Monday, October 21, 2013

అగ్గిపెట్టెలో చీర

మీరు బట్టకట్టడం నేర్వకముందే ఇక్కడ పట్టువస్త్రాలు నేశారు...' ఇది అల్లూరి సీతారామరాజు సినిమాలో ఆ పాత్రధారి ఆంగ్లేయులను ఉద్దేశించి సగర్వంగా చెప్పిన అంశం. అగ్గిపెట్టెలో చీర..
గత వైభవాలకు ప్రతీకగా పలుచోట్ల విన్నాం.. పుస్తకాల్లో చదువుకున్నాం. నాటి చరిత్రను 1987లోనే కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల పరంధాములు నిజం చేశారు. అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసి, మరోసారి ప్రపంచాన్ని అబ్బురపరిచారు. 1993లో అది గిన్నిస్‌ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. కుట్టులేని చొక్కానూ మగ్గంపైనే నేశారు. కేవలం 600 గ్రాముల బరువుతో 112 మీటర్ల పొడవైన భారత జాతీయ పతాకం 1996లో అట్లాంటాలో నిర్వహించిన ఒలింపిక్స్‌లో ప్రదర్శించారు. ఇదీ ఆయన చరిత్ర. అనేక ప్రయోగాలు చేసిన ఆయన మరింత విస్తృతపరచాలని కలలు కన్నారు. ఆ కలలు నెరవేరకుండానే కన్నుమూశారు. అయినప్పటికీ ఆ కలలను సాకారం చేసే బాధ్యతను ఆయన కుమారుడు నల్ల విజరు తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఇంటర్‌ చదువుతున్న సమయంలోనే తండ్రి చేస్తున్న ప్రయోగాలపై దృష్టిసారించారు. మరింత మమకారం పెంచుకున్నారు. ఆర్థిక సమస్యల మూలంగా ఆయన చదువు సాగలేదు. దీంతో కలత చెందకుండా తన దృష్టిని ప్రయోగాలపై కేంద్రీకరించారు. తండ్రి అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేస్తే కుమారుడు అగ్గిపెట్టెలో అమరే శాలువాను రూపొందించారు. తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు. ఆంధ్రాభీవండిగా పేరొందిన సిరిసిల్లలో అనేక మంది మరమగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అదే బాటలో నల్ల విజరు కూడా ఉన్నారు. అది కేవలం బతుకీడ్చడానికి మాత్రమే ఉపయోగిస్తూ జీవితాన్ని తన కలలకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటున్నారు. తండ్రి నేసిన మగ్గంపైనే అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఆయన చేసిన ప్రయోగాల్లో కొత్తగా అగ్గిపెట్టెలో ఇమిడే శాలువాకు చోటు దక్కింది.దాన్ని స్థానిక ఎంపి పొన్నం ప్రభాకర్‌ ఇటీవలే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి బహూకరించారు. అగ్గిపెట్టెలో ఇమడాలంటే అతి పలుచగా ఉండాల్సిందే. అందువల్ల దానిపై మోజుతో కొనుగోలు చేయడం మినహా కట్టుకునేందుకు వీల్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకున్న విజరు ఉంగరంలో ఇమిడే చీరను తయారు చేశారు. అది కట్టుకోడానికి సైతం అనుకూలంగా ఉంది. దాని తయారీ పెంచితే, మార్కెట్‌ చేసుకునేందుకు సైతం అవకాశం ఉంది. 
తయారీ తీరు..
ప్రస్తుతం చేనేత మగ్గంపైనే ప్రయోగాత్మక నేతను కొనసాగిస్తున్నారు. 60 గ్రాముల బరువుగల అగ్గిపెట్టెలో చీర నేతకు నెల రోజుల సమయం తీసుకుంటుంది. దానికి రూ.10 వేలు ఖర్చవుతున్నాయి. 40 కౌంట్లు నిలువు, 60 కౌంట్లు అడ్డం దారంగల పట్టుతో ఈ నేత కొనసాగిస్తారు. 750 సెంటీమీటర్ల వెడల్పు, మీటరున్నర పొడవుగల శాలువా 30 గ్రాముల బరువు ఉంటుంది. 10 రోజుల్లో తయారుచేస్తారు. దీనికి రూ.5 వేలు ఖర్చవుతోంది. అందుకు అవసరమైన పట్టును వరంగల్‌ జిల్లా జనగామ నుండి తీసుకొస్తున్నారు. ఇంత సున్నితమైన నేతను ఇటీవలి వరకూ మగ్గంపై మినహా మరమగ్గాలపై నేసే అవకాశం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లోకి వచ్చిన ఆధునాత మరమగ్గాలపైనా నేసే అవకాశం ఉందని విజరు చెబుతున్నారు. అందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తే నిజంచేసి చూపిస్తానని అంటున్నారు. ఈ నేతలను మనల్ని పరిపాలిస్తున్న నేతలకు బహూకరించారు. ప్రశంసలు మినహా ఆర్థిక ప్రోత్సాహం అందలేదు. అదే గనక అందితే ఈ రాష్ట్ర ప్రతిభను దేశానికేకాదు.. ప్రపంచానికి చాటవచ్చని చెబుతున్నారు. 
బ్రాస్లెట్‌ లక్ష్యం...
మగ్గంపైనే బంగారు బ్రాస్లెట్‌ తయారుచేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు నల్ల విజరు తెలిపారు. అందుకోసం ఒకటిన్నర తులం బంగారం అవసరమని పేర్కొన్నారు. ప్రయోగాత్మకంగా రాగి తీగతో ముందుగా తయారుచేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఆర్థికంగా ప్రోత్సహిస్తే బంగారు బ్రాస్లెట్‌ కూడా త్వరలోనే మనకు సాక్షాత్కరించడం దగ్గర్లోనే ఉంది. 

No comments:

Post a Comment