అందం, ఆకర్షణ, ఆత్మవిశ్వాసం, ఇలా మన జుట్టుకు, తలకట్టుకు ఎన్నో
ప్రయోజనాలున్నాయి. అందుకే తల మీది నుంచి కురులు కనుమరుగవుతున్న కొద్దీ
మనసులో ఏదో వెలితి మొదలవుతుంది. ఏదో కొరతగా, న్యూనతగా, లోపంగా.. ఇలా రకరకాల
భావాలు మనసులో ముసురుకుంటూ.. విపరీతమైన ఆంధోళ మొదలవుతుంది. ఇక దాన్ని
కప్పిపుచ్చుకునేందుకు.. టోపీలతో మొదలుపెట్టి విగ్గులు, గమ్మింగ్, వీవింగ్
వంటి ఎన్నో మార్గాలను ఆశ్రయిస్తుంటారు. అయితే అవన్నీ కూడా చాలా
తాత్కాలికమైనవి. ఇప్పటి వరకూ ఈ 'కేశ రాహిత్యాన్ని' అధిగమించేందుకు ఒక్క
శాశ్వత పరిష్కారం కనుగొనబడలేదు.
కారణాలు : బట్టతల అనేది స్థూలంగా జన్యుపరంగా, వంశపారంపర్యంగా వచ్చే సమస్య!
ఇది కొందరిలో 20, 30 ఏళ్లకే వస్తే మరికొందరిలో 50 ఏళ్ల తర్వాత రావచ్చు.
వయసు పెరుగుతున్నకొద్దీ హార్మోన్ల ప్రభావంతో జుట్టు వూడిపోవటం కొంత సహజమే.
కానీ వీరిలో వేగంగా రాలిపోతూ పరిస్థితి 'బట్టతల'కు దారి తీస్తుంది. బట్టతల
విషయంలో ఎన్నో సిద్ధాంతాలున్నాయిగానీ ప్రధానంగా పురుష హార్మోన్ అయిన
'టెస్టోస్టిరాన్'.. జన్యుపరమైన కారణాల రీత్యా.. వీరిలో తల మీది చర్మంలో
'డీ హైడ్రో టెస్టోస్టిరాన్'గా మారిపోతూ.. వేగంగా వెంట్రుకలు వూడిపోయేందుకు
కారణమవుతుందన్న భావన బలంగా ఉంది. అందుకే సాధారణంగా యుక్తవయసులో ఒంట్లో
టెస్టోస్టిరాన్ స్థాయి పెరుగుతుండే దశ నుంచే ఈ బట్టతల రావటమన్నదీ
మొదలవుతుంది. తల మీది వెంట్రుకలన్నీ ఒకే రకంగా కనిపించినా అవి హార్మోన్లకు
స్పందించే తీరు వేరేగా ఉంటుంది. ఈ హార్మోన్ ప్రభావం మాడు మీద, నుదురు
దగ్గరి చర్మం మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎంత బట్టతల ఉన్నవారికైనా సరే..
వెనక భాగంలోనూ.. ఇరుపక్కలా కొన్ని వెంట్రుకలు దట్టంగా మిగిలే ఉంటాయి.
బట్టతల పురుషులకే వస్తుందన్నది ఒక అపోహ. ఎందుకంటే ఇది స్త్రీలలోనూ
కనిపిస్తుంది. చాలామంది తాము వాడుతున్న షాంపూలు, నీళ్లు పడక జుట్టు
రాలిపోయిందని భావిస్తుంటారుగానీ వీటి ప్రభావం చాలా తక్కువ. బట్టతల
రావటానికి 80-90 శాతం జన్యువులు, వంశపారంపర్య లక్షణాలే మూలం.

No comments:
Post a Comment