Friday, January 31, 2014

జడ్జిమెంట్లు వద్దు

రకరకాల మనస్తత్వాలు, భిన్న దృక్పథాల వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కోరకం మనస్తత్వం. కొందరు అదే పనిగా తమ
ఇంటి గొప్పల్ని వల్లె వేస్తుంటే, ఇంకొందరు అన్నీ తమకే తెలుసన్నట్లు మాట్లాడతారు. ఎవరి ధోరణి వారిది. ఎవరి దృక్పథం వారిది! అయితే, ప్రతి విషయానికీ ఆ యా వ్యక్తులలోని తప్పొప్పులను ఎంచడం, వాటిని జాబితాకు ఎక్కించడం సరి కాదు. అది మనలో అనవసరంగా నెగిటివ్‌ ధోరణిని పెంచుతుంది. ఎదుటివారి గురించి జడ్జిమెంటు ఇచ్చే హక్కు, అధికారం మనకు లేవన్న సంగతి గమనించాలి. వారి ధోరణి మనకు నచ్చనంత మాత్రాన వారి విషయంలో మనం ఒక నిర్ణయానికి వచ్చేసి, విమర్శలు చేయడం తగదు. మనస్సుకు నచ్చితే స్నేహం చేయాలి. లేదంటే దూరంగా ఉండాలి. అంతేతప్ప నచ్చని గుణాలను నిరంతరం వేలెత్తి చూపుతూ మూడోవ్యక్తితో చర్చించాల్సిన పని లేదు. మనలో కూడా కొన్ని లక్షణాలు ఎదుటివారికి నచ్చక పోవచ్చుననే అంశాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు. ముఖ్యంగా ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్న విధంగానే ప్రతి వ్యక్తిలోనూ మంచి చెడూ అనేవి రెండూ ఉంటాయి. కాబట్టి, ఎదుటి వారి గురించి ప్రతికూల ఆలోచనలు పెంచుకోవడం మంచిది కాదు. ఒకవేళ అలా పెంచుకున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనమూ ఉండదన్న ఒక్క విషయాన్ని సదా గుర్తుంచుకుంటే మంచిది.

No comments:

Post a Comment