Tuesday, October 1, 2013

అమ్మో ఒకటో తారీఖు..!


కమ్ముకున్న సమ్మె సెగ సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులను అయోమయంలోకి నెట్టింది. మధ్య తరగతి జీవితాలను అతలాకుతలం చేసింది. విభజనను నిరసిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేపట్టి రెండు నెలలు కావస్తోంది. దీంతో వరుసగా రెండో నెల కూడా ఉద్యోగులకు జీతాలు రావడంలేదు. సమ్మె సెగతో ఆర్టీసీ కుదేలయింది. రెండు నెలలుగా డిపోలకే బస్సులు పరిమితం కావటంతో ఆర్టీసీ కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోయింది. రవాణా వ్యవస్ధతో పాటుగా జనజీవనం కూడా స్తంభించింది.
సీమాంధ్రలోని 13జిల్లాల్లో ఎక్కడ చూసినా సమైక్య నినాదాలు మిన్నంటుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఆందోళనలు హోరెత్తుతున్నాయి. సమ్మెతో ఒరిగే ప్రయోజనం మాటెలా ఉన్నా చిన్నాచితకా వ్యాపారులు, కార్మికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి వరకు ఉద్యోగం చేసిన తాను సమ్మె ప్రభావంతో కార్మికునిగా మారాల్సి వచ్చిందని విజయనగరం జిల్లాకు చెందిన స్వామినాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీన్ని బట్టి సమైక్యాంధ్ర నిరసనలు అల్పాదాయవర్గాలను ఎంతగా దెబ్బకొట్టిందో తెలుసుకోవచ్చు. నెల్లూరు జిల్లాలోనూ ఉద్యోగుల పరిస్ధితి ఇలానే ఉంది. సమ్మె కారణంగా జీతాలు లేవు. దీంతో చేసేది లేక ఉద్యోగులంతా ఉన్న బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు.జీతాలు లేకపోయినా పరవాలేదు సమైక్యాంధ్రకోసం త్యాగాలు చేసేందుకు సిద్ధమని చెబుతున్నారు. ఉద్యోగులు చేస్తున్న సమ్మెను విరమింపచేసేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఏదో నామమాత్రంగానే చర్చలు జరిపారన్న భావన ప్రజల్లో ఉంది. సమ్మెను ఉద్యోగులు ఇలాగే కొనసాగిస్తే సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు అలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఇప్పటికైతే అత్యవసర సేవలు మినహాయించారు కానీ అవి కూడా నిలిపేస్తే ఎస్మా ప్రయోగించే అవకాశం ఉంది. ఏది ఏమైనా సమ్మెతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు లేక ఉద్యోగులు, పనులు లేక కార్మికులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలని ప్రజలు కోరుకుంటున్నారు.

No comments:

Post a Comment