Friday, September 27, 2013

'అత్తారింట్లో' పవన్ హంగామా

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్', మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్' వీరిద్దరిదీ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్. వీరి సినిమా అంటే అది ఒక సంచలనమే. చిత్రంపై భారీ అంచనాలు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు. ప్రపంచ వాప్తంగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ ఎంటర్
టైనర్ 'అత్తారింటికి దారేదీ'. చిత్ర ప్రారంభం నుంచి ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని, పైరసీ భూతాన్ని ఎదుర్కొని ఈ శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అందరు అంతా ఊహించినట్లుగానే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ టాక్ అందుకుంది. 'పవన్ కళ్యాణ్' స్టైలిష్ యాక్షన్, త్రివిక్రమ్ మాటల మ్యాజిక్... సిల్వర్ స్క్రీన్ పై మరోసారి వర్క్ అవుట్ అయ్యింది. 'గబ్బర్ సింగ్'తో ఫామ్ లోకి వచ్చిన పవర్ స్టార్ కు ఈ సినిమాతో టాలీవుడ్ లో మరో సారి తన మార్కు సూపర్ హిట్ ను అందుకున్నాడనే చెప్పవచ్చు. సక్సెస్ దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
కథ విషయానికి వస్తే.. ఇటలీలోని మిలాన్ లో రఘు నందా(బొమన్ ఇరాని) ఓ టాప్ బిజినెస్ మెన్. ఆయన మనవడే గౌతమ్ నందా(పవన్). తాతకు అన్నివేళలా గౌతమ్ అండగా ఉంటాడు. ప్రేమ పెళ్లి కారణంగా ఇంట్లో వాళ్లతో గొడవలు జరిగి ఇండియా వెళ్లిపోతుంది సునంద(నదియా) అత్తమ్మ. అయితే తన తాత కోరిక మేరకు మేనత్తను కలపడానికి మిలాన్ నుంచి హైదరాబాద్ కు చేరుకుంటాడు గౌతమ్. తర్వాత సునంద ఇంట్లో సిద్దార్థ్ పేరుతో కారు డ్రైవర్ గా పనికి కుదురుతాడు. అతర్వాత హైదరాబాద్ లో ఏమవుతుంది. తన తాత కోరికను గౌతమ్ తీర్చాడా లేదా అనేది మిగతా కథ.
నటీనటుల ఫెర్మార్మెన్స్: సినిమా అంతా పవన్ మయాజాలమే కనిపిస్తోంది. రూ.లక్ష కోట్లకు వారసుడైన గౌతమ్ నందా క్యారెక్టర్ లో అంతే రిచ్ బాడీ లాంగ్వేజ్ తో నటించాడు పవన్ కళ్యాణ్. స్టైలిష్ లుక్ , యాక్షన్ సీన్స్, కామెడీ టైమింగ్ లో కేక పెట్టించాడు పవర్ స్టార్. సీనియర్ కమెడీయన్లు బ్రహ్మానందం, అలీ కామెడీకితోడు ... పవన్ చేసిన హ్యాస్యం కలవడంతో సినిమాకు నవ్వుల వంట చాలా అద్భుతంగా వచ్చింది. ఇద్దరు హీరోయిన్లు 'సమంత', 'ప్రణీత' సినిమాకు గ్లామర్ తెచ్చారు. గత చిత్రాలతో చూస్తే సమంతది సోకాల్డ్ హీరోయిన్ పాత్ర. ఏమాత్రం ఫర్మార్మెన్స్ కు ఆస్కారం లేదు. కానీ కావాల్సినంత అందంగా కనిపించింది. ప్రణీతది కథలో ప్రాధాన్యమున్న క్యారెక్టర్. అత్తగా నదియా మెచ్యూర్డ్ ఫర్మార్మెన్స్ తో హుందాగా నటించింది. బ్రహ్మానందం, అలీ లు సినిమాకు మరో హైలెట్.
సాంకేతిక విభాగం: అత్తారింటికి దారేది హోల్ అండ్ సోల్ గా త్రివిక్రమ్ సినిమా. నిజానికి సింగిల్ లైన్ కథ ఇది. కానీ రెండున్నర గంటల సినిమాగా మలచడంలో చాలా క్రియేటివిటీ ఉపయోగించాడు త్రివిక్రమ్. స్టైలిష్ మేకింగ్ తో సినిమాకు బలం చేకూర్చాడు దర్శకుడు. త్రివిక్రమ్ కలం మరోసారి కదం తొక్కిందనే చెప్పవచ్చు. ఓ వైపు నవ్విస్తూనే...మరోవైపు లోకాన్ని చదివిన మేధావిలా డైలాగ్స్ రాయడం ఈ రచయితకే సాధ్యం. ఫస్టాఫ్ లో కథానుగుణంగా నవ్వించిన త్రివిక్రమ్. సెకండాఫ్ లో కథ సరిపోక ప్రత్యేకంగా కొన్ని కామెడీ సీన్లు రాశాడు. బ్రహ్మానందం, పవన్ మధ్య సాగే ఈ సన్నివేశాలు కొంత ప్రసహనంగా అనిపించాయి. అయితే పవన్ లాంటి స్టార్ చేస్తున్న కామెడీ కాబట్టి ప్రేక్షకులు ఆ మాయలో పడిపోయారు. అయితే దాదాపు ఎప్పుడు చేసే మూస నటన ఈసినిమాలో అక్కడక్కడా కనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ చాలా కన్విన్సింగ్ గా ఉండి..సినిమాను నిలబబెట్టింది. దేవీ మ్యూజిక్ సినిమా సక్సెస్ లో మేజర్ షేర్ దక్కుతుంది.
ప్లస్, మైనస్ లు: సినిమాకు పవన్ కళ్యాణ్ ఆల్ రౌండర్ ఫర్మార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. స్టోరీ లైన్ బాగుంది. కామెడీ సూపర్ గా వచ్చింది. హీరోయిన్ల నటన, గ్లామర్ సినిమాకు మరో ప్లస్. ఇక మైనస్ ల విషయానికి వస్తే.. పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా.. త్రివిక్రమ్ డైలాగ్ లు అక్కడక్కడ కొంత ఇబ్బంది పెట్టాయి.
ప్రస్తుతం మార్కెట్లో ఏ సినిమాలు లేకపోవడం... పవన్ లాంటి బిగ్ స్టార్ సినిమా కావడంతో 'అత్తారింటికి దారేదీ' రికార్డులు సృష్టించబోతుందని సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతుందో చూడాలి. ఇక ఈ సినిమాకు వెళితే.. అత్తారింట్లో భారీ విందు ఉంటుందని చెప్పవచ్చు. ఇక సినిమాకు '10టివి' ఇచ్చే రేటింగ్ - 3.5

No comments:

Post a Comment