ఎట్టకేలకు వైసిపి అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి
విడుదలయ్యారు. 16 నెలల పాటు జైలు జీవితం గడిపి జగన్ మంగళవారం మధ్యాహ్నం
చంచల్ గూడ జైలు నుండి బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ సందర్భంగా
వైసిపి నేతలు,
కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన
ఆయన అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం భారీ ర్యాలీగా
లోటస్ పాండ్ లోని ఆయన నివాసానికి జగన్ బయలు దేరారు. అంతకు ముందు మంగళవారం
ఉదయం నుండే చంచల్ గూడ జైలు వద్ద అభిమానుల సందడితో కోలాహలం నెలకొంది. ఉదయం
నుండే పెద్ద సంఖ్యలో వైసిపి నేతలు కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు.
జగన్ కు సోమవారమే సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే
పూచీకత్తులు సమర్పించడానికి సమయం లేకపోవడంతో, మంగళవారం ఉదయం జగన్ లాయర్లు ఆ
పని పూర్తి చేశారు. జగన్ జామీనుకు అవినాష్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి రెండేసి
లక్షల రూపాయల బాండ్ తో పూచికత్తులు సమర్పించారు. దీనితో పాటు జగన్
వ్యక్తిగత పూచీకత్తు తీసుకున్న కోర్టు జైలు నుండి విడుదల చేయడానికి
ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వు కాపీలను జగన్ లాయర్లు చంచల్ గూడ
అధికారులకు సమర్పించడంతో మధ్యాహ్నం జగన్ జైలు నుండి బయటకు వచ్చారు.
No comments:
Post a Comment