యవహారంతోపాటు, జగన్ అక్రమాస్తుల కేసులోనూ శ్రీనివాసన్ బలమైన ఆరోపణలు ఎదర్కొంటున్నప్పటికీ.. ఆయన పదవికి మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకపోవడం గమనార్హం.
No comments:
Post a Comment